నిజాన్ని గడప దాటిద్దామా?

నిజాలు షూ లేస్ కట్టుకునేలోగా.. అబద్ధాలు మారథాన్ చేస్తున్నాయి

Update: 2024-12-17 01:56 GMT

నిజాలు షూ లేస్ కట్టుకునేలోగా.. అబద్ధాలు మారథాన్ చేస్తున్నాయి... పట్టుకుందామన్నా పాదరసంలా జారిపోతున్నాయి. మనం మాత్రం సోషల్ మీడియా సునామీలో.. నిజానిజాలు తేల్చుకోలేని సుడిలో.. ఈదుతున్నాం... కొట్టుకుపోతున్నాం.. కాదంటారా? తారలు నేల పైకి ఎప్పటికీ దిగిరావు.. కానీ సినిమాల్లో మెరిసే ఈ తారలు మాత్రం ఇప్పుడు నేలకు దిగి వచ్చాయి. అనుకోని ఘటనలు వారిని వార్తల్లో ఉంచుతున్నాయి. కలెక్షన్లు, కటౌట్లు, రేటింగులు.. ఇవన్నీ కాదని వివాదాస్పద ఘటనలతో జన సామాన్యం అరచేతిలోని సెల్‌లో చిక్కుకుపోతున్నారు. నిన్నటి వరకు ఓ సీనియర్ హీరో, నేడు యువ హీరో.. ఈ రెండు ఘటనల్లో సామాన్య ప్రజల్లో ఉత్సుకత.. అభిమానుల్లో ఆందోళన, సోషల్ మీడియాకు మసాలా..! ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

........................

సినిమా ప్రముఖులు వివాదాల్లో చిక్కుకోవడం కొత్త ఏమీ కాదు. నాటి నుంచి నేటి వరకు ఏదో సమయంలో ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలిచిన వారే. అయితే అటువంటి సందర్భంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారు .. ఆ ప్రతిస్పందనలు, భావోద్వేగాలను ఎవరు పురిగొల్పుతున్నారు అనేది ప్రస్తుత సందర్భం. సీనియర్ హీరో కుటుంబంలో గొడవలు వారి వ్యక్తిగతం. ఎవరి ఇళ్లలో గొడవలు లేవు చూపించండి అంటూ ఆయన వేసిన ప్రశ్న సమంజసమే. కాకపోతే ఆయన సెలబ్రిటీ కావటమే ఇక్కడ పాయింట్. చట్టం, మీడియా వాటి పని అవి చేసుకొని పోయాయి. సోషల్ మీడియా ఒక అడుగు ముందుకేసి తీర్పులు కూడా చెప్పింది. నాలుగు రోజులు పాటు సీరియల్ లాగా సాగిన ఈ కుటుంబ గొడవ ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఎంటర్టైన్మెంట్‌గా మారింది. బిగ్ బాస్ షో కంటే ఎక్కువ మసాలా వారికి ఇక్కడ దొరికింది మరి. అయితే ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం మాత్రం లేదు. దాని నుంచి మనం ఏం తీసుకుంటున్నాం అనేది ప్రశ్న. చూశారా.. చూశారా.. అంత పెద్ద వాళ్లే కొట్టుకుంటున్నారు... మనం ఎంత అని సమర్ధించుకుంటున్నామా..? అయ్యో అంటూ జాలి పడుకున్నామా? ఇలా జరిగి ఉండాల్సింది కాదు అంటూ.. అభిప్రాయపడుతున్నామా..? ఏ సంఘటనైనా దాని ప్రభావం నాలుగు రోజులే..!

బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఇవేనా..?

మళ్లీ ఇంకో సంఘటన .. దానిపై చర్చ. యువ హీరో అరెస్టుతో కెమెరాలు, మైకులు అన్ని అటు మళ్ళాయి. కాసేపు సీనియర్ హీరో విషయం మర్చిపోయారు. అరెస్ట్ దగ్గర నుంచి.. రెప్పవేసే సమయం కూడా ఇవ్వలేదు. మళ్లీ అవే కామెంట్లు, తీర్పులు. కాఫీ తాగుతూ.. కారు ఎక్కుతూ మొదలైన సీన్లు.. తెల్లవారి విడుదల అయ్యేంతవరకు కునుకు కూడా లేదు. అరెస్టు.. రిమాండ్.. లంచ్ మోషన్ పర్మిషన్.. హియరింగ్.. ఆర్డర్ కాపీ టైపింగ్, కరెక్షన్స్, సిగ్నేచర్, ఆన్లైన్ అప్లోడింగ్.. వీటిలో చాలా పదాలకు మనకు అర్థం కూడా తెలియదు. వాటినే ప్రచారం చేశారు. 'క్యూరియాసిటీ కిల్డ్ ది కాట్,' అని ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. అలా అయింది వాళ్ళ పరిస్థితి. అంతటితో అయిపోలేదు. హీరోకు పరామర్శలు మరో ఎపిసోడ్. అరెస్టు రోజే ఏపీలో అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా విజన్ డాక్యుమెంట్‌ని విడుదల చేసింది. ప్రతిపక్షం రైతుల పక్షం వహించి ధర్నా చేసింది. అంతకు ముందు రోజు డజను మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్ అయ్యారు. దేశ రాజధానిలో పార్లమెంటు సమావేశాలు సాగడం లేదు. ఇవన్నీ స్క్రోలింగ్‌లకి పరిమితం అయ్యాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎలాగూ హీరోల అప్డేట్స్ ఉన్నాయి కదా..!

పంచనామా, పోస్ట్ మార్టమ్, తీర్పు...

ఈ రెండు సందర్భాలలో సోషల్ మీడియాలో ప్రజా స్పందన గమనార్హం. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్.. ఒకటేమిటి ఒకదాని వెంట ఒకటి చెక్ చేస్తూ.. గంట గంటకు మారిపోతున్న ట్విస్టులను నరాలు తెగి పోయేంత ఉత్కంఠతో చూస్తూ.. కళ్ళన్నీ సెల్ ఫోన్‌కి అప్పగించి.. వార్తల వెంట పరిగెట్టి .. అలుపొచ్చినా ఆగలేదు. ఆ ఇంటి గొడవ.. ఈ ఇంట అరెస్టు ప్రతి ఇంట్లో ముచ్చట గా మారింది. శ్రీ శ్రీ అన్నట్లు ఏది సత్యం, ఏదసత్యం.. ? ఈ ఘటనల ప్రభావం స్వల్పకాలికమే.. నాలుగు రోజులకో మరో నెలకు మరో సెలబ్రిటీ ఇంట్లో ఇంకో ఘటన జరుగుతోంది. అది వ్యక్తిగతమా.. వృత్తి గతమా.. అనవసరం. సోషల్ మీడియా పంచనామా మొదలు పెడుతుంది.. పోస్టుమార్టం చేస్తుంది.. తీర్పులు చెబుతుంది సానుభూతి చూపిస్తుంది.. దానిపనే అది.. మన ఎమోషన్స్ దానికి చమురు. చెప్పేవాడికి వినేవాడు లో అనే సామెత ఉండనే ఉంది కదా.

ఇవి ఆకలిని తగ్గిస్తాయా..?

కానీ మనకేమైంది..? ఎందుకు వాటిని వైరల్ చేస్తున్నాం. ఎవరి సమస్యలు వారికి లేవా..? కడుపునిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతోంది ఎంతమంది..? జీవనం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నాం... వరల్డ్ హ్యాపీ ఇండెక్స్‌లో 126 స్థానంలో ఉన్నాం. అత్యంత పేదరికంలో 13 కోట్ల మంది పౌరులు ఉన్నారు.. ఇది నిజం. ఇంత పెద్ద లెక్కలు మనకెందుకులే వదిలేద్దాం. అయితే ఇటువంటి ఘటనలపై ఆసక్తి చూపించడం ఆనందాన్ని పెంచుతాయా.. ఆకలిని తగ్గిస్తాయా..? కాస్త ఆలోచిద్దాం.. నిజం గడప దాటే వరకైనా ఆగుదాం.. ! అంతరిక్షానికి చేరువ అవుతున్నాం.. మన చెవులను కాస్త ఆ గోడ నుంచి.. తీసేద్దాం....!

- అనిల్ శిఖా


Similar News