జమిలి ఎన్నికల మతలబు..!

కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు

Update: 2024-12-17 01:40 GMT

కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పద్ధతిని జమిలి ఎన్నికలు అంటున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం దేశ అధ్యక్షుడైన రామనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దక్షిణ ఆఫ్రికా, జపాన్, జర్మనీ, పిలీఫైన్స్, బెల్జియం, ఇండోనేషియా లాంటి ఆరేడు దేశాలు తిరిగి జమిలీ ఎన్నికలు పాటించే దేశాల సమాచారాన్ని మన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ పద్ధతినే బీజేపీ ఇండియాలో ప్రవేశ పెట్టాలనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికలను సమర్థిస్తూ చెబుతున్న కారణాలలో అత్యంత ప్రధానమైన కారణాలను పరిశీలిద్దాం.

........................

ఎన్నికల ఖర్చు తగ్గుతుందా?

దేశంలోని వివిధ రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల నిర్వహణ కొరకు అయ్యే ఖర్చు తగ్గుతుందని ఒక వాదన వినిపిస్తుంది.ప్రస్తుతం దేశంలో ఎన్నికల నిర్వహణ కొరకు పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఒక అంచనా వుంది. ఎన్నికల కొరకు జరుగుతున్న పది వేల కోట్ల రూపాయల ఖర్చును ఎక్కువగా ఊహించుకుంటున్నది బీజేపీ. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు అయ్యే పది వేల కోట్ల ఖర్చును చూసి కన్నీరు పెడుతున్న ఆ పార్టీ ఈ దేశంలో అక్రమంగా డబ్బులు పోగు చేస్తుకున్న కార్పొరేట్లకు వేలకోట్ల రూపాయల రాయితీలను కల్పించి ప్రభుత్వానికి రావాల్సిన వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని తుంగలో తొక్కింది. ఆ విషయాన్ని పక్కన పెడితే దేశంలోని సగటు రాష్ట్రాల బడ్జెట్ యాబై లక్షల కోట్లు కాగా వంద లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్. రాష్ట్రాలవి కేంద్ర బడ్జెట్ ఐదు సంవత్సరాల కాలానికి లెక్కేస్తే ఐదు వందల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ భారతదేశ బడ్జెట్ అవుతుంది. ఐదు వందల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న భారతదేశంలో ఎన్నికల నిర్వహణ కొరకు అయ్యే పదివేల కోట్లు ఎంత శాతం అవుతుందో అర్థం కాని వారు చెబుతున్న మాటే జమిలి ఎన్నికలు.

మార్వాడీ కార్పొరేట్ల కోసమే 'జమిలి'...!

స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉత్తర భారత మార్వాడీలు, గుజరాతీలు దేశంలోని అన్ని రాష్ట్రాలపై పడి అక్కడి స్థానిక వ్యాపారస్తుల వ్యాపారాలను క్షీణింపజేసి వారి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతీయుల ప్రత్యేకించి గుజరాతీ మార్వాడీల వ్యాపారాలు కొనసాగడానికి వారిని కాపాడడం కోసం బీజేపీ తీసుకొస్తున్నవే ఒకే దేశం, ఒకే ఎన్నిక, అనే నినాదంతో జమిలి ఎన్నికలు.

జనాభాను లెక్కించలేని దుస్థితిలో కేంద్రం..!

స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేసే పద్ధతి భారత ప్రభుత్వ పాటిస్తూ వస్తున్నది. గత దశాబ్ద కాలం పైగా ఆ లెక్కలు చేయడం లేదు. ఎన్నో రకాల కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తుంది. దేశాన్ని పాలిస్తున్న ఉత్తరాభారత బ్రాహ్మనీలకు జనాభా లెక్కలు నిర్వహించడం ఒక సవాలుగా మారింది. ఎందుకంటే జనాభా లెక్కలు నిర్వహిస్తే పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలలో కేంద్రంలో నియోజకవర్గాల సభ్యుల సంఖ్యను పెంచవలసి వస్తుంది తప్పకుండా పెంచాలి కూడా. కానీ అలా పెంచితే రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రెండు మూడు వంతుల పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. మెజారిటీ సభ్యులు ఉత్తర మధ్య భారతీయ పార్లమెంట్ సభ్యులే ఉంటారు. అప్పుడు దక్షిణ భారత రాష్ట్రాల లోని ఎంపీలతో ఉత్తర, మధ్య , హిందీ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులకు ఎలాంటి అవసరం ఉండదు. కాబట్టి దక్షిణ భారత ఎపీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే అది దేశ విభజనకు దారి తీస్తుంది కాబట్టి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనాభాను లెక్కించే పరిస్థితులలో లేదు నియోజకవర్గాలను పెంచే పరిస్థితులలో లేదు.

ఒకే భాష ఒకే సంస్కృతి..!

సకల భాషలు సకల సంస్కృతులు ఉన్న ఇండియాలో సకల భాషలను నిర్వీర్యం చేసి ఉత్తర భారత భాష అయినటువంటి హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించాలని ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సకల సంస్కృతులకు నిలయమైన ఈ దేశంలో ఉత్తర భారత సంస్కృతిని దేశంలోని అన్నింటికంటే ఉన్నతమైన సంస్కృతిగా పాటించాలని ఇతర రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి మొదలు పెట్టింది. అందులో భాగమే జమిలి ఎన్నికలు.

అధ్యక్షతరహా పాలనే లక్ష్యం..

దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుంజుకొని అమెరికా దేశంలోని అధ్యక్ష తరహా పాలన అనుసరించడం కోసమే జమిలీ ఎన్నికలు. ఒకే వ్యక్తి ఈ దేశాన్ని శాసించడం కోసమే జమిలి ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. అంటే భావి భారతదేశం సమైక్య భారత్ కాదు..! అమెరికా తరహా అధ్యక్ష పరిపాలన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉండబోతుంది. అందుకోసమే జమిలి ఎన్నికల ఆరాటం.!

గుండమల్ల సత్యనారాయణ 

89199 98619


Similar News