మేడారంలో ప్రకృతి విధ్వంసం.. తప్పెవరిది?

ప్రపంచవ్యాప్తంగా జరిగే భూకంపాలు గమనించినట్లయితే

Update: 2024-12-17 02:03 GMT

ప్రపంచవ్యాప్తంగా జరిగే భూకంపాలు గమనించినట్లయితే చాలా భాగం వరకు మానవ తప్పిదాలే కారణంగా కనబడుతున్నాయి. ప్రకృతిని మానవులు నొప్పించే తీవ్ర అలజడులు, ఒత్తిడిల కారణంగా ప్రకృతి కకావికలం అవుతూ జీవ మనుగడకు తీవ్ర విఘాతం కల్పించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మానవుని స్వార్థం కారణంగా జీవవైవిధ్యం నాశనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలలో సంభవిస్తున్న భూకంపాలను ఈ కోణంలోనే చూడాలి. భద్రాచలం మొదలుకొని ఆదిలాబాద్ వరకు ఉన్న ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ప్రకృతిలో విపరీతమైన ఒత్తిడిలను కలగ చేస్తుండటం వాస్తవం.

...........................

తెగల పూర్వికులు ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతిలో జీవించడం వలన ప్రకృతి మీద ఎలాంటి అవరోధం ఏర్పడకుండా ప్రకృతిని రక్షిస్తూ జీవన విధానాన్ని కొనసాగించారు. తత్ఫలితంగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎంతో చక్కగా ఉండేది. కానీ నేటి పరిస్థితులను చూసినట్లయితే బయట సమాజం వారు ఇక్కడికి విపరీతంగా వలసలు రావడమే గాకుండా, గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కబ్జా చేశారు. ప్రకృతిని విపరీతంగా నాశనం చేస్తూ మనుగడకు గొడ్డలి పెట్టులా తయారయ్యారు. దీంతో ఇంతకు ముందు ఉన్న ప్రకృతి శోభ మాయమవుతూ పోవడం జరిగింది. ఇక్కడ అనేక ఖనిజ సంపదలకు మూలమైన ఏజెన్సీ ప్రాంతాన్ని చెర పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ మానవ మనుగడను విధ్వంసం వైపు తీసుకెళ్తున్నారు.

దిబ్బల గడ్డగా గోదావరి ప్రాంతం..

గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తోడడం, ప్రాజెక్టులు కట్టడం, ఈ కీకారణ్యంలో చెట్లను విపరీతంగా అంతమొందించడం విధ్వంసానికి కారణమవుతున్నాయి.. ఓపెన్ కాస్ట్ పేరుతో గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా దిబ్బల గడ్డగా మార్చి వేస్తున్నారు. అలాగే వివిధ పారిశ్రామిక కంపెనీల వల్ల కూడా ఇక్కడ పకృతిలో తీవ్రమైన రాపిడి జరుగుతుంది. థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఇక్కడి గోదావరి జలాల్లో కాలకూట విషాన్ని నింపుతున్నాయి. అలాగే భారజల కర్మాగారం కూడా ఈ ప్రాంతాల్లోనే విస్తరించి ఉంది.

అంతేకాదు.. ఈ నది మీదనే ఆంధ్ర ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు అంటే కొన్ని వందల హెక్టార్లలో అడవి వృక్ష సంపద కూడా జలదిగ్బంధం అయ్యే విధంగా ప్రణాళికలు సూచిస్తూ ఆచరణ దిశగా కొనసాగుతూ జీవవైవిధ్య వినాశనానికి దారితీస్తున్నారు. ప్రాజెక్టులు కూడా భూ గమనాన్ని శాసించే స్థాయిలో ఉంటాయని తెలిసిన విషయమే. కాబట్టి ప్రకృతిలో పెను విధ్వంసం సృష్టించే కార్యక్రమాలను ఇక్కడున్న ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఓపెన్ కాస్ట్‌ల పేరుతో విధ్వసం..

దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్‌ల పేరుతో విధ్వసం రోజు రోజుకు పెరగడం మనం గమనిస్తున్నాం. అందుకే భూకంపాలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో రామగుండం 88 కిలోమీటర్ల మేర, ఎల్లందు 92 కి.మీ, మహబూబాబాద్ 95 కి.మీ, మంచిర్యాల 97 కి.మీ, వరంగల్ 85 కి.మీ పరిధిలో భూకంపాలు వచ్చాయి. గడ్చిరోల్‌లో 4.0 తీవ్రతతో, భద్రాచలం 3.8 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ములుగు జిల్లా మేడారం ప్రాంతం లో 7:28 నిముషాలపాటు భూకంపాలు నమోదయ్యాయి.

అందుకే ఆదివాసి జీవన విధానాన్ని గమనించినట్లయితే ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో మమేకమై సాగుతుంది కాబట్టి ప్రభుత్వాలు వీళ్ళ జీవన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రకృతి వైవిధ్యాన్ని చక్కబెట్టే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది జీవన మనుగడకు ఎంత అవసరం.

భూకంపాలు ఎందుకు వస్తాయేంటే పర్యావరణానికి నష్టం జరగడం, భూగర్భ జలాన్ని అధికంగా దుర్వినియోగం చేయడం, అడవిలో చెట్లు నరకడం తదితర కారణాలతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్టుల్లో నీటి ఒత్తిడి భూగర్భంలో భూమి కనిపిస్తుంది.

ములుగు అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుంది..?

ఆగస్టు 31న మేడారం కేంద్రంగా సుడిగాలుల ఫలితంగానే వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. 332.02 హెక్టార్లలో 85,125 చెట్లు కూలిపోయాయి రూ. 152.64 కోట్ల నష్టం అటవీ శాఖకు వచ్చింది. డిసెంబర్ 4న మేడారం కేంద్రంగా భూకంపం వచ్చింది. మూడేళ్లుగా తెలంగాణలోని ములుగులో ఒకే ప్రాంతంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఆదివాసీ ప్రాంతంలో వనరులను, ప్రకృతినీ, ఆదివాసీ పర్యావరణ జీవన సమతుల్యతను ప్రభుత్వం గుర్తించి, రక్షణ కల్పించాలి. ప్రభుత్వం, పాలకులు, వలసవాదులు ఆర్థిక కోణం నుండి బయటకు వచ్చి, ప్రకృతి పరిరక్షణలో ఆదివాసీ ప్రజలతో మమేకం కావాలి అని జనాభిప్రాయం.


డాక్టర్ మైపతి సంతోష్ కుమార్,

టీచర్, తాడ్వాయి,

ములుగు జిల్లా.


Similar News