దాంపత్య బంధం పలుచబారిపోతోందా..?

వివాహం చేసుకుంటే, బాగానే ఉండవచ్చు. కానీ వివాహంలో సమస్యలు తలెత్తినప్పుడు పెళ్లయిన వాళ్లు ఇంట్లోనే నరకం చూస్తారు..

Update: 2024-12-15 01:15 GMT

"వివాహం చేసుకుంటే, బాగానే ఉండవచ్చు. కానీ వివాహంలో సమస్యలు తలెత్తినప్పుడు పెళ్లయిన వాళ్లు ఇంట్లోనే నరకం చూస్తారు.." గ్రీకు నాటక కర్త యూరిపిడిస్ చెప్పిన ఈ మాటలు నేటికీ ఇవి అక్షరసత్యాలుగా ఉండటం ఆశ్చ ర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే నాటికన్నా నేటి పరిస్థితులే వివాహ సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చాయి.

జీవితకాల ప్రయాణంలో..

వివాహ వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్ల నుంచే భార్యాభర్తల మధ్య చిక్కుముడులు ఉన్నాయని చెప్పడంలో సందేహించాల్సిన పనిలేదు. శారీరకంగా, మానసికంగా భిన్నమైన ఇద్దరు వ్యక్తులు వివాహం అనే బంధం ద్వారా జీవితాంతం కలిసి ఉండటం చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంది. జీవితకాల ప్రయాణంలో భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉంటున్నారనేదే ముఖ్యమైన అంశం. తమ జీవిత భాగస్వామితో ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఎలాంటి ఆందోళనలు లేకుండా ఎన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటు న్నాయి.. అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు కొందరయినా ఆలోచనలో పడిపోతారు. సమాధానం చెప్పడానికి సంశయిస్తారు. షడ్రుచుల సమ్మేళనంగా ఉండాల్సిన వైవాహిక బంధం కొందరిలో చేదుగా మాత్రమే ఎందుకు మారుతుంది.

ప్రేమ పేరిట ఆధిపత్య పోరు

బలమైన వివాహ వ్యవస్థ పలచబడటానికి కారణం ఏమిటనే ప్రశ్న ఎదురైనప్పుడు ప్రేమ లేకపోవడమో తగ్గిపోవడమో అనే సమాధానం ముందుం టుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం, అభిప్రాయాలను గౌరవించకపోవడం, ఆధిపత్యం వంటివి వైవాహిక జీవితంలో నిప్పును రాజేస్తాయి. "అతి చిన్న విషయాలు వివాహితులను కూడా పిచ్చివాళ్లను చేయగలవని, ఈ ప్రపంచంలో దుఃఖానికి సగం వరకు అవే కారణమని" ప్రఖ్యాత అమెరికన్ రచయిత డేల్ కార్నేగి అంటారు. ప్రస్తుతం విడాకుల కోసం కోర్టులకు వెళ్లే కారణాలను పరిశీలిస్తే ఇదే తెలుస్తుంది. ప్రేమికులు నిరంతరం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు నిజానికి ప్రేమ అనే ఆట ఆడుతున్నప్పటికీ లోతుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసే పోరు అది. లేకపోతే నిరంతరం ప్రేమికులు ఎందుకు గొడవ పెట్టుకుంటారు? వారు ప్రేమించుకునే సమయం కంటే గొడవలు పెట్టుకోవడానికి వెచ్చించే సమయమే ఎక్కువ.." అంటారు తత్వవేత్త నీషే. ఇవే మాటలను మరో విధంగా అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ " పాతికేళ్ల వైవాహిక జీవితం గడిపాక కానీ ఏ స్త్రీకి గాని పురుషుడికి గాని ప్రేమ అంటే ఏమిటో తెలియదు " అంటారు. మార్క్ ట్వైన్ మాటలు కాస్త హాస్యాస్పదంగా అనిపించినా లోతైన భావాలు కనిపిస్తాయి. ప్రేమ పునాదులపై నిర్మించని ఏ బంధాలు ఎక్కువ కాలం నిలబడవని వారి అభిప్రాయం.

హృదయాలు ఇచ్చిపుచ్చుకోండి కానీ...

భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి అనే ప్రశ్నకు ఖలీల్ జీబ్రాన్ 'ది ప్రొఫెట్' రచన ద్వారా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించారు. 'పెండ్లి అంటే...? ' అనే ప్రశ్నకు " ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి / కానీ, ప్రేమ ఒడంబడికను చేసుకోకండి. మీ పాత్రలు ఒకరినొకరు నింపండి /కానీ, ఒకే పాత్రలో తాగకండి. మీరు తినే రొట్టె ఒకరికొకరు యిచ్చుకోండి / కానీ, ఒక రొట్టెని యిద్దరూ తినబోకండి. మీరిద్దరు ఆడండి, పాడండి, ఆనందించండి / కానీ, మీలో మీరు ఒంటరిగా ఉండండి. మీరు హృదయాలు ఇచ్చిపుచ్చుకోండి / కానీ, ఏ ఒకరి అదుపులో ఉండనివ్వకండి. ఒకరికొకరు సన్నిహితంగా ఉండండి / కానీ, మరీ చేరువైపోకండి. ఈ మాటలు వైవాహిక జీవితానికి ప్రాథమిక సూత్రాలు. అర్థం చేసుకొని, ఆచరించగలిగితే ఉన్నతమైన జీవిత ఫలాలను ఆస్వాదించవచ్చు. జీవించడం వేరు, మనుగడ సాగించడం వేరు. ప్రేమించడమే అన్ని సమస్యలకు పరిష్కారం. " ప్రేమించడం ఆపివేసిన రోజున శారీరకంగా బతికున్నా వారు మానసికంగా మరణించినట్లే" అని నీషే చెబుతారు. అందుకే జీవి తాన్ని ప్రేమించాలి.. ఆ ప్రేమ కోసమే జీవించాలి.

- శిఖా సునీల్ కుమార్

99081 93534

Tags:    

Similar News