అతడి పాట కర్తవ్య బాట
అతడి పాటలను ఎన్నింటినో వింటుంటాం. అతడు రాసిన పాటలెన్నో పాడుకుంటాం. అతడి పాటలతో ప్రభావితం అవుతాం. ఎంతగా అంటే తెలుగు నేల అక్షరాస్యతా
అతడి పాటలను ఎన్నింటినో వింటుంటాం. అతడు రాసిన పాటలెన్నో పాడుకుంటాం. అతడి పాటలతో ప్రభావితం అవుతాం. ఎంతగా అంటే తెలుగు నేల అక్షరాస్యతా శాతం ఇరవై శాతం పెరిగేంతగా. రెండు లక్షల మంది బాల కార్మికులు బడిలో చేరేంతగా. ఆ పాట విన్న ప్రభుత్వాలు బాల కార్మిక నిర్మూలన పథకాలు చేపట్టేంతగా, కఠినమైన ముఖ్యమంత్రులను సైతం కన్నీరు పెట్టించేంతగా సున్నితమైనది అతడి పాట. అలాంటి పాటే "నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో/ నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో". బహుశా చరిత్రలో తామే రాశామని ఎంతోమంది చెప్పుకుంటున్న పాట ఇదే కావచ్చు.
నిజానికి ఈ పాట రాసింది, ఇంకెన్నో పాటలను అల్లింది నల్లగొండ జిల్లా, మేళ్ల దుప్పలపల్లి అనే పల్లెటూరి వాడు. ఏడవ తరగతిలోనే డ్రాప్ అవుట్ అయి ఎడ్లగాసి, నాగలి దున్ని వ్యవసాయానికి బాల్యాన్ని ఎరువుగా మార్చిన ఒకానొక చింతల యాదగిరి. అతడి పాటలు అందరికీ తెలుసు. అతడు మాత్రం ఎక్కువ మందికి తెలియదు.
పల్లె పాటకు కోటికి పైగా వ్యూస్
"గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది/ కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది" అంటూ చింతల యాదగిరి కంటికి కనిపించని బాధకు రూపంగా కన్నీటిని వస్తుగతంగా మనకు చూపెడుతున్నాడు. ఇలా అతను పాటను ఎత్తుకునే పల్లవే మనల్ని కట్టిపడేస్తుంది. కనుకనే ఈ పాటకు యూట్యూబ్‌లో పది మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పాట మొత్తం భావాన్ని ఒక్క పల్లవిలోనే పొదగడంలో, మొదటి లైన్లలోనే పదునైన పద ప్రయోగంతో, శ్రోతల్ని తన వైపుకు తిప్పుకోవడంలో చింతల యాదగిరికి ఉన్న టెక్నిక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి తోడు కష్టాలకు కారకులు ఎవరో తెలుసుకోమని తన పాటల ప్రశ్నలతో ప్రజల మెదళ్లని రాజేస్తున్నాడు.
రైతుపాట విని ఏడ్వనివారు లేరు..
"ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలి పోలేనే/ నేల తల్లి పొదుగును కాదని చెదిరీ పోలేనే" అని సరళంగా, సూటిగా, ఒక బలమైన స్టేట్మెంట్‌తో పాట ప్రారంభించాడు చింతల యాదగిరి. ఉన్న ఊరు, కన్నతల్లి అనే పల్లె నుడికారాన్ని ఉపయోగించడంతో ఆగిపోకుండా, ఉన్న ఊరును నేలతల్లి పొదుగు అంటూ తనదైన పద ప్రయోగం చేస్తూ మనల్ని తన పాటలోకి ఆకర్షిస్తాడు. ఆ పదబంధాల వేలు పట్టించి అక్షరాల చాల్ల వెంట తిప్పుతూ సమస్యను అర్థం చేయిస్తాడు. మనకి తెలియకుండానే మనను సమరానికి సన్నద్ధం చేస్తాడు. "అన్నదాత ఆగమవుతుండే/ పురుగుమందుతో ప్రాణాలొదిలిండే/ మట్టి బిడ్డడు మాయమవుతుండే/ మనలనిడిసీ వెళ్ళిపోతుండే/ కనికరించని కాలం తోడు/ కాటు వేసిన పాలన చూడు" అని ఆయన విలపిస్తూ రైతుల ఆత్మహత్యలపై పాడిన ఈ పాట విన్నవారెవ్వరైనా ఏడవకుండా ఉండలేరు. అంతటి ఆర్ద్రతగా పాడాడు. నిజానికి చాలామంది కవులు కరువుకు కాలాన్ని, ప్రకృతిని కారణంగా చూపిస్తారు. కానీ చింతల యాదగిరి మాత్రం రైతులను ప్రభుత్వం కాటు వేసిందని, లేదంటే లోకానికి అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకోడని తీర్మానిస్తున్నాడు.
వివక్షపై అక్షర క్షిపణి
"వలసెల్లి పోయింది ఊరు/ నేడు వల్లకాడయ్యింది చూడు" అనే పాటకు యూట్యూబ్‌లో నాలుగు మిలియన్స్ కి పైగా వ్యూస్ ఉన్నాయి. ప్రపంచీకరణ కాలుష్యంతో ధ్వంసమైపోతున్న గ్రామీణ వృత్తుల గురించి బెంగటిల్లుతూ అంటూ రాసిన ఈ పాట గోరటి వెంకన్న రాసిన "పల్లె కన్నీరు పెడుతుంది" పాటకు ఏ మాత్రం తక్కువ కాదు. అయితే చింతల యాదగిరి కేవలం కులవృత్తుల ధ్వంసం, ప్రపంచీ కరణ వ్యతిరేకత, ప్రత్యామ్నాయ ఉపాధి దగ్గరే ఆగిపోలేదు. ఒకడుగు ముందుకేసి మాదిగ "డప్పు చిటికెన పుల్ల చిర్ర చిన్నబోయె/ ఓర ఓరల కట్టె వంక సూపుల కట్టె/ మెండైన దొరలకు మిండడు ఈ కట్టె" అంటూ దళిత, బహుజన దృక్పథాన్ని రంగ రించి కుల ఆధిపత్యం మీద అక్షర క్షిపణులను విసి రాడు. డప్పు శబ్దం మనిషిని చేతనత్వంలోకి తీసుకొస్తుంది. అందుకే డప్పు, చిర్ర, చిటికెన పుల్ల అంటే దొరలకు భయం అని ఇక్కడ కవి సూచ్యం చేస్తున్నాడు.
అమ్మ శోకం ఓ.. కన్నీటి ఊట
అమ్మ గురించి రాయాలనుకుంటే ఎవరైనా అమ్మ గొప్పతనం గురించి రాస్తారు. అమ్మ త్యాగం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పిల్లల పెంపకం గురించి రాస్తారు. కానీ అమ్మకు ఇవి కాకుండా ఇంకా ఎంతో జీవితం ఉందని, కలలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని భావించాడు. కాబట్టే అమ్మ కన్నీటి ఊటలను గుర్తించి పాటగా మనముందు చర్చకు పెట్టాడు. ఈ పాటలో కన్నతల్లి, నేలతల్లి, పంటతల్లి, పక్షితల్లి, గోదావరి తల్లి ఇలా అయిదుగురు తల్లుల గోసను, గోడును అక్షరీకరిస్తాడు. ఈ అమ్మలందరూ ఎందుకు దుక్కిస్తున్నారంటే! కూలీ చేసుకుని బతికే తమ బిడ్డలకు దొరబాబులు కూలి డబ్బులు ఇవ్వడం లేదని. అందుకు పరి ష్కారం పోరాటమేనని తీర్పు ఇప్పిస్తాడు కవి. ఆ తీర్పు తనివ్వకుండా "గోదారి చెప్పింది పోరుకు దారి చూపింది" అంటాడు. అలా పాట నడిపిన విధానంలో, ముగింపులో కర్తవ్యబాట చూపడంలో చింతల యాదగిరి కవితా హృదయం, ఉద్యమ దృక్పథం, తన కన్విన్సింగ్ పోయెట్రీ స్ట్రైకింగ్‌లో ఒక కథనత్మాకత రూపుగట్టింది.
పొడిచే పొద్దుపై సంతకం
ఇలా చింతల యాదగిరి వందల పాటలు రాశాడు. ఆయన రాసిన కొన్ని పాటలతో "తీగో నాగో ఎన్నియ్యలో" అనే పుస్తకాన్ని మట్టిముద్రణలు, అలగడప వారు ముద్రించారు. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యమని చెప్పవచ్చు. తెలుగు నేల మీద మూడు దశాబ్దాలుగా పాటల వ్యవసాయం చేస్తున్నవాడు. తెలంగాణ నేల, తెలుగు భాష గర్వించదగిన గొప్ప కవి గాయకుడు. నిజానికి ఆయన పాటంటే ఆనందం కాదు. ఆవేదనల మూట. తన్మయత్వం కాదు తనువు అణువణువులో చెలరేగే ఆవేశం. తన స్వరం నిప్పురవ్వల్ని వెదజల్లే ఎర్రని కొలిమి. ఆ మండే గొంతులోంచి తన్నుకొచ్చే జీర సముద్రపు అలల హోరును, తుఫాను గాలి జోరును గుర్తు చేస్తూ పాడుతుంది. ఆయన కలంతో పొడిచే పొద్దుపై సంతకం చేస్తూ, కాలం నుదుటన మరిన్ని పదునైన పాటలు రాయాలని ఆశిద్దాం.
(నేడు బహుజన సాహిత్య అకాడమీ అవార్డును, అందుకుంటున్న సందర్భంగా)
ఎం. విప్లవకుమార్
95152 25658