వ్రతం అంటే నియమబద్ధమైన ప్రవర్తన లేక నడవడిక. శ్రావణమాసం వానలతో పాటు పండగలూ, వ్రతాల కాలం కూడానూ! స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలని వ్రతాలు చేసే కాలమిది. దీనికే నభోమాసమని మరో పేరు. సంస్కృతంలో నభః అంటే ఆకాశం. ఈ మాసంలో ఆకాశం నుండి వర్షాలు బాగా కురిసి భూమి సస్యశ్యామలం అవుతుంది కనుక ఈ పేరు వచ్చింది. వంటింట్లో, పెరట్లో, పశువుల కొట్టాల్లో పనిచేస్తూ స్త్రీ ఈ కాలంలో నిత్యం తడికాళ్లతో ఉంటుంది. పసుపు కాళ్లకు మేలు చేస్తుంది. శనగలు ఇచ్చే పోషకాలు వెలకట్టలేనిది. అందుకే కాలానుగుణంగా ఈ నెలలో చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పసుపు, శనగలదే ముఖ్య పాత్రగా ఉండేట్టు మన పూర్వీకులు జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రవణం అంటే వినడం. తర్కశాస్త్ర ప్రకారం శబ్దం ఆకాశ లక్షణం (శబ్దగుణకమాకాశం). వేదం అత్యంత శ్రేష్టమైన శబ్దధ్వని. అందుకే ఈ మాసంలో వేదమాత అయిన గాయత్రీ ఉపాసన జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రకృతికి శాంతి కలుగచేసే వేదఘోషలతో ఊరూవాడా దద్దరిల్లుతుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో మాంగల్యానికి అధిష్టానదేవతయైన మంగళగౌరీదేవిని నవవధువులు మంగళగౌరీ వ్రతం చేయడం ద్వారా ఆరాధిస్తారు. అలాగే శ్రావణంలో విష్ణుమూర్తిని అలరించే వెలుగుతో విలసిల్లే కమలాసనురాలైన లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం. ఈ మాసంలో శుక్రవారం రోజు చేసే పూజలను అందుకునే లక్ష్మి వరలక్ష్మి. లక్ష్మిని పొందడానికి ఈ కాలంలో చేసే వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణపూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారంనాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.శ్రవణానక్షత్రం ఈ మాసంలోనే ప్రకాశవంతంగా కనపడుతుంది. అలాగే చంద్రుడు శ్రవణానక్షత్రానికి సమీపంలో ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమి కావడం వల్ల ఈ నెలలో వచ్చే పౌర్ణమికి శ్రావణపూర్ణిమ అనిపేరు. సకల విద్యాధిదేవత అయిన హయగ్రీవుడు అవతరించిన ఈ రోజు యజ్ఞ క్రతువులకు, వేదాధ్యయనానికి అనువైన రోజు కావడంతో ఈ రోజున ద్విజులు నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని కూడా పేరు. ఈ పవిత్రదినాన్నే సోదరుల శ్రేయస్సు కోరుతూ చల్లని దీవెనలతో సోదరుని చేతికి రక్షాబంధనం కడుతుంది సోదరి. అందుకే ఈ రోజుని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ కాలంలో చేపట్టే కార్యక్రమాలు సామాజిక బంధాలను పటిష్టపరచటంలో తమవంతు పాత్రను పోషిస్తాయి. అతివలకు ప్రీతికరమైన శ్రావణం అందరికీ హర్షదాయకం.
(నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం)
వేమూరి శ్రీనివాస్
9912128967