ఆయన జీవిత యాత్ర ప్రేరణాత్మకం!
డా. మన్మోహన్ సింగ్ జీవితాంతం నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా జీవించారు. భారతదేశపు ఆర్థిక నిర్మాణంలో మానవతా
డా. మన్మోహన్ సింగ్ జీవితాంతం నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా జీవించారు. భారతదేశపు ఆర్థిక నిర్మాణంలో మానవతా స్పర్శను చేర్చిన ఈ మహానుభావుడు, శాంతి, సుస్థిరత, వినయపూర్వక నిరాడంబర సేవలలో తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేశారు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని చిన్న గ్రామంలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా గొప్పగా కీర్తించబడిన ఆర్థికవేత్త. సంక్లిష్ట ఆర్థిక సంక్షోభంలో ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావుకు బాసటగా నిలిచి భారతదేశ పరువు ప్రతిష్టలు కాపాడి విశేష సేవలు అందించారు. తదుపరి భారత దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన ఆయన జీవిత యాత్ర సర్వజనులకు ప్రేరణాత్మకం.
1932 సెప్టెంబర్ 26న నేటి పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో గహ్ గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్, చిన్న వయస్సు నుండే విద్యపై ప్రత్యేక ఆసక్తి చూపారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో బీఎఏ (ఆనర్స్), ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో డాక్టరేట్ పూర్తి చేశారు. "భారత ఎగుమతుల ధోరణులు, స్వావలంబన సాధన" అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన ప్రపంచ ఆర్థిక రంగంలో మార్గదర్శక సిద్ధాంత వ్యాసంగా నిలిచింది.
పెట్టుబడులకు మార్గం చూయించి..
పంజాబ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలకు సలహాదారుడిగా పనిచేసి, భారత్‌కు అంతర్జాతీయ ఆర్థిక సమా ఖ్యలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పనిచేస్తూ, బ్యాంకింగ్ రంగానికి బలమైన మూలస్తంభాలను ఏర్పాటు చేశారు. 1991లో నాటి భారత ప్రధాని పీ.వీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి, సంక్లిష్ట ఆర్థిక సంక్షోభ సమయంలో నాటి ప్రధాన మంత్రికి ఆర్థిక విషయాల్లో అపూర్వ సలహాలు ఇస్తూ భారత ఆర్థిక వ్యవస్థను రుణాల ఊబిలో నుండి బయటకు లాగి, దేశాన్ని ప్రగతి బాట పట్టించారు. ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉండగా, అప్పటి వరకు వినిమయ ఆర్థిక నియంత్రణలను తొలగించి, విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన మార్గాలను చూపించారు.
ప్రధానమంత్రిగా పాలనా కాలం
2004లో ప్రధానమంత్రిగా ఎన్నికై, రెండుసార్లు పదవిలో కొనసాగిన ఆయన, దేశాభివృద్ధికి అనేక కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి చట్టాలు రూపొందించారు. ఆయన హయాంలో ఆర్థిక వృద్ధితో పాటు పేదరికం నిర్మూలనకు పెద్దపీట వేశారు. అంతర్జాతీయంగా భారతదేశాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలపటానికి ప్రయత్నించారు. అమెరికాతో చేసిన పరమాణు ఒప్పందం, భారత అణుశక్తి అవసరాలను తీర్చడంలో కీలకమైనది. ఆయన మన దేశం కోసం ఎన్నో ఘనకార్యాలు చేసినా తన గొప్పతనం గురించి ఎక్కడా చాటుకోలేదు. నిగర్వి. విగ్రహారాధనకు, స్వంత ప్రచారాలకు వ్యతిరేకి. ఒక సాధారణ తెలుపు కుర్తా-పైజామా, నీలం రంగు పాగాతో నడచిన ఆయన వ్యక్తిత్వం అందరికి ఆదర్శం. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన నిరాడంబరత, నిజాయితీతో, నైతిక విలువలతో జీవించారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా, ఆయనను అవి ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. ఆయన ఎక్కడ మాట్లాడినా కోపం, ద్వేషం లేని శాంతి ప్రవచనాలే. అంత చదువుకున్నా ఎక్కడా పాండితీ ప్రకర్షణ ప్రదర్శించే వారు కాదు. ఆయన ప్రసంగంలో కుల, మతాలకు, రాగద్వేషాలకు అతీతంగా, అసంఖ్యాక బహుళ ప్రయోజనాలను కలిగించే విధానాలను మాత్రమే ప్రోత్సహించారు. సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమతౌల్యాన్ని నిలబెట్టారు, ఆయన సామూహిక ఐక్యతకు, అభివృద్ధికి ప్రాముఖ్యం ఇచ్చారు.
ఆయన కృషి తరతరాలు నిలిచిపోతుంది!
డా. మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో విజ్ఞానం, రాజకీయాల్లో నిజాయితీ, మానవతా విలువల కలయిక. ఆయన ఎలాంటి ప్రతిష్టలను, గొప్పలను, పొగడ్తలను ఆశించకుండానే, నిరాడంబరంగా జీవించి దేశానికి తన సేవలను అంకితం చేశారు. భారత ఆర్థిక ప్రగతికి, సామాజిక సమతౌల్యానికి ఆయన చేసిన కృషి తరతరాలూ గుర్తుండిపోతుంది. ఆయన ఇక లేరు, కానీ ఆయన స్ఫూర్తి, ఆశయాలు, మానవతా విలువలు భారతదేశ ప్రజలకు శాశ్వ తంగా, మార్గదర్శకంగా నిలుస్తాయి. దేశం ఓ మహానేతను కోల్పోయినప్పటికీ, ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శ మార్గదర్శిగా నిలుపుతుంది.
డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్
98493 28496