ఆర్థిక సంస్కర్త అస్తమయం

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశ అభివృద్ధి ప్రదాత, ఆర్థిక సంస్కరణల బాటసారి, పేదలకు ఉపాధి హామీ పథకం, అందరికీ ఆధార్

Update: 2024-12-28 01:15 GMT

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశ అభివృద్ధి ప్రదాత, ఆర్థిక సంస్కరణల బాటసారి, పేదలకు ఉపాధి హామీ పథకం, అందరికీ ఆధార్ కార్డుతోపాటు, మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప దార్శనికుడు. పీవీ విధానాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా దశలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖా మంత్రిగా పదవి చేపట్టారు ఆ పదవే ఆయనను చాలా కాలం రాజకీయాల్లో కొనసాగేలా చేసింది. అలా దేశంలో తిరుగులేని ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి బాటలు వేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. 

మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత‌దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్య పూర్తి చేసుకున్న తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్ చేశారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు..

ప్రొఫెసర్ నుంచి ప్రధాని పీఠం దాకా..

మన్మోహన్ సింగ్ 1963 నుంచి 1971 మధ్య తాను చదివిన పంజాబ్ వర్సిటీతో పాటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1971లో వాణిజ్య శాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా చేరారు. 1972లో ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దాంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తర్వాత యూఎన్సీటీఏడీ సెక్రటేరియేట్‌లో పనిచేశారు. అనంతరం 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. అంతకు ముందు సివిల్ సర్వెంట్‌గా, ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య ఆర్థికమంత్రిగా పనిచేశారు.

ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి..

పీవీ నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహునిగా భావిస్తారు. అయితే, పీవీ విధానాల అమలులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. దేశానికి 13వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు. ఆ తర్వాతే రాజకీయంగా ఆయన ప్రతిష్ట పెరిగింది. ఆర్థిక మంత్రిగా తన తొలి ప్రసంగంలోనే తన విధానమేంటో స్పష్టంగా చెప్పి దేశంలో తిరుగులేని ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి బాటలు వేశారు. పన్నులని తగ్గించారు. రూపాయి విలువ నిలబెట్టారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. పారిశ్రామిక రంగం ముందడుగు వేసింది. ద్రవ్యో ల్బణం అదుపులోకి వచ్చింది. 1990లలో వృద్ధిరేటు స్థిరంగా కొనసాగింది.

భారత్‌ను ఏ శక్తీ ఆపలేదు అంటూ..

1991 జూన్‌లో కేంద్రమంత్రి బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ అదే ఏడాది అక్టోబరులో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అసోం నుంచి వరుసగా ఐదుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2019లో ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇంగ్లీషు, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగల మన్మోహన్‌సింగ్ మేధావిగా గుర్తింపు పొందారు. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన 4వ వ్యక్తి మన్మోహన్ సింగ్. 1991లో తొలి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బాగా ప్రాచుర్యం పొందాయి. ''సమయం వచ్చినప్పుడు ఏ శక్తీ ఆపలేదు. ప్రపంచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా అవతరించడం అన్నది అలాంటి ఆలోచనే అని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నా'' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎకానమీలో 5వ స్థానంలోకి చేరుకోవడానికి వెనుక మన్మోహన్ సింగ్ కృషి ఎంతో ఉంది.

హంగు, ఆర్భాటం లేని నాయకుడు

మన్మోహన్‌సింగ్‌కి విద్యావంతుడిగా, మేధావిగా, ప్రజా సేవకుడిగా పేరున్నప్పటికీ, ఆయన ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండేవారు. తక్కువగా మాట్లాడటం, ప్రశాంతమైన ప్రవర్తన లాంటివి కూడా ఆయనకు అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. బొగ్గు గనుల కేటాయింపుల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆయన తన మౌనాన్ని సమర్థించుకున్నారు. వేల సమాధానాల కంటే అదే ఉత్తమమైనదని చెప్పారు. నేరపూరిత కుట్రకు పాల్పడటం, నమ్మక ద్రోహం, అవినీతికి సంబంధించిన అంశాలలో కోర్టుకు హాజరుకావాలని 2015లో మన్మోహన్ సింగ్‌కు సమన్లు అందాయి. తాను న్యాయ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన రిపోర్టర్లతో చెప్పారు. యూపీఏ-2 ఓటమి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేశారు.

తెలంగాణ కలను సాకారం చేసి..

చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డు, వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో పేదింటి వారికి ఎంతో మేలు చేసింది. ఇక ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. 2009లో అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు, ప్రధాని మన్మోహన్ సర్కార్ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ఆమోదించి, దశాబ్దాల కలను నెరవేర్చింది. గురువారం, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

(డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కన్నీటి జోహార్లు)

జాజుల దినేష్

96662 38266

Tags:    

Similar News