భూభారతి చట్టం ఏజెన్సీ భూములకు రక్షణ కల్పిస్తుందా?

కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల రైతులు అనేక భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని దీని స్థానంలో ఆగస్టు నెలలో ఆర్ఓఆర్ -2024

Update: 2024-12-29 01:00 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల రైతులు అనేక భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని దీని స్థానంలో ఆగస్టు నెలలో ఆర్ఓఆర్ -2024 ముసాయిదా తీసుకొచ్చి ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు సూచనలు స్వీకరించి అనేక సమావేశాల అనంతరం డిసెంబర్ 20 శాసనసభలో, 21న శాసన మండలిలో ఆర్ఓఆర్ - 2024 భూ భారతికి ఆమోదం పొందగా, ఈ చట్టంపై రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర లభించగానే రెండు మూడు నెలల్లో నియమాల తయారీ అనంతరం ఆర్ఓఆర్ భూభారతి 2024 చట్టం అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

నూతన ఆర్ఓఆర్ 2024 చట్టంలో ఆబాది/ గ్రామ కంఠం భూములకు పట్టాల పంపిణీ, గతంలో నిలిచిపోయిన 9 లక్షల పైచిలుకు సాదా బైనామా భూములకు పరిష్కారం, భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు, వారసత్వ బదిలీ, మ్యుటేషన్ల సమయంలో క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ, నిరుపేదలు నిస్సహాయులకు ప్రభుత్వం ఉచిత న్యాయ సేవ అందించేలా లీగల్ ఎయిడ్ వ్యవస్థ, భూధార్ కార్డు పంపిణీ మొదలైన అంశాలు పేర్కొనటం జరిగింది.

ఎల్టీఆర్ చట్టం ప్రకారం భూములు..

తెలంగాణ రాష్ట్రంలో ఐదో షెడ్యూల్‌లోని భూభాగం కొన్ని జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన భూముల పరి రక్షణ కోసం 1959లో ఎల్టీఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఈ ప్రాంతంలోని స్థిరాస్తులు కేవలం గిరిజనులకు, గిరిజనులతో కూడిన సొసైటీకి మాత్రమే భూములు స్థిరాస్తులపై హక్కులు కల్పించబడ్డాయి. ఈ చట్టాన్ని భారత రాజ్యాంగంలో ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడమైంది. అయితే గత ప్రభుత్వం రైతుబంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూ దస్త్రాలను, రెవెన్యూ శాఖకు చెందిన మాతృ దస్త్రాలతో పోల్చి ఆ సమాచారాన్ని భూ నిర్వహణ విధానంలో నమోదు చేసి ఆర్ఓఆర్ - 2020 చట్టాన్ని తీసుకువచ్చి ఈ డేటాని ధరణి పోర్టల్‌లో చేర్చడం జరిగింది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఐదవ షెడ్యూల్ భూ భాగంలో ప్రభుత్వ భూములు, గిరిజన భూములు చాలావరకు వలస గిరిజనేతరుల పేర్లు ధరణి రికార్డులలో నమోదవడం మూలంగా స్థానిక ఆదివాసీ గిరిజనులు ఇప్పటికీ భూ రికార్డుల పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, కిషన్ యోజన మొదలైన పథకాల లబ్ధికి దూరమైపోయారు. ఆదివాసీ గిరిజనులకు భూములు, భూ రికార్డులు, చట్టాల మీద అవగాహన లేకపోవడంతో నేటికీ తాతల తండ్రుల పేర్ల మీదనే భూ రికార్డులు నమోదై ఉన్నాయి.

గిరిజన భూములు అన్యాక్రాంతం

ఈ ప్రాంతంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ఎలాంటి భూ బదలాయింపు జరగాలన్నా ఎల్టీఆర్‌ చట్టం- 1959, 1/70 చట్టాలకు లోబడి ఎల్టీఆర్ నియమంలోని కే, ఎల్ ఫారంల ప్రకారం మాత్రమే భూ బదలాయింపులు జరగాలి. కానీ ధరణిలో ఈ నియమాలు ఏవీ పాటించకుండానే రిజిస్ట్రేషన్‌లు, మ్యుటేషన్లు జరగటంతో గిరిజన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 (భూ భారతి)లో గ్రామ కంఠం/ ఆబాది భూములకు పట్టాలు ఇస్తామని, గతంలో నిలిచిపోయిన సాదా బైనామా భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తామని పేర్కొనడంతో భూ భారతి ఏజెన్సీ భూములకు రక్షణ కల్పిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. భూ బదలాయింపులు, పట్టాల పంపిణీలన్నీ కూడా ఎల్‌టి‌ఆర్ చట్టం- 1959, 1/70 ఉల్లంఘన జరగకుండా జరగాలి. నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 నియమాలు రూపొందించే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ భూముల రక్షణ కోసం కోనేరు రంగారావు కమిషన్, గిర్‌గ్లాని గారు అనేక సూచనలను 2005 సంవత్సరంలో ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ సమస్యలు, సూచనలు నేటికీ కాగితాలకే పరిమితమైపొయాయి. వీటిని అనుసరించి ఏజెన్సీ భూములు అన్యాక్రాంతం కాకుండా భూ భారతిలో పార్ట్ - సీ కాలంలో ఏజెన్సీ ప్రాంత భూములను చేర్చి LTR చట్టానికి లోబడి భూ బదలాయింపులు జరిగేలా నియమాలు రూపొందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.

- వాసం ఆనంద్ కుమార్

ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్

94948 41254

Tags:    

Similar News