సెలబ్రిటీ భ్రమల నుంచి బయటపడాలి!
భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కుల్ని, బాధ్యతల్నీ ఇచ్చింది, ఐతే కొందరు సెలబ్రిటీలు అనే ట్యాగ్‌తో తమ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అనే
భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కుల్ని, బాధ్యతల్నీ ఇచ్చింది, ఐతే కొందరు సెలబ్రిటీలు అనే ట్యాగ్‌తో తమ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అనే భ్రమలో ఉంటున్నారు. ఇంకొందరు వీళ్లకి లొంగిపోయి భజనలు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో వీటికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది కొందరు సినిమా వాళ్లైతే, వీళ్లపై ఈగ వాలితే సహించమంటూ బీరాలు పలుకుతూ, ఇది తప్ప ఇంకే సమస్యలు లేనట్టు తమకు ఓట్లేసి ఇంతవాళ్లను చేసిన సామాన్య జనాల సమస్యలు పట్టించుకోకుండా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు గొప్పలకు పోతున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినిమా పెద్దలు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే పండిత, పామర తేడాలు లేకుండా జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
మన తెలంగాణ ఉద్యమం సాగుతున్నంత కాలం సీమాంద్ర పెట్టుబడిదారులు వారి సినిమాల్లోని విలన్లకు, కమెడియన్ క్యారెక్టర్లకు తెలంగాణ యాసను, నేటివిటీని జోడిస్తుంటే మనం ప్రతిఘటించిన విషయం సైతం ఇంకా అందరికీ మననం లోనే ఉంది. అలా ఏనాడు తెలంగాణను, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను ముందు తరాలకు అందించే ప్రయత్నం సినిమా ఇండస్ట్రీ చిత్తశుద్ధిగా చేసింది లేదనేది నిర్వివాదాంశం. సినిమా ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం వహిస్తూ హీరోలుగా చలామణి అవుతున్న టాప్ పది మంది సంపాదన ఎంత? దీనికి పరిమితి ఏంటి? ఒక రైతు కష్టానికి దక్కుతున్న ప్రతిఫలానికి వీరికి అందుతున్న పారితోషికానికీ మధ్య తేడా ఎందుకు అంతగా ఉండాలి? ఈ ప్రశ్నల్ని మనందరం వేసుకోవాలి.
అభిమానులను ఇలా పిండేస్తారా?
ఇక మరో ముఖ్య అంశం వేదికలపై ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అనునిత్యం వల్లించే మాటలు ‘అభిమాన దేవుళ్లు’ ‘అభిమానులే మా బలం, బలగం’ హీరోలనబడే ఆ నటులు చెప్పే ఈ మాటలకు, వారు చేసే చేతలకు సైతం ఏ మాత్రం పొంతన ఉండదనేది బహిరంగ రహస్యమే. ఈ మాటలే నిజమైతే ఒక్క షోకు 800కు పైగా ధరలతో బెనిఫిట్ షోలు ఎందుకు పెట్టాలి, విడుదలైన మొదటి వారం మూడింతలు, నాలుగింతలుగా టికెట్ల ధరలు నిర్ణయించడమెందుకు? నిజానికి అమాయక అభిమానుల జేబుల్లోంచి వేలాది రూపాయల్ని ఈ హీరోలనబడే సోకాల్డ్ వ్యక్తులు దోచుకొని కోట్లు కూడబెట్టేదీ ఈ అభిమానుల నుండే. ఇండస్ట్రీలోని ఓ యాభై మంది బ్యాంక్ బ్యాలెన్సులు పెంచడం కోసం వారి లక్షలాది అభిమానులు నిలువు దోపిడీకి గురవ్వాల్సిందేనా? నిజంగా లాభా పేక్ష లేకపోతే ఎందుకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకోవాలి, ఎందుకు సినిమాల్లో వాటాలు తీసుకోవాలి?
ఆది నుంచి హీరో అబద్దాలే..
ఇక పుష్ప2 విషయంలో ఒక మహిళా అభిమాని తొక్కిసలాటలో ఊపిరాడక చచ్చిపోయిందనే విషయం తెలిసీ రెండు న్నర గంటల పాటు తన సినిమా ఎంజాయ్ చేస్తూ చూసిన మనిషిని ఏమనాలి? పైపెచ్చు ముషీరాబాద్ లిమిట్స్ నుండి సంధ్య థియేటర్ వరకూ రోడ్ షో నిర్వహిస్తూ గన్నుతో కాల్చే పోజుల్ని అభిమానులపైకి వదుల్తూ అనుమతి లేకుండా వచ్చిందే కాకుండా ప్రెస్‌మీట్‌లో సిగ్గులేకుండా కఫుల్ ఆఫ్ మీటర్స్ అని అబద్దం చెప్పిన వ్యక్తిని ఎలా చూడాలి? చివరకు జరగకూడని ఒక సంఘటనని సింపుల్‌గా యాక్సిడెంట్ అని పదే పదే అంటూ ఒక మహిళ చావుని, ఒక పిల్లాడి జీవన్మరణ పోరాటాన్ని పదే పదే హేళన చేస్తుంటే అతడిని వెనకేసుకొస్తున్న వాళ్లను ఏ నడి బజార్లో నిలబెట్టాలో.., చివరకు మరింత మంది చావులకు కారణం కావొద్దని పోలీసులు బయటకు పంపిస్తే సైతం మళ్లీ రోడ్ షో చేసుకుంటూ పోయి నిస్సిగ్గుగా చట్టం, న్యాయాల్ని తుంగలో తొక్కి చివరకు ఆ బాలుడి పరామర్శకు అవే అడ్డొస్తున్నాయనడం ఎంత బరితెగింపు..?
రెండు ప్రెస్‌మీట్‌ల మధ్య ఇంత తేడానా?
అసలు యాభై మందికి పైగా బౌన్షర్లను నియమించుకోని, సినిమా హాల్ పరిసరాల్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడం, తను లోపలికి వెళ్లే క్రమంలో బౌన్సర్లతో ఇష్టారాజ్యంగా అభిమానులను తోసేయడం ఇవన్నీ పూర్తిగా అతనికి తెలిసే జరిగాయి. ఈ తోసివేతల్లోనే రేవతి చనిపోయింది. శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లాడు, దీన్ని మరిచి పదే పదే తన ప్లోకు అడ్డురావొద్దు ఎమోషనల్‌గా ఉన్నాను అంటున్న వ్యక్తి హావభావాలు, గడ్డం గీక్కోవడం, జుట్టు దువ్వుకోవడం, పదాల కోసం వెతుక్కోవడం చూస్తుంటే అది నటనే తప్ప నిజమైన ఫీలింగ్ అని ఎవరైనా అనుకుంటారా..? పోలీస్ ప్రెస్‌మీట్‌లో రేవతి గారిని కాపాడలేకపోయాననే బాధ పోలీస్ అధికారుల్లో కనిపిస్తే, పుష్ప ప్రెస్‌మీట్‌లో నన్ను ఇరికించారనే ఆవేదనే తప్ప ఒకరు చనిపోయారనే బాధ కించిత్ కూడా కన్పించలేదన్నది నేడు సమాజం చెప్తున్న మాట.
పసిబిడ్డ మరణంతో రణం చేస్తుంటే...
ఇన్ని బాధాకర సన్నివేశాలు కండ్ల ముందు కనబడుతుంటే... ఒక నిరుపేద అభాగ్యురాలు తనువు చాలిస్తే... ముక్కుపచ్చలారని బిడ్డ మరణంతో రణం చేస్తుంటే... ఇవన్నీ వదిలేసి చట్టం కాళ్లకడ్డం పడేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు, ఆ పార్టీ నేతల ప్రతిస్పందనలు, బీజేపీ మాజీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి ప్రతిస్పందనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి, ఒక్క రాత్రి జైలులో ఉన్నందుకు వీళ్లు పడుతున్న బాధను చూస్తుంటే, సెలబ్రిటీల సేవ కోసం ఎంతగా తపించిపోతున్నారో అర్థమౌతుంది. ఇప్పటికైనా ఒత్తిళ్లు తట్టుకొని పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు మనందరం సహకరించాలి, ఏ బేషజాలు లేకుండా సామా న్యుల పక్షం వహిస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి మద్దతునివ్వాలి. ఇక నుండి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే సినిమాలకే ప్రోత్సాహం, బెనిఫిట్ షోలు లేవన్న ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలి. అంతిమంగా రేవతి గారి మరణానికి న్యాయం దొరకాలి, శ్రీతేజ్ త్వరగా కొలుకోవాలి.
-పున్నా కైలాస్ నేత
జనరల్ సెక్రటరీ, టీపీసీసీ.
94921 87210