వర్గీకరణ సరే! ఉపకులాల మాటేమిటీ?

మూడు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమాల తర్వాత వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్ట్ ఈ అంశాన్ని రాష్ట్రాల చేతిలో పెడుతూ తీర్పునిచ్చింది

Update: 2024-08-27 01:00 GMT

మూడు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమాల తర్వాత వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్ట్ ఈ అంశాన్ని రాష్ట్రాల చేతిలో పెడుతూ తీర్పునిచ్చింది. అయితే, మాల మేధావుల భాగస్వామ్యం లేనిది ఈ అంశం తేలేది కాదు. అన్ని కులాలు సమాన అవకాశాలను సమానంగా పొందడానికి ఏర్పాటు చేసుకున్న మార్గమే ఈ రిజర్వేషన్స్. ఇది అంబేడ్కర్ కోరుకున్నది. అందుకే ఈ తీర్పును మాలల మీద మాదిగలు సాధించిన విజయంగా భావించరాదు. 

నిజానికి, దళిత సమస్య చాలా సున్నితమైనది. ఇది రెండు పార్టీల కొట్లాట కాదు, దశాబ్దాలుగా జరుగుతున్న అసమానతల కొట్లాట. కనుక సమస్యని పరిష్కరించటానికి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఒక కమిషన్ వేయాలి. రెండు కులాల మధ్య అధ్యయనం జరగాలి. ఆ కులాల మేధావులతో చర్చలు జరపాలి. మాలలలో వర్గీకరణ వల్ల తమకు అన్యాయం జరుగుతుందేమోనన్న అభద్రతా భావాన్ని తొలగించి వర్గీకరణ అమలు పరచాలి.

అక్కడ వేరు ఇక్కడ వేరు..

వర్గీకరణ ఉద్యమం ఆంధ్రాలో మాలల అభివృద్ధితో మొదలైనది. అన్ని రంగాల్లో మాలలే ఆధిపత్యంలో ఉన్నారని తద్వారా వర్గీకరణ జరిగితే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతామని ఇంతకాలం పోరాడింది మాదిగ దండోరా ఉద్యమం. అయితే వారు ఆంధ్ర మాలలతో పాటు తెలంగాణ మాలలను ఒకే విధమైన అభివృద్ధితో ముడిపెట్టి చూశారు. వాస్తవానికి తెలంగాణలో మాలలు మాదిగల కన్నా అభివృద్ధిలో ముందంజలో ఉన్నారనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరి అలాంటప్పుడు దేనిని ప్రాతిపదిక తీసుకుంటారు? మాల, మాదిగల జనాభా, విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా ఎంత అనే అంశాన్ని తెల్చకుండా.. వర్గీకరణ అమల్లోకి తెస్తే ఇప్పటివరకు అన్ని రకాలుగా రిజర్వేషన్ ఫలాలను అందుకున్నవారే మళ్లీ అందుకుంటారు. కనుక వర్గీకరణను మాల, మాదిగల్లో ఉన్న సంచార, అర్థ సంచార కులాల (ఉపకులాలు) వారి నుండి అమలు పరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ వర్గీకరణను కేవలం ఉద్యోగ రంగంలోనే కాదు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకు రుణాలలో కూడా సమాన రేషియోలో పంచాలని చట్టం చేయాలి. దీనివల్ల ఆ కులాల్లో పెరిగిపోయిన అసమానతలు తగ్గి వర్గీకరణ అంశానికి న్యాయం జరుగుతుంది.

ఆ ఉపకులాలు ప్రాచుర్యంలో లేవు..

ఈ నిచ్చన మెట్ల కుల వ్యవస్థలో మాల మాదిగలు ఇద్దరూ అంటరానితనంతో బలి కాబడుతున్నారు. బాధాకరం ఏమంటే ఈ పైకులాల ద్వారా ఉప కులాలు వివక్షకు గురి అవుతున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర వ్యవస్థలో ఇప్పటికీ వారు ఎలాంటి ప్రయోజనాలనూ పొందలేదు. వీరికి రాజ్యాంగ పరమైన రక్షణలు లేవు. విద్య లేనందున రిజర్వేషన్ ఫలాలను అందుకోలేదు. వీరిలో అనేక కులాలు కనీసం ఆధార్ కార్డు నోచుకోని వారు ఉన్నారు. వీరు అభివృద్ధిలో అత్యంత వెనకబాటుతనంలో ఉన్నారు. అందుకే ఈ వర్గీకరణ సంస్కరణలు వీరి నుండే మొదలు పెట్టాలి. వర్గీకరణలోని ఎ, డీలో ఉన్న మాల మాదిగ ఉపకులాలు ప్రస్తుతానికి ప్రాచుర్యంలో లేవు. గత రెండు మూడు దశాబ్దాలుగా ఊళ్లను వదిలి పట్టణాలకు వలస వచ్చిన అనేక కులాలకు ఎలా మేలు జరుగుతుంది? ప్రధాన స్రవంతికి సంబంధంలేని కులాలైన డక్కలి, బేడా, బుడగ జంగం, చిండు, హోలీయ దాసరి, రెల్లి, మాదిగ మాస్టిన్, కులాలు మాదిగ కేటగిరిలో ఉన్నాయి. విద్య ఉద్యోగ రంగాల్లో వీరి వాటా ఒక శాతం కూడా ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ముందున్న మాదిగలతో ఈ కులాలను కలపడం వల్ల వీరికి నష్టం జరుగుతది. అంతేకాకుండా మాలల్లో కూడా అంతర్గతంగా ఉన్న సామాజిక వివక్ష వల్ల ఉపకులాల్లో ఉన్న మాల మాస్టిన్‌తో పాటు మరికొన్ని కులాలు ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందడం లేదు. అంతేకాదు ఈ జాతులు అంతరించిపోతున్నాయి. వీరికి న్యాయం జరగాలంటే వీరిని ప్రత్యేక సెక్షన్‌గా ప్రకటించి, ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి.

జనగణన జరగాలి..

ఈడబ్ల్యూఎస్ కోటాలో పది శాతం కూడా లేని వారు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్స్ అందుకుంటున్నారు. ఈ వర్గీకరణలోనూ క్రిమిలేయర్ అమలు పరిస్తే రిజర్వేషన్స్‌కి ముప్పు తెచ్చే విధంగా మొన్నటి సుప్రీం తీర్పు ఉంది. ఒక రకంగా ప్రభుత్వాలే ఇలాంటి కుట్రలను కోర్ట్‌ల ద్వారా చేయిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు, ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలపై సమిష్టి కృషితో పోరాడాలి.

దళితుల ఉమ్మడి రిజర్వేషన్లను అనుభవించే విషయంలో అంతర్గతంగా అసమానతలు ఉన్నాయంటున్నారు. కానీ వాటికీ సంబంధించిన గణాంకాలు గత ఇరవై సంవత్సరాలుగా అందుబాటులో లేవు. మాదిగ దండోరా ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్న పరిస్థితులకి నేటికీ విద్య, ఉద్యోగ రంగాల్లో విధానపరమైన మార్పులు చాలా జరిగాయి. వర్గీకరణ జరగడం ఇప్పుడు అనివార్యమైంది కనుక ముందుగా మాల మాదిగల జనగణన జరగాలి. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతో ముడి పెట్టకుండా పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచి వర్గీకరణను అమలు చేయాలి. అప్పుడే మాల మాదిగలకు న్యాయం జరుగుతుంది.

-సునీల్ నీరడి

ఉస్మానియా యూనివర్సిటీ

94390 21021

Tags:    

Similar News