రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు.. రేవంత్ రెడ్డి భారీ ప్లాన్

విద్యా విధాన పత్రం’ అనేది ఒక రాష్ట్రం లేదా దేశం విద్యా రంగ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్రామాణిక ధృవపత్రం. ఇది విద్యను సామాజిక న్యాయ

Update: 2025-04-06 01:15 GMT
రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు.. రేవంత్ రెడ్డి భారీ ప్లాన్
  • whatsapp icon

‘విద్యా విధాన పత్రం’ అనేది ఒక రాష్ట్రం లేదా దేశం విద్యా రంగ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్రామాణిక ధృవపత్రం. ఇది విద్యను సామాజిక న్యాయ సాధనంగా మార్చే వ్యూహాత్మక దృక్పథం కూడా. తెలంగాణలో విద్యను శక్తివంతమైన సాధనంగా మలిచి, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పిం చేందుకు సమగ్ర ‘విద్యా విధాన పత్రం’ రూపొందించడం అత్యవసరం.

 దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకంగా వ్యవహరించే ప్రాముఖ్యత గల ఈ అధికారిక పత్రం విద్యారంగ లక్ష్యాలు, విధానాలు, అమలు ప్రణాళికలను సమన్వయంగా ప్రతిపాదిస్తూ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నూతన దిశలో తీర్చిదిద్దేందుకు మార్గదర్శిగా నిలుస్తుంది.

రాష్ట్రాభివృద్ధికి పునాది వేస్తూ..

ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర అభివృద్ధి, నూతన సాంకేతికతల వినియోగం, డిజిటల్ విద్యా ప్రోత్సా హం, పరిశోధనకు మద్దతు ఈ విధానంలో ప్రాధాన్యత పొందుతాయి. అలాగే వృత్తిపర విద్య, ఉపాధ్యాయ శిక్షణ, నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో రూపుదిద్దిన ఈ విధానం, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి శక్తివంతమైన పునాది వేస్తుంది. దీని అమలుకోసం విద్యా బడ్జెట్‌లో తగిన నిధుల కేటాయింపు, విడుదల చేయడం కూడా ముఖ్యాంశమే. విద్యార్థులకు విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను అందించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు అనువైన వాతావరణం సృష్టించవచ్చు. అంతేకాకుండా, వృత్తిపర విద్యను ప్రోత్సహించడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించడం, ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపడం వంటి అంశాలు విద్యావిధానంలో ప్రధానంగా పరిగణించబడతాయి. తద్వారా సమాజానికి మెరుగైన విద్యా సేవలను అందించవచ్చు. తద్వారా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ విద్యా రంగ ఎదుగుదలకు మార్గం సుగమం అవుతుంది.

సవాళ్లు అనేకం..

తెలంగాణ ప్రభుత్వం విద్యను ప్రజా హక్కుగా అభివృద్ధి చేస్తూ, అందరికీ నాణ్యమైన, సమానమైన, ఆచరణాత్మక విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, సమాజ అభివృద్ధికి బలమైన బాట వేయడం ముఖ్య లక్ష్యంగా విద్యా విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ పత్రం క్షేత్రస్థాయిలో అమలుకు అనుకూలంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అయితే, దీని రూపకల్పనలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అనేక సవాళ్లు ఎదురవుతాయి. ‘క్షేత్రస్థాయిలో’ ఆర్థిక పరంగా, తగినంత నిధుల లభ్యత లేకపోవడం, ప్రభుత్వ బడుల అభివృద్ధికి తక్కువ బడ్జెట్ కేటాయించబడడం, మౌలిక వసతుల కల్పనలో ఆటంకాలు, అదనంగా, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే అవకాశం ఉండడంతో పాటు, కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చే ప్రమాదం ఉంది. సామాజికంగా చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగు పరిచే చర్యలు అవసరం, సాంకేతిక విప్లవం కారణంగా డిజిటల్ లెర్నింగ్ అందరికీ అందుబాటులో లేకపోవడం, గ్రామీణ విద్యార్థులు ఆన్‌లైన్ విధానాలను అనుసరించలేకపోవడం కూడా ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమా ణాల లోపం, డిజిటల్ విభేదాలు, బ్యూరోక్రటిక్ జాప్యం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి సవాళ్లను అధిగమించి విద్యా విధానాన్ని సమర్థంగా అమలు చేయాలంటే, ప్రభుత్వ పాలన, ప్రజల భాగస్వామ్యం, నిపుణుల మార్గదర్శనం, ఉపాధ్యాయుల సహకారం కీలకంగా మార తాయి. లేకపోతే, ఈ విధాన లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితం కావడం అనే ప్రమాదం ఉంది.

మార్పులు చేయడం ఉత్తమం

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నూతన జాతీయ విద్యా విధానం - 2020ను అనుసరించడం వల్ల కేంద్ర నిధుల మద్దతు, విద్యా ప్రమాణాల పెరుగుదల, సాంకేతికత వినియోగం లాంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఖర్చు పెరగడం, మాతృభాష పరిమితులు, ప్రైవేటీకరణ పెరగడం వంటి సవాళ్లు ఉంటాయి. 5+3+3+4 మోడల్ ద్వారా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. డిజిటల్ లెర్నింగ్, కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పట్టణ-గ్రామీణ విద్య తేడా తగ్గుతుంది. బహుళ అనుబంధ విధానం విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ -2020కి వ్యతిరేకంగా ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందిస్తే, రాష్ట్ర విద్యార్థులకు అనుకూల మార్పులు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర నిధుల కోత, జాతీయ పరీక్షల్లో పోటీ సామర్థ్యం తగ్గిపోవడం, ప్రైవేటీకరణ పెరగడం, సాంకేతికతలో వెనుకబడే ప్రమాదం ఉంటాయి. దీనిలోని ‘ఉత్తమ అంశాలను’ రాష్ట్ర ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా స్వీకరించి మార్పులు చేయడం ఉత్తమం. దీని ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థకు నాణ్యత, నూతన సాంకేతికతలు, కేంద్ర మద్దతు లభించడంతో పాటు రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు కూడా పరిరక్షించబడతాయి.

సమిష్టి బాధ్యతగా..

విద్యా ప్రమాణాల తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా అధిగమించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం తమ బాధ్యతలను నిర్వహించాలి. ఉపాధ్యాయులు విజ్ఞానం అందించడమే కాకుండా, ప్రాయోగిక బోధన, స్మార్ట్ లెర్నింగ్, డిజిటల్ టూల్స్ వినియోగంతో బోధనను నవీకరించాలి. విద్యార్థులు మార్కులకు పరిమితం కాకుండా, మౌలిక అవగాహన పెంచుకోవాలి. ఉపాధ్యాయులు మానసిక అనుబంధాన్ని పెంపొందించి, విద్యార్థుల సమస్యలకు మద్దతు అందించాలి. తల్లిదండ్రులు పిల్లల చదువును ప్రోత్సహించి, వారి ప్రగతిని పర్యవేక్షించి, ఇంట్లో అనుకూల వాతావరణం కల్పించాలి. పిల్లల ఆసక్తులను గుర్తించి, డిజిటల్ లెర్నింగ్, ఆన్‌లైన్ వనరులను వినియోగించేందుకు ప్రేరేపించాలి. సమాజం విద్యా ప్రాధాన్యతను గుర్తించి, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులకు గౌరవం, మద్దతుతో నాణ్యమైన బోధనకు తోడ్పడాలి. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం సమష్టిగా పని చేయాలి. నాణ్యమైన బోధన, మార్గదర్శకత్వం, సమాజం నుంచి ప్రోత్సాహం లభిస్తే, విద్యా ప్రమాణాలు మెరుగై, భవిష్యత్తు తరాలకు దోహదం అవుతాయి.

నంగె శ్రీనివాస్

విద్యా విశ్లేషకులు,

94419 09191 

Tags:    

Similar News

మళ్లీ..