శ్రీరామ నామాన్ని ఉచ్చరిస్తే.. మన పాపాలు తొలగిపోతాయా?

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్

Update: 2025-04-06 01:00 GMT

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ మూహర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో దశ రథ మహారాజు కౌసల్య దంపతులకు జన్మించాడు. శ్రీరామచంద్రుడు శ్రీమహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. 

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఏటా వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలొస్తారు. శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడు జరిగినదని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది.

రాముడి జననం..

శ్రీరామ నవమి చరిత్ర మననం చేసుకుంటే రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు.. కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి సంతానం లేదు. దీంతో రాజ్యానికి వారసులు ఉండరని వశిష్ఠ మహాముని రాజుని పుత్ర కామేష్టి యాగం చేయ మని సలహా ఇచ్చారు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్ప చెప్పమన్నారు. వెంటనే దశరథుడు అయన ఆశ్రమానికి వెళ్లి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు, అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చారు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మానం తొమ్మిదవ రోజైన నవమినాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్షణ శతృఘ్నలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థయ అవతరించిన శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు. నవమి నాడు అనుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలముండు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక - లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం.

రామనామ స్మరణతో..

సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీవుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాలుగేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు. ఈ పండుగ సందర్భంగా భక్తులు చిన్న సీతారామ విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంలో తొమ్మిది రోజు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. ఉత్సవంలో విశేషాలు ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం ఈ ఉత్సవానికి భక్తులు - సంఖ్యలో తరలి వస్తారు. అల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఈ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ' మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని పెద్దల ఉవాచ!

(నేడు శ్రీరామ నవమి సందర్భంగా..)

- పాల్వంచ హరికిషన్

95024 51780

Tags:    

Similar News