సఫాయికి సౌకర్యాలు కల్పించరా?
హైదరాబాద్ మహానగరం అందమైన పరిశుభ్రత కలిగిన నగరం అని గతంలో ఘనంగా కీర్తింపబడేది.

హైదరాబాద్ మహానగరం అందమైన పరిశుభ్రత కలిగిన నగరం అని గతంలో ఘనంగా కీర్తింపబడేది. అయితే, రాను రానూ పెరుగుతున్న జనాభా, గృహాల సముదాయాలు ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు విస్తృత స్థాయిలో ఏర్పడి సమయానుకూలమైన యాజమాన్య పద్ధతులు పర్యవేక్షణ అవలంబించకపోవడం వలన ప్రస్తుతం హైదరాబాద్ గత కీర్తి ప్రతిష్టలకు నోచుకోవడం లేదు. ఇక ఈ నగరాన్ని ఉదయాన్నే శుభ్రపరచడానికి సఫాయి ఉద్యో గులు తమ శక్తి వంచన లేకుండా ఏ కాలమైనా విధులను నిర్వహిస్తుంటారు. వీరి సేవలకు పాదాభివందనం చేయవలసిందే. ముఖ్యంగా స్త్రీలు నిర్వహిస్తున్న తీరును ప్రశంసించతగినది. తాము వీధులను ఉడ్చడానికి సంవత్సరానికి ఒకసారి చీపురు కట్టలను రక్షణకు కావలసిన చేతి గ్లౌజులు, మాస్కులు, చేతులు శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ వాష్‌తో కూడిన కిట్స్‌ను గతంలో అందజేసేవారని ఈ ఉద్యోగులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ కిట్స్‌ను అందజేయడం లేదని వారు వాపోతున్నారు. అలాగే వీరి సేవలను కేవలం వీధులు శుభ్రం చేసుకోవడానికి కాకుండా, ఇతర పనులకు కూడా ఉపయోగించడం వలన శుభ్రత లోపిస్తున్నది. వాడలల్లో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికిన తర్వాత వాటిని వాహనాలలో తరలించేందుకు వీరి సేవలను ఉపయోగిస్తూ ఉంటారు. ఫలితంగా వాడల శుభ్రత ప్రశ్నార్ధకంగా మారుతున్నది. జీహెచ్ఎంసీ ఆయా కాలనీల గృహాల సంఖ్య జనాభా ఇతరత్రా దృష్టిలో పెట్టుకొని ముగ్గురు లేదా నలుగురిని సఫాయి ఉద్యోగులను కేటాయిస్తుంటారు. ఇందులో ఒకరు వారాంతం సెలవు, మరొకరు స్వంత అవసరాల కోసం సెలవులను తీసుకుంటారు. ఫలితంగా వాడల శుభ్రత లోపిస్తుంది. అందుకే ఇతర శాఖలల్లో ఉన్న విధంగా అదనపు సిబ్బందిని నియమించి వారాంతపు, ఇతర సెలవులు వినియోగిస్తున్న వారి స్థానంలో వీరి సేవలను ఉపయోగించుకోవాలి. అప్పుడే నిరంతరం నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి వీలు పడుతుంది. వీరు ఆరోగ్యవంతంగా ఉండి నగరాన్ని అందమైన విధంగా తీర్చిదిద్దడానికి మెరుగైన వైద్య సౌకర్యాలు ఉచితంగా కల్పించాలి.
- దండంరాజు రాంచందర్ రావు
98495 92958