డెలివరీ బాయ్స్ మనుషులే.. ఆత్మీయంగా పలకరిస్తే కొంపలేం మునిగిపోవు!

భారతీయులకు చిన్న పనులు చేసే వాళ్ళంటే చాలా చాలా చిన్న చూపు.. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను ఏ మాత్రం గౌరవించరు.

Update: 2025-04-27 01:15 GMT
డెలివరీ బాయ్స్ మనుషులే.. ఆత్మీయంగా పలకరిస్తే కొంపలేం మునిగిపోవు!
  • whatsapp icon

భారతీయులకు చిన్న పనులు చేసే వాళ్ళంటే చాలా చాలా చిన్న చూపు.. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను ఏ మాత్రం గౌరవించరు. స్విగ్గి, జొమాటో, ర్యాపిడో లాంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్‌గా పనిచేసే వాళ్ళు 'ఎందుకూ పనికిరాక ఈ పనిని ఎంచుకున్నారు' అని మెజారిటీ జనుల అభిప్రాయం.. నిజానికి డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వాళ్ళల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు.. చదువుకు, ఇంటి ఖర్చులకు ఆసరాగా ఈ పనులు ఎంచుకున్నారు.. 

కానీ వాస్తవం వేరు.. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పనిచేసుకుంటున్న వారి సెల్ఫ్ రెస్పెక్ట్‌ను అభినందించాల్సి పోయి వారిని అవమానిస్తున్నారు.. ఇది ఒప్పుకోవడానికి మనసొప్పని గొప్ప సామాజికవేత్తలూ ఒక డెలివరీ బాయ్ కష్టం చదవండి తెలుస్తుంది.

చిన్నపనులు చేసేవాళ్లంతా దొంగలేనా?

ఈ అబ్బాయి పేరు సలీం సల్మాన్. క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.. డెలివరీ బాయ్ జీవితం గురించి ఒక ఫిల్మ్ చెయ్యాలని. అందుకోసం వాస్తవ పరిస్థితులని తెలుసుకోవాలని...బ్లింక్ ఇట్‌లో డెలివరీ బాయ్‌గా అప్లై చేసుకున్నాడు.. బ్లాక్ ఇట్ అంటే పది నిమిషాల్లో వాలిపోవాలి.. ఏ కొంచెం లేట్ అయినా ఆర్డర్ చేసిన వాళ్ళ ఫీడ్ బ్యాక్ కంప్లైంట్ భయం ఉండనే ఉంటుంది.. వాళ్లల్లో ఎంతమందికి వాళ్ళు చేస్తున్న పనికి నిజాయితీగా ఫీడ్ బ్యాక్ తీసుకునే ధైర్యం ఉంది? అడ్రస్ సరిగా లేక ఫోన్ మాట్లాడుతూ ఎండకు ఒక చెట్టు కింద బండి ఆపుకుంటే వాచ్‌మ్యాన్‌ను పంపి మరీ అక్కడి నుండి వెళ్లగొట్టాడు ఒక రిటైర్డ్ అంకుల్. భయం, అనుమానం. చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏ దొంగలో అయి ఉంటారన్న ఇన్హరెంట్ ఫీలింగ్..

అవమానిస్తేనే అహం చల్లబడుతుందా?

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కోట్ల విలువ చేసే కార్ల హోదా ముందు.. హంబుల్ డెలివరీ బాయ్స్‌ను విసుక్కోవడం ట్రాఫిక్ పోలీసులకు మామూలే.. ఒక మహిళ, డెలివరీ బాయ్ ఒకే లిఫ్ట్‌లో ఉన్నందుకు ఆమె 'మీరు మెట్ల మీద నుండి వెళ్ళాలి.. ఓనర్స్‌తో సమానంగా లిఫ్ట్‌లో ఎందుకు వస్తున్నావు' అని గొడవపడింది. కొన్ని అపార్ట్‌మెంట్స్‌లలో సర్వీస్ లిఫ్టులు వేరుగా ఉంటాయి. ఆ లిఫ్ట్ పనిచేయక పోవడంతో ఈ లిఫ్ట్ ఎక్కానని అతను చెప్పినా ఆమె కోపం తగ్గలేదు. వివక్ష చూపిస్తే గాని అహం చల్లబడని లేకితనం. బిల్డింగ్‌లలో సెక్యూరిటీ వాళ్ల ఓవర్ యాక్షన్‌కు హద్దులేదు.. ఒంటినిండా బంగారంతో తెల్లబట్టలు వేసుకొని ఖరీదైన కార్లలో దిగే వాళ్ళను ఆపే ధైర్యం ఈ స్టాఫ్‌కు ఉందా?

అల్పుడివి.. తక్కువ పని చేస్తున్నావ్!

మనమెంత మానవత్వం గలవాళ్లం అని పైకి చెప్పుకున్నా లోపల ఇదే గజ్జి. మేము అధికులం. నువ్వు తక్కువ వాడివి.. తక్కువ పని చేస్తున్నావ్ అనే భావం పదేపదే ముఖం మీదే కనిపిస్తుంది. పిజ్జా కుకింగ్ వీడియోస్‌లో గ్లవ్స్ వేసుకోలేదు.. హైజీనిక్‌గా లేదు అని కామెంట్లు పెట్టే జనాలు.. ఆర్డర్ రాగానే ఆవురావురుమంటూ తింటారు.. అప్పుడు అది ఎక్కడ చేశారు, ఎలా చేశారు గుర్తుకురాదు. ఎంత హిపోక్రసీ.. ఇదంతా అతనికి అనుభవంలోకి వచ్చిన విషయాలు..

శ్రమించే వారిపై తరతరాల చిన్న చూపు

అక్కడ సలీం అయినా యాదగిరి అయినా ఒకటే.. మనుషులను మనుషులుగా చూడలేని సంకుచిత బుద్ధి.. బయటకు ఎన్ని అభ్యుదయ వేషాలు వేసినా శారీరక శ్రమ చేసే వారిపట్ల తరతరాల చిన్నచూపు.. సలీం డాక్యుమెంటరీ త్వరలోనే చూసి మనది ఎంత గొప్ప సంస్కృతో.. ఎంతటి వసుధైక కుటుం బమో తెలుసుకుందాం. రాపిడో అబ్బాయి అయినా స్విగ్గి డెలివరీ అబ్బాయి అయినా, మాల్ ముందు సలాం కొట్టే వృద్ధ సెక్యూరిటీ గార్డ్ అయినా మనుషులే.. కొంచెం ఆత్మీయంగా నవ్వితే కొంపలేం అంటుకుపోవు.. చిన్నగా నవ్వి థాంక్యూ చెప్పడం అలవాటు చేసుకోండి.

(పీఎస్: డెలివరీ బాయ్స్‌ని అవమానించే సందర్భాల్లో... విదేశాలకు వెళ్లి అక్కడ పార్ట్ టైమ్‌లో డోర్ డాష్ పనులు చేసుకుంటూ పొట్ట గడుపుకుంటున్న తమ పిల్లలు గుర్తుకు రాకపోవడం హైలెట్ అసలు)

రజిత కొమ్ము

ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్

Tags:    

Similar News