జనాభా పరంగా బీసీల్లో 6వ స్థానం.. మా వృత్తి అవసరాలు తీర్చలేరా?
రాష్ట్రంలో రజకులు వివక్షకు గురవుతున్నారు. ఐదేళ్ల కోసారి ప్రభుత్వం మారుతున్నా రజకుల తలరాతలు మారటం లేదు.

రాష్ట్రంలో రజకులు వివక్షకు గురవుతున్నారు. ఐదేళ్ల కోసారి ప్రభుత్వం మారుతున్నా రజకుల తలరాతలు మారటం లేదు. రాష్ట్రంలో రజక ఓటర్లలో మెజారిటీ షేర్ తెలుగుదేశం పార్టీదే. కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో ఉండే రజకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1983 నుండి ఆ పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే రజకుల ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడింట రెండు వంతులుగా నమోదైంది. మిగిలిన అన్ని ఎన్నికల్లో మెజారిటీ రజకులు టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొనసాగారు.
తెలుగుదేశం పార్టీ 1985 నుంచి 2024 ఎన్నికల వరకూ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చేస్తూ వచ్చిన వాగ్దానం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. 1985లో, 2018 లో తెలుగుదేశం పార్టీ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే కార్యాచరణకు పూనుకుంది, అయితే ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ఆగిపోయాయి.
వృత్తి అవసరాలకు భూమి ఇవ్వలేరా?
వైసీపీతో పోల్చుకుంటే టీడీపీలోనే రజక నాయకత్వం అధికంగా ఉంది. టీడీపీ కమిటీల్లో సైతం రజకులకు ప్రాధాన్యత ఉండింది. టీడీపీ 2019లో రజక సామాజిక వర్గానికి చెందిన దువ్వారపు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. 2024 ఎన్నికల్లో ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుండి గల్లా మాధవిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికలయ్యాక, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, నామినేటెడ్ పదవుల్లో రజకులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిలిచి గెలిచే అవకాశం లేని ఎంబీసీ కులాలకు శాసనమండలి అవకాశాలు ఇస్తానని చెప్పారు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. బీసీ కులాల వృత్తిదారులకు ఆదరణ 3 పథకం తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్రంలో సుమారు 140 బీసీ కులాలు ఉంటే, మొదటి 6 స్థానాల్లో ఉన్న రజక కులానికి ఇస్త్రీ పెట్టెలతోనో, వాషింగ్ మిషన్లతోనో సరిపెట్టకుండా, తమ వృత్తి అవసరాలకు భూమి కేటాయించాలని రజకులు కోరుతున్నారు.
ఆత్మగౌరవం భూమితోనే సాధ్యం
రాజుల కాలం నుండి రజకులకు కేటాయించిన ఈనాం భూముల్లో మూడొంతులు భూములు అన్యాక్రాంత మయ్యాయి. అన్యాక్రాంతమైన ఈనాం భూముల్ని తెలుగుదేశం పార్టీ తిరిగి తమకు ఇప్పిస్తుందని రజకులు గంపె డాశతో ఉన్నారు. రీ సర్వేలో అసైన్మెంట్ భూముల లింకులను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు, ఈనాం భూముల లింకును మాత్రం పరిశీలించలేదు. ఒక్క ఎకరాను కూడా ఈనాందారులకు ఇవ్వలేదని, ఆత్మగౌరవం భూమితోనే సాధ్యం కానీ, ఇస్త్రీ పెట్టెతో కాదని రజకుల భావన. తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న రజకులకు కేవలం రజక కార్పొరేషన్ మాత్రమే ఇచ్చారు. మరే ఇతర కార్పొరేషన్ చైర్మన్ పదవికి రజకులను ఎంపిక చేయలేదు. ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వామ్యంతో ఉండడంతో ఎవరికున్న ప్రాధాన్యతల దృష్ట్యా వారు ముందుకెళ్లడంతో, రజకులకు ప్రాధాన్యత తగ్గిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో ఇస్త్రీ చేసుకునే రజకులకు సంవత్సరానికి 10 వేల రూపాయలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకం ఆగిపోయింది.
ఆర్థిక భారం లేకుండా సాయం
రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక పరమైన భారం లేకుండా రజకులకు మేలు చేసే అవకాశం ఉంది. రజకుల వృత్తి అవసరాల కోసం అసైన్మెంట్ భూములు కేటాయించవచ్చు, గత ప్రభుత్వం ఇచ్చిన లే అవుట్లలో ప్లాట్లు కేటాయించవచ్చు, దేవుళ్ళ ఉత్సవాల్లో దివిటీలు పట్టే రజకులకు దేవస్థానం కమిటీల్లో స్థానం కల్పించవచ్చు, రజకులు గుర్తు చేసుకునే చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కు రజకులకు కల్పించవచ్చని, దేవాలయాలు, హాస్పిటల్స్, జైళ్లు, టూరిజం వసతి గృహాలు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ కళాశాలల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులను రజకులకే ఇవ్వాలని గతంలో ఇచ్చిన జీవోలను పకడ్బందీగా అమలు చేయవచ్చు, ఎస్సీలకు మల్లే, రజక వృత్తిదారుల ఇళ్ళపై కూడా సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్లేట్లు అమర్చవచ్చు, 40 ఏళ్లుగా రజకులను ఎస్సీల్లో చేరుస్తానన్న తెలుగుదేశం పార్టీ 2018లో వేసిన త్రీ మెన్ అధ్యయన కమిటీని కొనసాగించవచ్చు. ఈ పనులేవి ప్రభుత్వంపై భారం పడేవి కావు. ప్రభుత్వం అనుకుంటే జరిగేవి.
రజకులకు సమానావకాశాలు ఇవ్వాలి..
సమీక్ష లేకపోవడం వల్ల, ప్రభుత్వ దృష్టికి ఎవరూ తీసుకు పోకపోవడం వల్ల, ఎవరికి ఏమి చేయగలుగుతున్నామో ఎవరికి ఏమి చేయలేకపోతున్నామో అనే డేటా ప్రభుత్వం వద్ద లేదు. ఈ డేటా ప్రభుత్వం వద్ద ఉండి ఉంటే, రజకుల కష్టాలు ఎప్పుడో తొలగిపోయేవి. రజక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గల్లా మాధవి, రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సావిత్రి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడని ప్రయోజనాలను రజకులకు కల్పించేలా కార్యాచరణ తీసుకోవాలి. రాష్ట్ర జనాభాలో 4.2 శాతం ఉన్న రజకులకు సమాన అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వం బాధ్యత.
(నేడు ఉత్తరాంధ్ర జిల్లాల రజకుల సదస్సు)
పొటికలపూడి జయరాం,
రాష్ట్ర అధ్యక్షులు,
ఏపీ రజక రిజర్వేషన్ పోరాట సమితి,
95151 84699