వక్ఫ్ బోర్డు అసమర్థత వల్లే.. ముస్లింలకు ఈ పరిస్థితి!

వక్ఫ్ సవరణ బిల్లును సుదీర్ఘ వాద ప్రతివాదనలతో ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Update: 2025-04-06 00:45 GMT
వక్ఫ్ బోర్డు అసమర్థత వల్లే.. ముస్లింలకు ఈ పరిస్థితి!
  • whatsapp icon

వక్ఫ్ సవరణ బిల్లును సుదీర్ఘ వాద ప్రతివాదనలతో ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుపై మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ఆ తర్వాత రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్లును ముస్లిం వర్గాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం పట్టు బట్టి, ఒప్పించి, మెప్పించి బిల్లును ఆమోదించుకుంది. అయితే ఈ సవరణ ద్వారా పేద ముస్లింలకు, ముస్లిం మహిళలకు ఎంతో ప్రయోజనం అవుతుందని బీజేపీ అంటుంటే నమ్మశక్యంగా లేదు.

వక్భ్ బోర్డులే దీనంతటికీ కారణం

గత 10, 11 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి అంటే వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు ముస్లింలకు చట్ట సభలలో అవకాశం ఇవ్వని మోడీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం గురించి మాట్లాడటాన్ని ఏ విధంగా నమ్మగలం? బీజేపీ పార్టీ వక్ఫ్ బోర్డులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని మేము ఏదో మంచి చేయబోతున్నామని నమ్మించి, మోసగిస్తుంది. ముస్లింలను వేరు చెయ్యడమే కాకుండా వారిని ఆర్థికంగా భౌతికంగా, మానసికంగా కుంగ దీసే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇక వక్ఫ్ బోర్డు విషయానికి వస్తే వక్ఫ్ బోర్డుల అసమర్థత, ఏకాధిపత్యం, బడా రాజకీయ నాయకుల ప్రమేయం, రాజకీయ నాయకులచే భూముల కబ్జాదారి ఇవన్నీ కలబోసి సవరణకు అవ కాశం ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది. ఇన్ని సంవత్సరాల కాలంలో వక్ఫ్ బోర్డు, ఒక పేద ముస్లింకి 100 గజాల భూమి ఇచ్చినట్లు, పేద ముస్లింలను అందుకున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు. అలా చేసి ఉంటే బహుశా ఈ పరిస్థితి వచ్చేదే కాదు.

వక్ఫ్ భూముల ధారాదత్తం

ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులో ముస్లింలే ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఇస్లాం మార్గంలో గానీ, అల్లాహ్ ఆదేశించిన విధంగా గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గాన్ని గానీ ఆచరించక పోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డులు, రాజకీయ ప్రమేయంతో ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్ షిప్ పేరుతో భూములను ధారాదత్తం చేసి భూములను అన్యాక్రాంతం చేశారు. ఇప్పటికీ కనీసం వక్ఫ్ బోర్డుల భూముల పత్రాలు కూడా సరిగా లేకపోవడం సిగ్గుచేటు. అంతే కాకుండా వక్ఫ్‌లో ఉన్న వాణిజ్య సముదాయాలను సైతం బడా బడా వ్యక్తులకి కట్టబెట్టి ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్లనే నేడు బీజేపీ పార్టీ వీటిని అవకాశంగా మలచుకొని వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని తీసుకొచ్చింది. వాడుకుంటుంది. చివరగా, ఈ సవరణ బిల్లు ముస్లింలకు ఒక గుణపాఠం. ఇప్పటికైనా ముస్లిం మత పెద్దలు, రాజకీయ నాయకులు ఇస్లాం ప్రకారం నడవకపోతే రాబోయే రోజుల్లో ముస్లింల ఆర్థిక, సామాజిక, రాజకీయం ప్రశ్నార్థకం అవుతుందని గ్రహించాలి.

అజీజుద్దీన్

ఎడిటర్, ఫోకస్ న్యూస్ తెలంగాణ

70131 76656

Tags:    

Similar News