భక్తుల మనోభావాలు కాపాడండి!
గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె
గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె (కల్తీ అయిన నాసిరకం నెయ్యి) వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం చెలరేగి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుండడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు అన్ని వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసాయి.
తిరుమల కొండపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 130 కోట్ల మంది హిందువులకు చెందిన పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అనడంలో ఎటువంటి సందేహం లేదు. శేషాచలవాసుడిని ఎంత గాడంగా పూజిస్తారో అంతే భక్తిభావంతో తిరుమల లడ్డూను భక్తులు స్వీకరిస్తారు. వేంకటేశ్వరుని ప్రతి రూపంగా, స్వయంగా స్వామి వారే ఇచ్చినట్లుగా తిరుమల లడ్డూను భక్తులు భావిస్తారు. అంతటి పవిత్రమైన ఏడుకొండల వాడి లడ్డూపై వివాదం చెలరేగడం బాధాకరం.
కల్తీ కాలేదంటూ ప్రమాణాలకు సిద్ధం!
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నూనె కల్తీ చేయబడిన నాసిరకం నెయ్యి వాడారంటూ వ్యాఖ్యలు చేసింది సామాన్యమైన వ్యక్తి కాదు. స్వయానా సీఎం ఆ వ్యాఖ్యలు చేయడంతో హిందువులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. సీఎం వ్యాఖ్యలు ఇలా ఉంటే టీటీడీ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ హయాంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా జరిగినట్లు మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు పత్రికాముఖంగా తెలిపారు. ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, నేను, నా కుటుంబం ప్రమాణం చేయడానికి సిద్ధం, మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రమాణం చేసేందుకు సిద్దమేనా అంటూ? వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. అదేవిధంగా మరొక మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో కల్తీ చేసిన నెయ్యి సరఫరా జరిగి ఉంటే తనతో పాటూ తన కుటుంబం సర్వ నాశనం అయిపోతుంది అని, తన హయాంలో కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి సరఫరా జరిగి ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు భగవంతుని ద్వారా శిక్షింపబడతారని వ్యాఖ్యానించడం గమనార్హం.
పాత కంపెనీని ఎందుకు తొలగించారు?
తమ పార్టీపై కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు అధికార పార్టీ చేస్తున్నందువలన ఆ విషయంపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి టీటీడీ ఈవో ధర్మా రెడ్డిని తొలగించి తన స్థానంలో కొత్తగా జె.శ్యామలరావును నూతన టీటీడీ ఈవోగా నియమించారు. ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు రెండు నెలల క్రితం నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీని గుర్తించినట్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక కాంట్రాక్టర్ సప్లై చేసిన నెయ్యి శాంపిల్‌లో జంతువుల కొవ్వుతో చేసిన నూనె కల్తీ అయినట్లు రిపోర్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. అదే విధంగా యాభై సంవత్సరాల నుంచి తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కంపెనీని తొలగించి అర్హత లేని కంపనీలకు జగన్ ప్రభుత్వం నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వలాభానికే జగన్ ప్రభుత్వం ఈ విధంగా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నెయ్యి మార్కెట్ ధరలకు కాకుండా తక్కువ ధరలకే టీటీడీ కేటాయించినట్లు సోషల్ మీడియాలో, కొన్ని ప్రసార మాధ్యమాలలో అనేక రిపోర్టులు ప్రత్యక్షమయ్యాయి.
లాభార్జన తోటే కల్తీ నెయ్యి తెచ్చారా?
ఇటువంటి అక్రమాలు చేసి భారీగా ఆర్జించవచ్చు అనే ఉద్దేశ్యంతోనే నామ మాత్రపు అర్హత కూడా లేని ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ ద్వారా రాష్ట్రానికి తెప్పించుకుని అప్పటి ప్రభుత్వ పెద్దలు టీటీడీ ఈవోగా నియమించుకున్నట్లు విపక్ష రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంఘాలు వ్యాఖ్యానించాయి. కల్తీ చేసిన నాసిరకం నెయ్యి తిరుమలకు సరఫరా చేయబడింది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలుగా కూటమి పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో మీడియాలో కనిపిస్తున్న రిపోర్టులు అన్నీ కూటమి ప్రభుత్వ హయాంలో సరఫరా చేయబడిన నెయ్యికి సంబంధించినవని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత అయిదేళ్లుగా తిరుమలలో నాణ్యత లోపించిన ప్రసాదం ఇచ్చారని, నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కల్తీ అయినట్లు చూపుతున్న రిపోర్టును తాను కూడా చూశానని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వెల్లడించారు. ఈ విషయమై గతంలో నేను సహచర అర్చకులకు, టీటీడీ అధికారులకు తెలిపినా వారు ఆ విషయాన్ని పట్టించుకోలేదని రమణ దీక్షితులు ఆరోపించారు.
ఏది సత్యం.. ఏది అసత్యం?
నెయ్యి క్వాలిటీ టెస్టింగ్ కోసం రొటీన్‌గా జరిగే ప్రాసెస్‌లో రెండు నెలల క్రితం రిజెక్ట్ అయిన ల్యాబ్ రిపోర్ట్‌ను చూపి మామీద అభాండాలు వేస్తూ చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఇలా విభిన్నమైన వార్తలు ప్రస్తుతం షికారు చేస్తున్నందువలన వీటిలో ఏది వాస్తవమో? ఏది అవాస్తవమో? అర్థం కాక భక్తులు అయోమయంలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేయబడిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో చేసిన ఆయిల్ కల్తీ చేయబడింది అనే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను సంబంధించిన విషయం. కనుక భక్తుల మనోభావాలు దెబ్బతినకమునుపే ఈ విషయంపై సమగ్రంగా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ఒక వేళ నిజంగా కల్తీ జరిగి ఉన్నట్లయితే అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని హిందువుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత కచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదే.
కైలసాని శివప్రసాద్
94402 03999