బీ-టీమ్ ముద్ర చెరిగిపోయేదెలా?
Rahul's comments that BRS is B-team for BJP, how will those parties get rid of that impression?
మరక మంచిదే.. అంటూ టీవీ ఛానెళ్ళలో అప్పుడప్పుడు ఒక యాడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో అలాంటి మరకే హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ-టీమ్ అనే ముద్ర పడింది. రాహుల్‌గాంధీ ఇటీవల ఖమ్మం మీటింగ్‌లో దీన్ని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. దీన్ని చెరిపేసుకోవడం ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ అనివార్యం. మాకెవ్వరూ బీ-టీమ్ కాదని బీజేపీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ సైతం అదే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం నిజమేననే అభిప్రాయానికి వచ్చారు. నెల రోజుల పరిణామాలూ దీన్నే రుజువు చేస్తున్నాయి.
ఢిల్లీ స్థాయిలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య సమావేశాలు ఊపందుకున్నాయి. బీ-టీమ్ ఆరోపణలకు ఇవి బలం చేకూర్చేలా మారాయి. దాచేస్తే దాగేనా.. అనే తీరులో రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వాల మధ్య సంబంధాలకు పాలిటిక్స్ అంటగట్టడం సరైంది కాదంటూ ఆ రెండు పార్టీలూ సమర్ధించుకుంటున్నాయి. కానీ ఈ సమర్ధనలు ప్రజలకు కన్విన్సింగ్‌గా అనిపించలేదు. రాహుల్‌గాంధీ పేల్చిన బాంబు ఇప్పుడు రెండు పార్టీలనూ డిఫెన్సులో పడేసింది. ఆ రెండు పార్టీల నేతలు ఎంతగా తిట్టుకున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అనే తీరులోనే జనంలోకి వెళ్ళింది. ఈ రెండూ ఫ్రెండ్లీ పార్టీలేనని బలంగా నమ్ముతున్నారు.
కాంగ్రెస్ కూటమిని చీల్చే ప్రయత్నం!
నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ పేరుతో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ఫ్రంట్ పాలిటిక్స్ నడిపించారు. రెండు జాతీయ పార్టీలకూ ‘సమదూరం’ అని పైకి చెప్పుకున్నా కార్యాచరణ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. బీజేపీకి లబ్ధి చేకూరే తరహాలోనే వ్యవహరించారు. కాంగ్రెస్‌తో స్నేహంగా ఉండే ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ కూటమిలోని పార్టీలను మాత్రం టచ్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే యూపీఏ భాగస్వామ్య పార్టీలను ఆయన టార్గెట్ చేసుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి వాటిని దూరం చేయడమే లక్ష్యమని తేలిపోయింది. ఇప్పటివరకు ఆయన కలిసిన పార్టీలన్నీ కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్నవే.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, కోల్‌కతా, పశ్చిమబెంగాల్ ఇలా అనేక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి అధికార, ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, శివసేన, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం.. నేతలతో సమావేశమయ్యారు. ఇవన్నీ కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానో సంబంధాల్లో ఉన్నవే. యూపీఏ కూటమి నుంచి వేరు చేసి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చడమే కేసీఆర్ ఫ్రంట్ పాలిటిక్స్ మెయిన్ ఎజెండా అనే ఆరోపణలు వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒక్కటై పాట్నాలో మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ సమావేశానికి బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందలేదు. కానీ అందులో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలిశారు.
తొలి నుంచీ బీజేపీతో సత్సంబంధాలు..
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహమే కొనసాగింది. నోట్ల రద్దు మొదలు జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, సాగు చట్టాల వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి సహకరించింది. అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్‌కు దూరంగా ఉండి ప్రయోజనం చేకూర్చడమో చేసింది. ఫ్రంట్ పాలిటిక్స్ సమయంలోనూ కేసీఆర్ కార్యాచరణ అలాగే కొనసాగింది. ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలనే కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. అక్కడి ఓటు బ్యాంకును చీల్చడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. మహారాష్ట్రను బీఆర్ఎస్ విస్తరణకు ప్రయోగశాలగా మార్చుకున్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీకి బలం ఉన్న గ్రామీణ జిల్లాలు, నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఆ పార్టీకి చెందిన నేతలను బీఆర్ఎస్‌లోకి లాక్కుంటున్నారు. ఆ జిల్లాల్లో పార్టీ ఆఫీసులను ఓపెన్ చేసి బహిరంగసభలు పెట్టారు. రైతాంగంలో ఎన్సీపీకి ఉన్న పట్టును బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో బీఆర్ఎస్ యాక్టివిటీస్‌ను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. తెలంగాణలోని రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్సీపీకి ఉన్న బేస్‌ను వీక్ చేసి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగమే ఇదంతా. అక్కడి రాజకీయాల్లో ఉన్న సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవైపు బహిష్కరణ.. మరోవైపు మీటింగులు
కేంద్రాన్ని సాకుతున్నదే తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పారు. పన్నుల రూపంలో వెళ్తున్న దాంట్లో సగమే తిరిగొస్తున్నదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదనీ ఆరోపించారు. కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్, సదరన్ జోనల్ కౌన్సిల్ లాంటి మీటింగులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కేసీఆర్ దూరంగానే ఉండిపోయారు. మోడీని వ్యక్తిగతంగానే అసమర్థ ప్రధాని అంటూ కేటీఆర్ విమర్శించారు. ఆయన పర్యటన సందర్భంగా సిటీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు, పోస్టర్లతో నిరసన తెలిపారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంలో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌నూ నిందితుడంటూ కేసీఆర్ బాంబు పేల్చారు.
దాదాపు ఏడాదిన్నరగా కేంద్ర మంత్రులను కలవడానికి కూడా బీఆర్ఎస్ నేతలు సిద్ధపడలేదు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా మార్పు కనిపించింది. కేటీఆర్ జూన్ చివరి వారంలో రెండు రోజుల పాటు ఢిల్లీ వెళ్ళి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర అవసరాలను ఏకరువు పెట్టినట్లు వార్తలు వచ్చినా అక్కడ జరిగింది పొలిటికల్ చర్చలేనన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్రంతో అవసరం లేదంటూనే కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి సమావేశం కావడం బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతం ఇచ్చినట్లయింది. ఒకవైపు కేంద్రాన్ని విమర్శిస్తూనే, అధికారిక సమావేశాలను బహిష్కరిస్తూనే ఇప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకోవడం బీ-టీమ్ కామెంట్లకు బలం చేకూర్చినట్లయింది.
లిక్కర్ స్కామ్ తర్వాత మారిన సీన్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె యాక్టివ్ రోల్ పోషించారన్నది సీబీఐ, ఈడీ ఆరోపణలు, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన పలువురి స్టేట్‌మెంట్ల ఆధారంగా సీబీఐ, ఈడీ అధికారులు కవితను పలుమార్లు ఎంక్వయిరీకి పిలిచాయి. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె వ్యక్తిగత ఆడిటర్‌ను, సన్నిహితులను ప్రశ్నించారు. ఇక ఆమె అరెస్టు ఖాయమనే వార్తలూ వచ్చాయి. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీన్నే గొప్పగా చెప్పుకున్నారు. కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా ఢిల్లీ వెళ్ళిన హరీశ్‌రావు, కేటీఆర్ తదితరులు కేంద్ర పెద్దలతో మాట్లాడి సెటిల్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇందుకు మజ్లిస్ పార్టీ నేత ఒకరు రాయబారం నడిపారన్న మాటలూ వచ్చాయి.
కవిత, బీఎల్ సంతోష్ ఎపిసోడ్‌లో క్విడ్ ప్రో కో తరహాలో ఈ రెండు పార్టీలూ అండర్‌స్టాండింగ్ కుదుర్చుకున్నట్లు ఓపెన్ కామెంట్లే వినిపించాయి. కర్ణాటక అసెంబ్లీ రిజల్టు తర్వాత కాంగ్రెస్‌ను ఈ రెండు పార్టీలూ ఉమ్మడి శత్రువుగానే చూస్తున్నాయి. ఆ పొలిటికల్ ప్రయోజనాలే రెండింటినీ కలిపాయన్నది జనరల్ టాక్. నిన్నమొన్నటి వరకూ ఉప్పు-నిప్పుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ మధ్య స్నేహం చిగురించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తొలగించడాన్ని దీనికి ఉదాహరణ అనే చర్చ కమలనాధుల్లోనే మొదలైంది. బీఆర్ఎస్ ఒత్తిడితోనే బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతల్లో బలమైన అనుమానమే ఉన్నది. కేసీఆర్‌ను టార్గెట్ చేయడంతోనే సంజయ్‌కు ఉద్వాసన పలకాల్సి వచ్చిందన్నది వారి వాదన.
బీ-టీమ్ ముద్ర.. రెండింటికి సవాలే
బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని రాహుల్‌గాంధీ ఆరోపణలతోనే సరిపెట్టుకోలేదు. తగిన లాజిక్‌ను కూడా ఖమ్మం మీటింగ్ వేదికగా ప్రస్తావించారు. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య ఇప్పుడు కనిపిస్తున్న బంధం రాహుల్ ఆరోపణలు నిజమేననే అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. బీజేపీకి బీ-టీమ్ కాదని నిరూపించుకోవడం బీఆర్ఎస్‌కు తప్పనిసరిగా మారింది. బీఆర్ఎస్‌తో సాఫ్ట్ గా లేమని ప్రూవ్ చేసుకోవడం బీజేపీకీ అంతే అవసరం. ఆ ముద్రను చెరిపేసుకోవడం సవాలు లాంటిదే. ఈ రెండు పార్టీలూ ఇప్పుడు డిపెన్సులోకి నెట్టిన కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొజిషన్‌లో ఉన్నది. ముక్కోణపు పోటీ ఉంటే ఓట్లు చీలిపోయి బైటపడతామని బీఆర్ఎస్ భావిస్తుండొచ్చు. కానీ కమలం, గులాబీ ఒక గూటి పక్షులేననే వాదనతో ద్విముఖ పోటీగా మల్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
ఎన్. విశ్వనాథ్
99714 82403