రాహుల్, ఈ అసంబద్ధ మాటలెందుకు?
గతంలో కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గల్లీ నుండి ఢిల్లీ దాకా, పాతాళం నుండి, ఆకాశం అంచుల వరకు వివిధ స్థాయిల్లో చేసిన
గతంలో కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గల్లీ నుండి ఢిల్లీ దాకా, పాతాళం నుండి, ఆకాశం అంచుల వరకు వివిధ స్థాయిల్లో చేసిన అవినీతి, అధికార దుర్వినియోగ చరిత్ర ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం గుప్పిట్లో ఉంది. అవి అడ్డం పెట్టుకుని బీజేపీ కాంగ్రెస్‌ను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని చూస్తోంది. తన దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ పైకి, ఇతర విపక్షాల పైకి ఉసిగొల్పుతుంది. అయితే కాంగ్రెస్ గతంలో చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం సీపీయం చేయలేదు కనుక బీజేపీకి కేరళలో కక్ష తీర్చుకోవడానికే అవకాశం లేకపోయింది. అంతేకానీ, బీజేపీకి వామపక్షాలపై ప్రేమ ఉండి కాదు.
—----------------------------------------
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తూ వెంటపడి వేధించినట్లుగా, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంట ఎందుకు పడటం లేదంటూ ప్రశ్నించారు. పైగా ఎల్డీఫ్ తో బీజేపీకి దోస్తీ కుదిరిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కాంగ్రేస్‌ను టార్గెట్ చేస్తున్నాయని వాపోయారు.
గతంలో కాంగ్రెస్, బీజేపీతో జతకట్టి సీపీయంపై పోరాడిన చరిత్రను రాహుల్ అంత త్వరగా మరిచారా? నిజానికి సీపీయం మొదటి నుండి బీజేపీకి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తుంది. అవి రెండూ బూర్జువా పార్టీలే అనే అవగాహన మొదటి నుండి ఉంది. బీజేపీ మతతత్వంపై, నియంతృత్వ ధోరణిపై దేశవ్యాప్తంగా వామపక్షాలు చేసినంత తీవ్ర విమర్శలు మరేపార్టీ అయినా చేసిందా? కాంగ్రెస్ ఆత్మ విమర్శ చేసుకోవాలి.
అంత పరిణితి ఉందా?
ఇంత వరకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను వామపక్షాలు ఎప్పుడూ, ఎక్కడా, ఎన్నడూ సమర్ధించలేదు. పైగా బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతి సందర్భంలోనూ ఘాటుగా విమర్శించింది కూడా. బీజేపీతో పోరాడటానికి సర్వదా సిద్ధమైన వామపక్షాలతో మిత్రత్వం పెంచుకోవడానికి బదులుగా ఇలా రాజకీయంగా పతనమవుతూ రాహుల్ గాంధీ మాట్లాడటం పెద్ద తప్పు. ఆయన ఉపన్యాసం పరోక్షంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైన తప్పుడు కేసులు పెట్టమని మోదీని వేడుకున్నట్లుగా కనపడుంది తప్ప మరొకటి కాదు. కాబోయే ప్రధానిగా రాహుల్ గాంధీని ఊహించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇతర అభిమానులు...రాహుల్ గాంధీకి అంత పరిణితి ఉందా! అని ప్రశ్నించుకోవాలి. ఇంకా ఆ దశకు రాహుల్ చేరుకోలేదని మరోసారి ఆయన మాటలు, చేతలు దేశ ప్రజలకు తేటతెల్లం చేస్తున్నాయి. తనకు మిత్రులెవరో,శత్రువులు ఎవరో గుర్తించలేని అస్పష్టత ఆయన మాటల్లో కనపడుతుంది. ఈ అసంబద్ధ మాటలే 'ఇండియా' కూటమిని ఐక్యత లేకుండా బలహీనం చేస్తుంది.
నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ విషయాలపై కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పక్షలతో కలసి ఐక్య అవగాహన, ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోలేదు. ఇండియా కూటమి ఉమ్మడి ఏకీకృత కార్యాచరణపై కూడా స్పష్టత లేదు. ఎవరికి తోచినది వారు మాట్లాడుతున్నారు. ఎవరిదారి వారిదే. బీజేపీ లాంటి బలమైన పార్టీతో పోరాడుతున్నామనే సోయి కాంగ్రెస్‌కు ఉన్నట్లు కనపడటం లేదు. ముఖ్యంగా సిఏఏ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద కాంగ్రెస్ తన అభిప్రాయాలు ఏమిటో, ఎందుకు ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అత్యాచార నిందితుడికి టిక్కెట్టా?
సిఏఏ గురించి అమెరికా విమర్శించినా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో మాత్రం కనీస ప్రస్తావన కూడా లేదు. ప్రధాన అంశాలపై పోరాడిన చరిత్ర కూడా కాంగ్రెస్ శ్రేణులకు లేదు.పైగా సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరిక్షణంలో కాంగ్రెస్ మెల్లగా వెనక్కు జారుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ తమ ఉద్దేశాలను ప్రజలకు చెప్పి తీరాలి. అలాగే జమ్మూలోని కథువాలో ఎనిమిదేండ్ల బాలిక మీద అత్యాచారం హత్య చేసిన వారిలో ఒకడైన బీజెపి నేత చౌదరి లాల్ సింగ్‌ను స్వయంగా రాహుల్ గాంధీ గత నెలలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానించటం దేశ ప్రజలకు ఆశ్ఛర్యం, ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఏకంగా ఆ నిందితుడుని ఉధంపూర్ లోక్‌సభ అభ్యర్ధిగా కాంగ్రెస్ నిలిపింది. ఇదేనా దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చే హామీ. రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించటం అంటే ఇలాగేనా?
చేసిన తప్పులు సరిదిద్దుకోకపోతే..
ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బీజేపీ ప్రధానంగా లాభపడిన మాట నిజమే. అది దేశ సంపదను లూటీ చేసిందని రాహుల్ విమర్శించాడు. బాగానే ఉంది. కానీ, కాంగ్రెస్ కూడా అదే ఎన్నికల బాండ్ల ద్వారా రు.1,952 కోట్లు లబ్ధిపొందిన రెండవ అతిపెద్ద పార్టీ. అది మాత్రం లూటీదారు అనే ముద్ర పడకుండా తప్పించుకుంటుందా? కాంగ్రెస్ ఇప్పటికైనా తన ఎన్నికల ప్రచారంలో ఊహలు, భ్రమలు వీడాలి. తన పార్టీ ప్రణాళికలో ఆచరణ సాధ్యమైన విషయాలను మాత్రమే ప్రధానంగా ప్రస్తావించాలి. ఆచరణ సాధ్యం కాని వాటిని బహిరంగంగా ప్రకటించి వాటిని వదులు కోవాలి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అలవిగాని ఎన్నికల వాగ్దానాలు చేసాయి. వాటిని, ఆచరణలో నెరవేర్చలేక నానా అగచాట్లు పడుతున్నాయి. బీజేపీ ఎన్నికల గ్యారెంటీలో లోపాలను కూడా కాంగ్రెస్ సహేతుకంగా విమర్శించాలి. అంతేకానీ బలమైన బీజేపీని ఎదుర్కొనే భావ స్వారూప్యం గల మిత్ర పక్షాలలో చీలికలు తీసుకు రావడానికి రాహుల్ మాటలు, చేతలూ దోహదం చేయకుండా చూసుకోవాలి. చేసిన తప్పులు సరిదిద్దుకోకపోతే ముప్పును ఎదుర్కోక తప్పదు.
డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్
98493 28496