మహిళల మిస్సింగ్ మిస్టరీ... ఛేదించాల్సిన బాధ్యతెవరిది?

Missing mystery of women... Who is responsible to solve it?

Update: 2023-07-30 00:30 GMT

స్వతంత్ర భారత్‌లో స్త్రీలు దేవతలుగా ఆరాధనలందుకుంటున్నారనే నానుడిని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాలకులు ఊదరగొడుతున్నారు. కానీ, నిన్న గాక మొన్న సాక్షాత్తూ మన దేశ అత్యున్నత చట్ట సభలో ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం షాక్ కలిగించింది. 2019 నుండి 2021 వరకు మూడు సంవత్సరాల కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 10,61,448 మంది మహిళలు, 2,51,430 మంది బాలికలు మిస్సింగ్ కేసుల నమోదయ్యాయని చెప్పారు.

అదే కాలంలో ఆడ పిల్లల వైపు ఏ మగాడైనా దుర్బుద్ధితో కన్నెత్తి చూస్తే వాడి లాగు తడిసేటట్లు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని సాక్షాత్తూ ముఖ్యమంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తారు. మన రాష్ట్రంలో 34,495 మంది మహిళలు 8 వేల మంది బాలికల మిస్సింగ్‌తో దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లో ఒకటిగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ప్రభుత్వ గణాంకాలలో చేరని కేసులెన్నో లెక్కలేదు. మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను జారీ చేస్తూ, వాటిని త్రికరణ శుద్ధిగా అమలు పరచే క్రమంలో అనేక పథకాలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. కానీ ఆచరణలో దేవతలుగా కాదు కదా... కనీసం సాధారణ మహిళలుగా భద్రతతో కూడిన జీవనాన్ని గడపలేకపోతున్న కఠోర సత్యాన్ని ప్రభుత్వ లెక్కలే బహిరంగ పరుస్తున్నాయి.

అసలెందుకిలా జరుగుతోంది?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంవత్సరమైన 2014 లోనే షీ టీమ్‌లతో, తదనంతరం 2016 లో భరోసా వుమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటుతో కృత్రిమ మేధస్సు తోడ్పాటుతో అమెరికాను తలదన్నే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సేఫ్ సిటీ, సేఫ్టీ మేనేజ్‌మంట్ వ్యవస్థలతో స్మార్ట్ పోలీసింగ్ నేతృత్వంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ మహిళల భద్రతే పరమావధిగా పని చేసే రకరకాల యాప్‌లూ, టోల్ ఫ్రీ,హెల్ప్ లైన్ల ద్వారా అర్ధరాత్రి సైతం మహిళలు వీధుల్లో తిరగాడే స్వేచ్ఛను కలిగించడానికి విశేష కృషిచేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ భూతాన్ని నిర్జించడానికి, వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయ సాధన కోసం జాతీయ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను రూపొందించి త్రికరణ శుద్ధిగా అమలు చేస్తుండడంతో పాటు సఖి, వన్ స్టాప్ సెంటర్ల ద్వారా ఆపదలో వున్న మహిళలను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఎలుగెత్తుతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అధిక మొత్తంలో మహిళలూ, బాలికల మిస్సింగ్ కేసులు వెల్లువెత్తుతున్న వైనం మానవతావాదుల గుండెల్ని ద్రవింపజేస్తుంది.

నిన్న గాక మొన్న ఓ తెలంగాణ ప్రజాకవి 'మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు..మచ్చుకైనా ఒకడు లేడు మానవత్వం ఉన్న వాడూ..' అన్నట్లుగా ప్రజల్లో మానవత్వం మంటగలిసి పోవడమే రాష్ట్రంలో, దేశంలో మహిళల భద్రతను, రక్షణను ప్రశ్నార్ధకంగా మారుస్తోందా? ఒకవేళ అదే నిజమైతే ఆ మహిళల భద్రత కోసం రాజ్యాంగ బద్ధంగా పాటుపడాల్సిన ప్రభుత్వాలేం చేస్తున్నట్లని మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.

మహిళల రక్షణ, భద్రత బాధ్యత ప్రభుత్వాలతో పాటు పౌర సమాజంలో అంతర్భాగమైన ఆయా కుటుంబాలది కూడాననే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు. బ్రిటిష్ పాలన కాలం నాటి భారతీయ శిక్షాస్మృతితో పాటు మహిళల రక్షణ, భద్రత కోసం జారీ చేసిన అనేక ఇతర చట్టాలను అవసరమైన మార్పులు, చేర్పులతో అమలు పరుస్తున్న ప్పటికీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడం దురదృష్టకరమే. నేటికీ పురుషులలో ఆధిపత్య భావజాలాన్ని నూరిపోస్తున్న పితృస్వామ్య వ్యవస్థ కూడా దీనికి కారణంగా భావించక తప్పదు. ఉమెన్ ట్రాఫికింగ్‌కు కారణాలనేకమైతే అందులో కొన్ని లింగ వివక్ష మూలంగా పెట్రేగి పోతున్న జెండర్ అసమానతలు, మహిళలకు విద్యావకాశాలు లేకుండా పోవడం, కటిక పేదరికం మూలంగా కొన్ని తెగలకు చెందిన బాలికలు, మహిళలు కొన్ని సందర్భాల్లో స్వచ్ఛందంగా, మరికొన్ని సందర్భాల్లో అత్యంత అమానవీయంగా మానవ అక్రమ రవాణాలో వ్యాపార సరుకులుగా మారుతుండడం విషాదమే.

అంతర్జాతీయ నేరస్థుల ప్రోద్భలంతో..

మరోవైపు జనాభాలో సగ భాగంగా వున్న మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో 15% చేరుకోకపోవడంతో పాటు, రాష్ట్ర చట్టసభల్లో కనీసం 10%కి కూడా చేరువలోకి రాక పోవడం ఫలితంగా మహిళలు వారికి రాజ్యాంగం ప్రసాదించిన కనీస హక్కులను సైతం అనుభవించలేక పరాన్న జీవులుగా బతుకు వెళ్ళదీయాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్త క్రిమినల్ నెట్ వర్క్‌తో కొనసాగుతున్న నేర ప్రపంచంలో మానవ (మహిళల)అక్రమ రవాణా ద్వారా కోట్ల రూపాయలను సంపాదించుకునే అవకాశాలున్న నేపథ్యంలో అంతర్జాతీయ నేరగాళ్ళు పెద్ద సంఖ్యలో బాలికలను, మహిళలను వ్యాపార సరుకులుగా మార్చి ముంబాయి లాంటి రాష్ట్రాల్లోని రెడ్ లైట్ ఏరియాల్లోని వ్యభిచార కేంద్రాలకే కాదు, ఇతర దేశాలకు కూడా తరలిస్తూ వ్యభిచార కూపంలోకి దింపడం ద్వార కోట్ల రూపాయలు సంపాదిస్తూ మాఫియాగా రూపాంతరం చెందుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల ఏపీలో గ్రామ వలంటీర్లు సేకరించిన డేటా ఆధారంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ ఓ రాజకీయ పార్టీ నేత చేసిన ఆరోపణ పెద్ద దుమారాన్నే లేపింది. ఓ సాధారణ రాజకీయ నాయకుడు, సాక్షాత్తూ ఈ దేశ హోంశాఖ వర్గాలు ఈ సమాచారాన్ని తనకు చేరవేసినాయని ప్రకటించడం పట్ల స్వతంత్ర మీడియా విస్మయాన్ని ప్రకటిస్తోంది. అయితే, ఎన్‌సీఆర్‌బీ 2019నుండి 2021 వరకు మాత్రమే లెక్కలు ప్రకటించింది. ఐతే 2022కు సంబంధించిన డేటాను ఎందుకు ఇవ్వలేదనేది యక్షప్రశ్నగానే మిగిలిపోయింది. మహిళల భద్రత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేననే కేంద్ర ప్రభుత్వ వైఖరి దురదృష్ఠకరమైనదిగా భావించక తప్పదు.

అసలేం చేయాలి?

నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ అన్నట్లు లింగ అసమానతలకు నెలవైన సమాజంలో గర్భస్థ శిశువులుగా వున్నప్పుడే బాలికలుగా నిర్ధారించబడి భ్రూణ హత్యల పాలబడి తప్పిపోతుండడం విషాదంగా భావించక తప్పదు. మరోవైపు ఆడ పిల్లలను అప్పుగా భావించే సమాజం వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమకూర్చనందున బాల్యం నుండి శైశవ దశకు ఎదిగే క్రమంలో అనారోగ్యం బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని ప్రభుత్వ లెక్కలే తేల్చి చెప్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే స్త్రీ, పురుషుల లింగ నిష్పత్తిలో తేడాలు పెరిగి, స్త్రీల సంఖ్య తగ్గి వారు మగవారి శారీరక అవసరాలను తీర్చే అంగడి సరుకుగా మారే పెను ప్రమాదముందని సామాజిక వేత్తలు ఘోషిస్తున్నారు. ఈ ఘోర విపత్తు నుండి మహిళా లోకాన్ని కాపాడాలంటే ప్రభుత్వాలు లింగ వివక్ష ను రూపుమాపి లింగ సమానతకు ఊపిరిలూదాలి. పురుషాధిక్య సమాజ విషవలయం నుండి మహిళలను కాపాడడానికి అవసరమైన చట్టాలను రూపొందించడంతో పాటు వాటిని త్రికరణ శుద్ధిగా అమలు పరిచేలా పోలీస్ వ్యవస్థను ఆదేశించాలి.

మిస్సింగ్ కేసుల విచారణ కోసం సర్వహంగులతో ఓ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాలి. న్యాయ స్థానాలు సైతం సుమోటోగా మిస్సింగ్ కేసులపై విచారణ జరపాలి. మహిళల భద్రతకు సంబంధించిన చట్ట ఉల్లంఘనలకు పాల్పడడం ద్వారా వారి భద్రతకు భంగం కలిగిస్తున్న వారెంతటి వారైనా ఉపేక్షించకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి కఠిన శిక్షలను విధించాలి. లేని పక్షంలో దేశంలో 64% మహిళలపై జరుగుతున్న నేరాలతో మహిళలకు భద్రతను సమకూర్చడంలో ప్రపంచంలో 133వ స్థానంతో, లింగ సమానత్వ సూచీలో 140 వ స్థానంతో పార్లమెంట్ లో 15%కి లోబడిన మహిళల ప్రాతినిధ్యంతో అంతర్జాతీయ సమాజం ముందు మహిళలను ఆదరించని దేశంగా భారత్ తన అపకీర్తిని ఇలాగే కొనసాగించక తప్పదు. జనాభాలో సగభాగమైన మహిళలు తమ భద్రత పట్ల ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాజ్యాధికారం ద్వారానే తమ మనుగడ సుస్థిరమౌతుందని విశ్వసిస్తూ చట్టసభల్లో మూడో వంతు ప్రాతినిధ్యం కోసం ప్రాధేయపడకుండా సగభాగాన్ని సాధించుకోవడానికి చైతన్య వంతులై రాజీలేని పోరాటానికి సిద్ధం కావాల్సిందే.

డాక్టర్ నీలం సంపత్,

రిటైర్డ్ ప్రిన్సిపాల్, సామాజిక కార్యకర్త.

98667 67471

Tags:    

Similar News