మరోకోణం: బీఆర్ఎస్‌కు విప్లవశక్తుల అండ? ఇంకెవరు కలవబోతున్నారు?

మరోకోణం: బీఆర్ఎస్‌కు విప్లవశక్తుల అండ? ఇంకెవరు కలవబోతున్నారు?... Marokonam: kcr seeks support of left forces for the victory of BRS party

Update: 2022-11-12 18:45 GMT

మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు టీఆర్ఎస్ వెనకాల చేరడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. వారి ఓటు బ్యాంకు కారు గుర్తుకు మళ్లడంతోనే పదివేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిని ఓడించడం సాధ్యమైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. 'వికసించిన ఎర్ర గులాబీ.. కారును గట్టెక్కించిన కామ్రేడ్లు' అంటూ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. కమలనాథులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టుల మద్దతును కూడగట్టిన కేసీఆర్ వ్యూహ చతురతను అందరూ మెచ్చుకున్నారు.

మొదటినుంచీ ఆ నియోజకవర్గంలో వామపక్షాలకు మంచి పట్టుందని, ఐదుసార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారని గ్రహించే గులాబీ బాస్ ఆ పార్టీలను చేరదీశారని వ్యాఖ్యానిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన తర్వాతే కేసీఆర్ ఈ రెండు పార్టీల నేతలతో చర్చలు జరపడం ఇందుకు కారణమని చెప్పవచ్చు.

అప్పటి నుంచే దాడి మొదలు

అయితే, వామపక్షాలతో కేసీఆర్ దోస్తీ ఒక్క మునుగోడు కోసమే కాదని, దాని వెనకాల దీర్ఘకాలిక వ్యూహం దాగివుందని తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కమలనాథులపై సమరశంఖాన్ని పూరించిన టీఆర్ఎస్ అధినేత క్రమంగా తన దాడిని తీవ్రం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలన వల్ల దేశం సర్వ నాశనమైందని, అభివృద్ధి సూచికలు అట్టడుగు స్థాయికి చేరాయని విమర్శించారు. మోడీ అసమర్థ పాలకుడని, అన్ని వ్యవస్థలనూ దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎదురు నిలవాల్సిన కాంగ్రెస్ నిర్వీర్యమైపోయిందని అన్నారు.

ప్రస్తుత పరిస్థితులలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరముందని చెప్పారు. ఆ దిశలో అక్టోబర్ ఐదు, విజయదశమి రోజున భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటును ప్రకటించారు. కొత్త పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను, రైతుసంఘాల ప్రతినిధులను, ఇతర ప్రముఖులను కలిశారు. రిటైర్డ్ అధికారులతోనూ చర్చలు జరిపారు. టీఆర్ఎస్ పార్టీలోనూ అంతర్గతంగా సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు.

కలిసి వచ్చేదెందరో?

అయితే, కేసీఆర్ ప్రయత్నాలకు చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలు బీజేపీ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించారు తప్ప బీఆర్ఎస్‌తో కలిసి నడుస్తామని కానీ, అందులో చేరతామని కానీ చెప్పలేదు. కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఐక్య సంఘటన ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాబోదని వారిలో కొందరు స్పష్టం చేశారు కూడా.

గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలా, అస్సాంకు చెందిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) చీలిక వర్గం, జమ్మూ-కశ్మీర్‌లోని భీమ్‌సింగ్ పాంథర్స్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్‌లో చేరడానికి సమ్మతించినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తులుగా కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్, తమిళ హీరో విజయ్ తదితరులు రేపటి రోజున కలుస్తారేమో చెప్పలేం.

Also read: మరోకోణం: కేసీఆర్ కొత్త పార్టీ.. ఫ్రంటా? టెంటా?

అందుకే వారి మీద దృష్టి

ఈ పరిస్థితులలో బీఆర్ఎస్‌ను జాతీయపార్టీగా తీర్చిదిద్దడం కష్టతరమని గుర్తించిన కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా విస్తరించివున్న వామపక్షాలు, విప్లవశక్తులు కనిపించాయి. వాళ్లయితేనే బీజేపీ మతతత్వవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి షరతులు లేకుండా ముందుకు వస్తారని అర్థమైంది. అందుకే, సీపీఐ, సీపీఎంను ముందుగా తన గొడుగు కిందకు తెచ్చుకున్నారు. ఆ పార్టీల అగ్రనేతలు సీతారాం ఏచూరి, విజయన్, డి రాజాను కలిశారు.

కొత్త పార్టీలో చేరకపోయినా దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్‌ను విస్తరించడానికి అవసరమైన సాయం వాళ్ల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. మూలమూలనా ఉన్న వాళ్ల రైతు సంఘాలకు, ట్రేడ్ యూనియన్లకు, ఇతర ప్రజాసంఘాలకు ఉన్న సంబంధాలను వాడుకోవచ్చు. ఆయా రాష్ట్రాలు, జిల్లాలలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయవచ్చు. ఈ సంఘాలలోని కొందరు నేతలను పార్టీలో చేర్చుకోవచ్చు కూడా.

ఢిల్లీ పీఠం దక్కుతుందా?

కేసీఆర్ అంతటితో ఆగలేదు. కాషాయ వ్యతిరేక యుద్ధంలో కలిసివచ్చే ఏ శక్తులనూ ఆయన వదులుకోదల్చుకోలేదు. స్వతంత్రంగా ఉన్న అన్ని రకాల లౌకిక శక్తులను, మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే విప్లవ శక్తులనూ కలుపుకుని వెళ్లడానికి తాజాగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. గౌరీ లంకేశ్ హత్య, బీమా-కోరేగాం అరెస్టులు, అర్బన్ నక్సలైట్ల పేరుతో వేధింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు మోడీ సర్కారుపై ఆగ్రహించి వున్నట్లు ఆయన గుర్తించారు. ఇలాంటి శక్తులను చేరదీయడం వల్ల తన పోరాటానికి నైతిక మద్దతు పెరగడమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదిక కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు.

దళితులు, బహుజనులు, మైనారిటీలకు దగ్గర కావచ్చునని ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన విధంగానే బీజేపీ వ్యతిరేక ఎజెండాతో భారతదేశమంతా విస్తరించవచ్చునని, కాలం కలిసి వస్తే ఢిల్లీ పీఠాన్ని సైతం దక్కించుకోవచ్చని కలలు కంటున్నారు.

పలువురితో చర్చలు

ఈ కీలక కర్తవ్యాన్ని టీఆర్ఎస్‌లో లెఫ్టిస్ట్ ఫేస్‌గా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కు కేసీఆర్ అప్పగించారు. వినోద్ ఇప్పటికే తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మేధావులను, ప్రజాసంఘాల నేతలను కలిశారు. వారి నుంచి సానుకూల సంకేతాలే వెలువడుతున్నట్లు ప్రగతిభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని మోడీ రామగుండం పర్యటన సందర్భంగా అడ్డుకుంటామన్న పలు వామపక్ష సంఘాల ప్రకటనలను, మేధావుల పేరుతో విడుదలైన బహిరంగ లేఖను మనం ఈ కోణంలోనే చూడవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని, బీజేపీని రాజకీయంగా ఏకాకి చేసేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.

Also read: మరోకోణం:కేసీఆర్ గెలుపు వ్యూహాలు

ఈ ప్రశ్నలకు జవాబిస్తారా!?

అయితే, కేసీఆర్‌ వెంట నడవాలనుకుంటున్న, నడవ నిరాకరిస్తున్న శక్తులలో, మేధావులలో కొన్ని సందేహాలు, అభ్యంతరాలున్నాయి.

మొదటిది: ఏడేళ్లు బీజేపీని, మోడీ సర్కారు విధానాలను చట్టసభల లోపలా, బయటా సమర్థించిన కేసీఆర్ ఇప్పుడు అకస్మాత్తుగా మేల్కొని, అవే విధానాలను తూర్పారపడుతుంటే ఎలా నమ్మాలి? నోట్ల రద్దును సమర్థించలేదా? జీఎస్టీకి వంత పాడలేదా? అద్భుత పాలన అంటూ మెచ్చుకోలేదా? 2017 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇవ్వలేదా? రేపటి కాలంలో తిరిగి కమలనాథులతో జత కట్టరన్న గ్యారంటీ ఏమిటి?

రెండవది: కాంగ్రెస్ పార్టీ పట్ల కేసీఆర్ వైఖరి. ఇప్పటిదాకా బీజేపీతో సమానంగా విమర్శిస్తున్న ఆ పార్టీతో భవిష్యత్తులో కలుస్తారా? లేక మూడో ఫ్రంట్ అంటూ ఆచరణలో యూపీఏని వీక్ చేసి పరోక్షంగా కమలనాథులకే మేలు చేస్తారా? ఒకవేళ కాంగ్రెస్‌ వైపే ఉంటాననే సంకేతాలు ఇచ్చినా, ఆ మాటపై ఆయన కట్టుబడి వుంటారా? ఎన్నికల తదుపరి ప్లేట్ ఫిరాయిస్తారా? తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని ప్రకటించి తర్వాత చేయివ్వలేదా? ఇచ్చిన హామీలను మర్చిపోవడంలో ఊసరవెల్లిగా తనకున్న మచ్చను కేసీఆర్ ఎలా పోగొట్టుకుంటారు?

మూడవది: మోడీని, బీజేపీని నియంతగా, ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే దళారీగా, ఎమ్మెల్యేలను అనైతిక పద్ధతులలో కొనేవారిగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారు. మరి, తన ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ అనుసరించిన విధానాలు ఏమిటి? ధర్నాచౌక్‌ను నిషేధించిందెవరు? సభలు-సమావేశాలు జరక్కుండా, కనీస ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసిందెవరు? నక్సలైట్లను ఎన్‌కౌంటర్లలో చంపించిందెవరు? కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులను తనకు ఇష్టమైన కంపెనీలకే అప్పగించిందెవరు? కాంగ్రెస్, టీడీపీ, సీపీఐకు చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపజేసిందెవరు? ఆ పార్టీల ఎల్పీలను మింగిందెవరు?

చివరగా

గతంలో తాను అనుసరించిన విధానాల పట్ల, చేపట్టిన చర్యల పట్ల కేసీఆర్ నుంచి నిజాయితీ పూర్వక ఆత్మవిమర్శను ఈ శక్తులు కోరుకుంటున్నాయి. ఇప్పటికైనా అలాంటి విధానాలకు స్వస్తి చెప్పి, కనీస ప్రజాస్వామిక హక్కులను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే కాషాయదళానికి వ్యతిరేకంగా జరిగే పోరులో తాము కలిసి నడవడానికి సిద్ధమంటున్నాయి.

మరి కేసీఆర్ ఏమంటారో..?

 డి. మార్కండేయ

editor@dishadaily.com

Tags:    

Similar News