రాజ్యాధికారం దిశగా... జనసేన అడుగులు వేయాలి..

Janasena should take steps towards state power

Update: 2024-01-03 01:15 GMT

పది సంవత్సరాలుగా నష్టపోతున్న జనసేన నాయకులు, కార్యకర్తలకు ఈ పొత్తు వచ్చే దశాబ్ద కాలానికి సరిపడా ఉత్సాహాన్ని నింపాలి. దీనికోసం సీట్ల షేరింగ్‌పై కాకుండా పవర్‌ షేరింగ్‌పై, స్ట్రయిక్‌ రేట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒకవేళ ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ తప్పటడుగులు వేస్తే, జగన్‌ చేతికి ఆయుధం అందించినట్టే!!

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు వాటి సిద్ధాంతాల్లో సారుప్యత ఉండాలి. ఇరు పార్టీలకూ ఒకే లక్ష్యం ఉండాలి. దీనికోసం ఒకే రకమైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలి. ఈ మూడు విషయాల్లో జనసేన, తెలుగుదేశం ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంపై (సీఎంపీ) కసరత్తు కూడా పూర్తి చేశాయి. జనవాణి, వారాహి యాత్రల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సీఎంపీలో పొందుపరచాలి. అయితే, ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై సంతకం చేసి, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు పవన్‌ జవాబుదారీగా ఉండాలి.

కార్యకర్తలు అర్థం చేసుకోవాలి!

రాజ్యాధికారమే సామాజిక న్యాయానికి దారులు వేస్తుందన్న అంబేద్కర్‌, కాన్షీరాం బాటలో పవన్‌ కళ్యాన్‌ నడుస్తున్నారు. దానికి అనుగుణంగా రెండో అడుగుగా కూటమి పొత్తు దీర్ఘకాలికంగా కొనసాగడానికి, ఫలితంగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాం (సీపీపీ) రూపొందించే పనిలో పవన్‌ నిమగ్నమవ్వాలి. పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు సాధ్యమైనంత ఎక్కువ న్యాయం చేయడానికి పవన్‌ సీపీపీని ఉపయోగించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దేశంలోనే ఖరీదైనవిగా మారిపోయాయి. జనరల్‌ స్థానాల్లో కనీసం 35 కోట్లు, రిజర్వుడ్‌ స్థానాల్లో 25 కోట్లు ఖర్చు చేయందే ఓట్లు పడే పరిస్థితి లేదు. ఇంత ఖర్చు చేసినా... కచ్చితంగా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. ఈ జూదంలో ఇంత డబ్బు పోసి పోటీ పడే నాయకులు, వారికి సహకారం అందించే కార్యకర్తలు జనసేన సమూహంలో లేరు! టీడీపీ, వైసీపీల ఆస్తులతో పోలిస్తే రూ.20 కోట్ల ఆస్తులు కూడా లేని పేద పార్టీ జనసేన ఎక్కువ సీట్లు అడిగితే, దానికి ఎక్కువ డబ్బు కూడా అవసరమవుతుంది. ఆర్థిక బలం లేకుండా ఎక్కువ సీట్లలో పోటీ చేసి, తక్కువ స్థానాల్లో గెలిచి అప్రతిష్ట మూటగట్టుకోవడం వృధా. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకుని, సీపీపీ లో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎక్కువ నామినేటెడ్‌ పదవులు డిమాండ్‌ చేయాలి. తద్వారా పదేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న శ్రేణులకు న్యాయం చేయగలుగుతారు.

తక్కువ సీట్లకు పొత్తు ఒప్పుకోవద్దని, సీఎం సీటును కూడా పంచాలని కొంతమంది నాయకులు జనసేన శ్రేణులను రెచ్చగొడుతున్నారు. వీళ్లు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా వైఎస్సార్సీపీకి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడవద్దని కార్యకర్తలకు అనేక వేదికల నుంచి పిలుపునిచ్చారు. పొత్తుల గురించి ఎవరికి వారు ఏదేదో మాట్లాడొద్దని, పొత్తు విషయంలో మేలు చేసే నిర్ణయం తానే స్వయంగా తీసుకుంటానని చెప్తూ మూడేళ్లుగా పార్టీ కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఖరీదైన ఎన్నికల్లో పోటీ చేసి దెబ్బతినే బదులు నూటికి 95 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక శాతం గెలుపొందేలా వ్యూహాలు రచిస్తే మంచిది.

జనసేన ఆ భాగస్వామ్యం కోరాలి!

2014లో టీడీపీకి మద్దతిచ్చి కూడా... నామినేటెడ్‌ పదవులు తీసుకోకపోవడం వల్ల జనసేనకు తీవ్ర నష్టం జరిగింది. ఈసారి ఆ తప్పు జరగకుండా జనసేనాని జాగ్రత్తలు తీసుకోవాలి. సీపీపీలో భాగంగా ఐదు సంవత్సరాల్లో వచ్చే ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులతో పాటు ఇతర నామినేటెడ్‌ పదవుల్లో జనసేనకు తగిన ప్రాధ్యానత ఉండాలని జనసేన కోరాలి. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిల్‌ వార్డులు, నగర పంచాయతీ వార్డులు, మున్సిపల్‌ కార్పోరేటర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తే, పార్టీ వేర్లు క్షేత్రస్థాయిలో బలపడతాయి.

వీటితో పాటు సలహాదారులు, దేవాదాయ కమిటీలు, వివిధ కార్పోరేషన్లు, హైకోర్టు, కింద కోర్టుల్లో ఉన్న పలు నామినేటెడ్‌ పదవులతో పాటు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న నామినేటెడ్‌ పోస్టుల్లో జనసేన భాగస్వామ్యం కోరాలి. ఆయా పోస్టుల్లో వీలైనంత ఎక్కువమంది జనసేన నాయకులు, కార్యకర్తలు ఉంటే అది పార్టీకి రాబోయే దశాబ్దానికి సరిపడా ఉత్సాహాన్ని అందిస్తుంది. నామినేటెడ్‌ పదవులకు సంబంధించి ఎన్నికలకు ముందే జనసేన టీడీపీతో ఒక పారదర్శకమైన ఒప్పందం కుదుర్చుకోవాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించే మంత్రిత్వశాఖల్లో ఇరు పార్టీలకు తగిన భాగస్వామ్యం ఉండాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల దృష్టిలోకి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపాలి. పొత్తు ధర్మం దీర్ఘకాలంలో చిన్న పార్టీలకు మేలు చేస్తుంది. పొత్తును సీట్ల షేరింగ్ వ్యవహారంగా కాకుండా ఒక వ్యూహంగా చూడాలి. పార్టీనీ బలపరుస్తూ జనాల్లో ఉంటే పదేళ్లలో జనసేన అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చు.

పొత్తును వ్యూహంగా చూడాలి..

2009లో టీడీపీతో పొత్తుపెట్టుకున్న బీఆర్‌ఎస్‌ 45 సీట్లలో పోటీ చేసి 10 సీట్లలోనే విజయం సాధించింది. దీంతో పరోక్షంగా కాంగ్రెస్‌కి మేలు జరిగింది. పొత్తు పెట్టుకున్నప్పుడు పెద్ద పార్టీలతో గొడవ పెట్టుకోవడం లేదా ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేయడం వల్ల చిన్న పార్టీలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. టీడీపీ బలమైన వ్యవస్థాగత నిర్మాణమున్న పార్టీ. పొత్తుతో పోటీ చేస్తున్నప్పుడు టీడీపీ లాంటి పెద్ద పార్టీ గెలవడానికి, పొత్తు పెట్టుకున్న చిన్న పార్టీ నుంచి తక్కువ శాతం ఓట్లు బదిలీ అయితే సరిపోతుంది. అదే పొత్తులో చిన్న పార్టీలకు పెద్ద పార్టీ నుంచి అధిక శాతం ఓట్లు బదిలీ కావాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా, సీపీఐ నుంచి బదిలీ అయిన తక్కువ శాతం ఓట్లే కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. అదే సీపీఐకి ఎక్కువ స్థానాలు ఇచ్చి ఉంటే, అధిక శాతం కాంగ్రెస్‌ ఓటు షేర్‌ బదిలీకి ఆస్కారం తగ్గేది. అదే బీఆర్‌ఎస్‌కి మేలు చేసి ఉండేది. పొత్తు పెట్టుకున్నప్పుడు ఇలా అనేక కోణాల్లో చూడాలి.

పొత్తు ధర్మం దీర్ఘకాలంలో చిన్న పార్టీలకు మేలు చేస్తుంది. 2004, 2009 లో పొత్తులతో నెట్టుకొచ్చిన బీఆర్‌ఎస్‌ 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాబట్టి, పొత్తును ఒక వ్యూహంగా చూడాలి. పార్టీనీ బలపరుస్తూ జనాల్లో ఉంటే పది సంవత్సరాల్లో జనసేన అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చు.

- ఎన్‌. సాంబశివరావు

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email peoplespulse.hyd@gmail.com

Tags:    

Similar News