A good novel shows but didn't tell అంటారు ఒక రచయిత. శరత్ నవలలు నూటికి నూరుశాతం దీన్నే రుజువు చేస్తాయి. శరత్ నవలలు చదివినప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. అప్పటి బెంగాలీ జీవిత విధానం కళ్లముందు సినిమా రీల్లా కనిపిస్తుంది. వాళ్ళ ఆలోచనలు సామాజిక పరిస్థితి, స్త్రీల పరిస్థితి, స్త్రీలల్లో ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రస్పుటమవుతుంది. మానవ సంబంధాల పట్ల గొప్ప ఆలోచన రేకెత్తిస్తుంది. అలాంటి ఒక గొప్ప శరత్ నవల చంద్రనాథ్. ఈ నవలలో ముఖ్యమైన పాత్రలు చంద్రనాథ్, సరయు, కైలాస్ చంద్ర, శంభు మిశ్రా, హరి దయాల్, మణి శంకర్, హరకాళి. మిగతా కొన్ని పాత్రలు.
ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో..
కాశీలో పెళ్ళి చేసుకుని తీసుకొని వచ్చిన తన భార్య సరయుతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు మన శరత్ నాయకుడు చంద్రనాథ్. హాయిగా నడుస్తున్న జీవితంలో తుఫాన్‌లా ఒక ఉత్తరం చంద్రనాథ్ తండ్రి మణిశంకర్‌కి కాశీ నుండి సరియు తండ్రి హరి దయాల్ పంపిస్తాడు. దీంతో ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో అలజడి మొదలవుతుంది. ఉత్తరంలోని సారాంశం సరయు తల్లి వేశ్య అని. చంద్రనాథ్ భార్య సరయు వేశ్య కుమార్తె అన్న వార్త తెలుస్తోంది. దీంతో ప్రాయశ్చిత్తం పేరుతో సరయును ఇంటి నుండి పంపించేస్తారు. అతి సాధారణమైన బట్టలతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహిళగా సరియు కాశీలో ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్లాలనుకుంటుంది అక్కడ తల్లి జాడ లేకపోవడంతో తండ్రి దగ్గరికే వెళితే వెళ్ళిపొమ్మని అవమానిస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెకు తన ఇంటి పక్కన ఉన్న కైలాస్ చంద్ర ఇంటికి ఆహ్వానించి ఆశ్రయ మిస్తాడు.
మనం సమాజం కాదా.. పరివర్తన
చంద్రనాథ్ ఇతరుల మాటలు విని భార్యను వెళ్లగొట్టి బాధతో తనూ ఇల్లు విడిచి కొన్నాళ్ళు అలహాబాద్ వెళ్ళి పోతాడు. ఎవరు ఒత్తిడి చేసినా ఇంటికి రాడు. అది విన్న తండ్రి మణిశంకర్ బాధతో తల బాదుకున్నాడు. నేను కోలుకున్నాక వెళ్ళి కోడలిని తీసుకొస్తాను'' అని అనుకున్నాడు. ''సమాజానికి భయపడాల్సింది ఏముంది మనమే సమాజం, నేను స్వయంగా సమాజం కాదా అని అనుకుంటాడు. ఏ తప్పూ చేయని సరయుకి అంత శిక్ష పడటం మణిశంకర్‌లో మార్పు వస్తుంది. ఈ సంఘటన మణిశంకర్‌ని కదిలించింది. కొన్నాళ్ల తరువాత సరయుకి విశ్వేశ్వర్ అనే కొడుకు పుట్టటం కైలాస్ చంద్ర విషును ప్రేమగా స్వంత మనుమడుగా సాకటం రెండేళ్లు త్వరగా గడిచి పోతాయి. కొన్నాళ్ళకు చంద్రనాథ్ తప్పు తెలుసుకొని ఇంటికి వెళతాడు. కోడలు వచ్చిన వేళలో ఊరందరికీ పిలిచి విందు ఏర్పాటు చేస్తాడు. మరోవైపున విషు, సరయు లేక పోవడంతో కైలాస్ చంద్ర ఆనందం, దుఃఖం ఏకకాలంలో అనుభవిస్తాడు. మెల్లగా అనారోగ్యం పాలైపోతాడు. కొంత కాలానికి చనిపోతాడు.
సహజత్వానికి ప్రతీక
శరత్ నవలలో ఎక్కడా వర్ణనలు, సిధ్ధాంతాలు మనకు కనిపించవు. మామూలుగా మనిషి జీవితంలో ఎలా సంభాషిస్తారో అలా సహజంగా ఉంటుంది. పాత్రల్లో ఆలోచనల మార్పు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కారణం పాఠకుడికి కనిపిస్తుంది. మానవ సంబంధాల పట్ల, మనుషుల పట్ల అత్యంత అనురాగం, ప్రేమ లో ఉన్న అపురూపమైన సంబంధాలతో మనిషిని బంధించిన నవల ఇది. ప్రతి పాత్ర మనతో ప్రయాణించినట్టు మనం ఆ పాత్రలతో మమేకమైనట్టు అనిపిస్తుంది.
రచయిత - శరత్ చంద్ర
తెలుగు సేత -పోలు శేషగిరిరావు
సాహితీ ప్రచురణలు
పుటలు- 112, ధర- రూ.40
సమీక్షకులు
సర్వమంగళ
89616 26848