
యవ్వన జీవితంలో విప్లవ విద్యార్థి, ఎంఎల్ రాజకీయ, సాహిత్య ఉద్యమాలలో అడుగుపెట్టి, తర్వాత రాయలసీమ ఉద్యమ నేతగా రూపొంది, సీమ సమస్యలను ఎలుగెత్తి చాటిన మిత్రులు భూమన్... రాయలసీమ తాగునీటి కష్టాలు తీర్చడానికి వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈయన, సీమలో ఉద్యమాల వాతావరణం చల్లబడిన తర్వాత ట్రెక్కింగును ఆలంబనం చేసుకున్నారనిపిస్తుంది. గత పాతికేళ్లకు పైగా ఆయన సాగిస్తూ వచ్చిన తిరుమల ట్రెక్కింగ్‌లోని కొన్ని అరుదైన ట్రెక్కింగ్ విశేషాల సంకలనం 'శేషాచలం కొండకోనల్లో'.
మన ఊళ్లో ఇంతకాలముండి దీని చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించకపోతే స్థానీయతకు అర్థమే లేదంటారాయన. తిరుపతి పరిసరాల్లో తొలి దశ ట్రెక్కింగ్ పూర్తిగా ఆధ్యాత్మిక స్వభావంతో మొదలైతే పాతికేళ్ల క్రితం నుంచి సాగుతున్న ట్రెక్కింగ్ చాలామంది యువత, కొద్దిమంది వృద్ధుల కలయికతో తిరుమల ట్రెక్కింగ్‌ని కొత్త పుంతలు తొక్కించింది. తిరుమల కొండను భౌతిక వాద దృక్పథంతో, చారిత్రక నైసర్గిక పరిసరాల వర్ణనతో సాగించే రచనా ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా ప్రారంభమైంది.
కాళ్లకొక శతకోటి పాదాబివందనం
తిరుపతి నివాసి, తన మిత్రుడైన రాఘవశర్మతో తిరుమల శ్రీవారి మెట్లను 15 నిమిషాల్లో ఎక్కి దిగుతూ వచ్చిన అనుభవమే తనను ట్రెక్కింగ్‌కు ప్రాథమికంగా పరిచయం చేసిందని భూమన్ చెప్పుకున్నారు. చిన్నతనంలో ఈదరపల్లి జారుడు నుండి జారిన జారుళ్లు ఇన్నేళ్లుగా తన కాళ్లకు పని చెబుతూనే ఉన్నాయంటారు. ప్రకృతి అడుగులో తన ప్రతి అడుగునూ అత్యంత జాగరూకతతో వేయిస్తున్న 'నా కాళ్లకొక శతకోటి పాదాబివందనం' అంటూ కృతజ్ఞత చెప్పినారు. యవ్వనంలో ఉద్యమాల్లో పాల్గొని తర్వాత కొన్నాళ్లకే ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని అవలంబించి జీవితాన్ని 'తరింపజేసుకుంటున్న' చాలామంది అభ్యుదయవాదుల పంధాకు భూమన్, రాఘవ శర్మ వంటివారు పూర్తి విరుద్ధం.
కరోనాతో ట్రెక్కింగ్ వైరల్
చాలా ఏళ్ల క్రితం శ్రీకాకుళం అడవులు తిరగడం, యాదయ్యతో కలిసి ములుగు అడవులు చుట్టి రావడం, రాయలసీమ కరువు బండ యాత్ర చేయడం ద్వారా కాళ్లకు పని కల్పించారు రచయిత. కానీ కరోనా కారణంగా జీవితానికి కలిగిన విరామ సమయంలో అంతకుముందెన్నడూ చూడని శేషాచలం అడవులతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి, కార్వేటి నగరంతోపాటు, లంకమల, నల్లమల కొండలు విస్తృతంగా తిరిగే వీలు కలిగిందంటారు. తనను తాను సంస్కరించుకోవడానికి, ప్రకృతికి, మనిషికి ఉండే తాత్వికానుబంధాన్ని అర్థం చేసుకోవడానికి నిరంతర అన్వేషణలో భాగమే తన ట్రెక్కింగ్ అని చెప్పుకున్నారు.
రాతి పొరల్లో కమ్మటి నీళ్లు
తిరుపతి వాస్తవ్యులు, జర్నలిస్టు మిత్రులు రాఘవ, ఇప్పుడు భూమన్ శేషాచలం కొండల్లో ట్రెక్కింగుపై రాసిన రెండు మూడు పుస్తకాలను తిరగేస్తున్నప్పుడు ముప్పై ఏళ్ల క్రితం ఉద్యమ జీవితంలో భాగంగా కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పని చేసినప్పుడు పొందిన ఒక అపూర్వమైన అనుభూతి గుర్తుకొస్తోంది. రాయలసీమలో మాత్రమే కనిపించే రాతి పొరల నీళ్లను దప్పిక కలిగినప్పుడల్లా తాగుతూ అమృతం తాగినట్లుగా ఫీలయ్యేవాళ్లం. ప్రత్యేకించి కడప, చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో అడవుల్లో కానీ, పల్లెలకు సమీపంలో ఉన్న పొలాల్లో కానీ అక్కడక్కడ కనిపించే రాతి బుగ్గల నుంచి పైకి వచ్చే నీళ్లంతటి రుచి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నేల పొరల్లోంచి సన్నటి రాతి బుగ్గల్లోంచి పైకి ఉబికి వచ్చే ఆ తీయటి నీళ్లను తాగి మైమర్చిపోయేవాళ్లం. ఆ రాతి బుగ్గలలోని, లోయల్లోని వాగుల్లోని నీళ్లు తాగి వాటి కమ్మని రుచిని ఆస్వాదించిన అనుభవం 30 ఏళ్ల క్రితమే ముగిసిపోయింది. మళ్లీ ఈ పుస్తక రచయిత శేషాచలం కొండల్లోని అలాంటి నీటి మడుగుల గురించి రాతి పొరల లోంచి పైకి ఉబికి వచ్చే స్వచ్ఛమైన మంచి నీటి గురించి ఈ పుస్తకంలో చెబుతుంటే నాటి కాలం జ్ఞాపకాలు మనసులోంచి ఉబికి వస్తున్నాయి.
బండలపై నిద్ర మహదానందం
ట్రెక్కింగ్ అంటే ఆధ్యాత్మికమా, పర్యాటకమా, పర్యావరణ సంస్కృతిలోకి మనిషి పయనమా అనే వాదనలు ఏవైనా ఉండవచ్చు కొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో పారే నీటిని తాగడం, అక్కడి చల్లదనాన్ని, స్వచ్ఛమైన గాలిని పీల్చడం కంటే ట్రెక్కింగ్ ద్వారా కలిగే అనుభూతి మరొకటి ఉండకపోవచ్చు. నాలుగు గోడల మధ్యలో, చెమటలు గక్కే వాతావరణంలో, దోమలు కుట్టి చంపే గదుల్లో జీవితం గడిపిన వారికి అడవుల్లో, కొండల్లో ఒకటి రెండు రోజులు గడిపితేనే కొత్త స్వర్గం ఏదో తమ ముగింటిలోకి వచ్చినంతగా సంబరపడటాన్ని శేషాచలం కొండకోనల్లో పుస్తకం కూడా తలపుల్లోకి తెచ్చింది. గోడలు లేని, తలుపులకు తాళాలు లేని, ఇరుకుతనం లేని చోట ఆరుబయల కొండలమీది బండలపైన పడుకుని నిద్రపోవడం మహదానందాన్ని ఇస్తుంది.
ఎప్పటికైనా కొండలే మన మూలాలు..
రాయలసీమ కరువుసీమే కావచ్చు కానీ అడవులు, కొండకోనలకు సీమ అంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం మరొకటి లేదు. కొండ శిఖరంపై కోనల్లో మొదలయ్యే నీటి బుగ్గలు సెలయేరులై, జలపాతాలై కిందికి దుమికి పరిసరాలను మొత్తంగా ఆకుపచ్చ రంగులోకి మార్చే దృశ్యాలు చూడాలంటే సీమలో కానీ మరే ఇతర ప్రాంతాల్లో కానీ కొండకోనలను దర్శించాల్సిందే. అలాంటి కొండల్లో ఒక అంచుకు ఎక్కుతూ, వగరుస్తూ, దోగాడుతూ పోతే అంతా కలిపి ట్రెక్ అవుతుంది. ఆదివాసీలను అడవుల్లోంచి తరిమికొడుతున్న అపరాధ భావనను మనసులో ఉంచుకుంటూనే.. మన మూలాలను గుర్తు చేస్తూ.. భూమ్మీద ప్రకృతి చెక్కిన నగిషీలు కొండలు అంటారు రచయిత. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్న ట్రెక్కింగ్ మనుషులకు అవసరం. ఎప్పటికైనా మిగిలే మన మూలాలు కొండలు, అడవులే కదా. తిరుమల కేంద్రంగా సాగుతున్న ట్రెక్కింగ్‌పై వస్తున్న ఇలాంటి పుస్తకాలను మానవ మూలాలను విప్పి చెప్పే సరికొత్త భాష్యాలుగా చెప్పాలి.
తిరుమల కొండలు, తిరుపతి పరిసరాలలో 61 ప్రాంతాల్లో సాగిన ట్రెక్కింగ్ నుంచి అమెరికా అడవుల్లో హైకింగ్ దాకా రచయిత సాగించిన యాత్ర విశేషాలను ఈ పుస్తకంలో చదివి తెలుసుకోవలసిందే మరి. ట్రెక్కింగులో తలపండిన రచయిత తన మనవరాలికి కూడా తన అలవాటును నేర్పించి తనతో పాటు కొండలపైకి ఎక్కి దిగటాన్ని అలవాటు చేయడం మరీ విశేషం. తనను గెలిపించడానికి తాత ఉద్దేశపూర్వకంగా వెనుకబడి ఓడిపోవడం ద్వారా ఈ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ లిటిల్ గర్ల్ అనే ఫీలింగ్ వచ్చేదంటూ ఆ అమ్మాయి చెప్పుకోవడం తెలిసినప్పుడు ట్రెక్కింగులో మరో తరం వారసత్వం మొదలైందనిపిస్తుంది.
చివరగా పేజీ పేజీని వర్ణరంజితం చేసిన వందలాది ఇమేజీలతో రూపొందిన ‘శేషాచలం కొండకోనల్లో’ పుస్తకంలో డిజైన్ పరంగా లోపాలు, అచ్చుతప్పులు వంటివి పంటికింద రాయిలా కనిపించవచ్చు. పైగా 220 పేజీల ఈ పుస్తకానికి సామాన్యులు భరించలేనంతగా వెయ్యి రూపాయల ధర పెట్టడం (ఖరీదైన పేపరులో ముద్రణే కావచ్చు) సాహసమే. మలి ముద్రణలో అయినా దీన్ని సామాన్య పాఠకులకు చేరువయ్యేలా చేస్తారని ఆశిద్దాం.
పుస్తకం: శేషాచల కొండకోనల్లో
రచయిత: భూమన్
పేజీలు: 200, వెల: రూ.999
ప్రచురణ కర్త: Enterprise Minds, తిరుపతి
ప్రతులకు: 919885 151357
ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యం
పరిచయకర్త
కె.రాజశేఖర రాజు
73964 94557