
పాలిచ్చి పెంచినదట ఓ తల్లి...
అది ఒక కల, ప్రేమించి
పెంచుదామనుకున్నాడట ఓ తండ్రి...
అది ఒక వ్యధ, రెండింటికి నోచుకోని
ఆ పిల్లాడి జీవితం..
ఓ కరుడుగట్టిన గుండె కథ!
పొత్తిళ్లలో లాలించిన తల్లి,
మరి యే వత్తిళ్లల్లో వాడిని వదిలేసిందో...
మందు మత్తులో చిందేసిన తండ్రి,
యే మైకంలో, మరి యే
మందు రోగంతో వాడిని పాలించాడో...
జీవితాన్ని మ్రానుగా చేసి,
మర్రిచెట్టు ఊడలా వలసవెల్లిన ఓ తండ్రి...
గుడ్డిగా, జంటగా వెంట నడిచిన ఆ తల్లి...
చేతులు దులుపుకొని,
కంట తడి తెచ్చుకుని ఒక
పిల్లాడి భవిష్యత్తు అప్పగింతలు ...
ఆ తరువాత, బావిలో కప్పలై
కుప్పి గెంతుల బ్రతుకు తంతులు .
తల్లి దైవం, తండ్రి దైవం అనే సుద్దులు
ఇపుడు ఆ పిల్లాడికి హాస్యాస్పదాలు..
అనుక్షణం మదిలో మెదిలే
విలయరూప తాండవాలు..
అస్సలు ఆ గుండెరాయికి ఇప్పుడు
కని, పెంచిన తల్లితండ్రే లెక్కల్లో లేరు
లెక్కల్లో రారు... కూడా...
ఇక కనిపించని దైవ పదార్థం ఒక లెక్కా.
- ప్రవీణ్ శ్రీ
90100 29002