ఓటర్ రాసిన సిరా శాసనం

Ink inscription written by voter in Telangana election

Update: 2023-12-04 00:45 GMT

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించారు. పరిణితి చెందిన రాజకీయ నాయకుడికి ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంతం అవసరం! ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నది మీ పట్టు నుంచి జారి, కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలికలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. ‘పదుగురాడు మాట పాటియై ధర జెల్లు ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకుండువాని నూరెల్ల నోపదు విశ్వదాభిరామ.. వినుర వేమ!’ ఎక్కువ మంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. ప్రస్థుత పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్ పోల్స్ కాదనీ, మా లెక్కలు మాకున్నాయనీ డాంబికంగా చెప్పిన వారికి ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బ.

ఆరు గ్యారంటీలే విజయమంత్రం

రాష్ట్రంలోని ఈ ఫలితం వెనక ఆరు గ్యారంటీలే విజయమంత్రంగా చెప్పుకోవచ్చు. ముందునుండి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అలాగే మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కర్ణాటక తరహాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఖచ్చితమైన సమాచారాన్ని పారదర్శకంగా మహిళలకు, రైతులకు, కౌలురైతులకు నిరుద్యోగులకు విద్యార్థులకు, మైనారిటీ వర్గానికి అందేటట్లు చేసిన కసరత్తు మంచి ఫలితాలని ఇచ్చింది. అలాగే పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగాలు చేసి వ్యూహాత్మకంగా అధికారపక్ష వేగాన్ని నియంత్రించినాడు. ఆయన గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడంలో అధిష్టానాన్ని ఒప్పించి అన్ని తానై తన భుజస్కంధాలపై బాధ్యతను మోసి విజయాన్ని అందించాడు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి ప్రజల నాడిని తెలుసుకుని కాంగ్రెస్ పోటీలో లేదు అన్న స్థాయి నుంచి కాంగ్రెస్సే పోటీ అన్న స్థాయికి తీసుకు వచ్చాడు.

వ్యతిరేకత ఉందని తెలిసినా..

ప్రస్తుత బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ నుంచి చాలా గట్టి సవాలును ఎదుర్కొంది. నిరంతర ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు వంటి వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాన్ని గత ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్ పొందిందని, అవే అస్త్రాలు ఈ ఎన్నికల్లో అంత బలంగా పనిచేయలేదనేది నిర్వివాదాంశం. పదేళ్ల తర్వాత పాలన మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడం, కొత్తదనం కోసం ఆరాటపడే వాళ్లుండటం ఒక పార్శ్వం మాత్రమే. దానికంటే ప్రధానమైనది కుటుంబ పాలన. ప్రత్యర్థుల భాషలో చెప్పాలంటే అహంకార వైఖరి. అదీ ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధానంగా ఎదుర్కొంటున్న ఛాలెంజ్. దానికి తోడు యువతలోని కొన్ని వర్గాలలో పేరుకుపోయిన నిస్పృహ, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పరిణమించింది. ఎన్నికల్లో ఉపయోగపడగలిగిన అంశాలపై పెట్టిన శ్రద్ధ, ఉపాధి మీద పెట్టలేదనేది ఎక్కువగా వినిపించే విమర్శ. కనీసం ఎమ్మెల్యేలకు కూడా రోజుల తరబడి అపాయింట్మంట్ ఇవ్వని వైనం, సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఫామ్ హౌస్‌లో ఎక్కువ కాలం గడుపుతారనే విమర్శ, వీటన్నింటికి తోడు కాళేశ్వరం కుంగిపోవడం కూడా తోడైంది. ఇవ్వన్నీ వ్యతిరేకతను పెంచాయి. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉన్నా దాదాపు సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వడం పెద్ద తప్పు! ఇక పథకాల్లో సైతం రైతుబంధు, దళిత బంధు, రెండు పడకల ఇళ్ళు లబ్దిదారులకు చేరకపోవడం, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎక్కువవడంతో ఓటమి తప్పలేదు. పైగా ధరణి గూర్చి గొప్పగా చెప్పుకున్న అధికార పార్టీ చివర్లో తప్పులున్నాయని చెప్పడం వాటిని సరిదిద్దుతాం అని ముక్తాయించడం. ప్రచార ఆరంభంలోనే ఓడిస్తే రెస్టు తీసుకుంటాం అని స్వయంగా ఆధినేత చెప్పడం స్వయంకృతాపరాధమే. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆలోచన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంలో వైఫల్యం, గతంలో చేసిన తప్పిదాలు ఎమ్మెల్యే కొనుగోళ్లు ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణాలు.

బీజేపీని కుంగదీసిందిదే!

తెలంగాణాలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్యాయం బీజేపీ అన్న చందంగా ఉన్న పరిస్థితి నుంచి మూడో స్థానానికి దిజజారడం బీజేపీ స్వయంకృతాపరాధమే. అన్ని విషయాలలో మీనమేషాలు లెక్కించడం వ్యూహాత్మక తప్పిదం. పార్టీని పార్టీలో వున్న నేతలను కాపాడుకోవడంలో విఫలమైంది. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల్లో గట్టిపోటీతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ ఊపులో ఉన్నట్టు కనిపించేది. కల్వకుంట్ల కవిత మీద కేంద్ర సంస్థల విచారణ మందగించడం ఇవన్నీ కొత్త కథనాలకు తెరతీశాయి. బీఆర్‌ఎస్ బీజేపీ లోపాయికారీగా కుమ్మక్కయ్యాయనే వాదనను కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. అది వేగంగా జనంలోకి వెళ్ళిపోయింది. బీజేపీ బలాన్ని కుంగదీసింది. ప్రజాస్వామ్యంలో ప్రభువులను ఎన్నుకునేది ప్రజలే! రాజకీయ పార్టీలు ఎన్ని ఆకర్షక మంత్రాలు వేసినా విచక్షణతో తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఓటర్ తన చేతి సిరాతో రాసిన సిరా శాసనం ఇది!

-వాడవల్లి శ్రీధర్

99898 55445

Tags:    

Similar News