రాజకీయమంతా బిలియనీర్ల చేతుల్లోనే..!

ప్రపంచ దేశాలలో మనది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థట. కానీ దేశ ప్రజలకు మాత్రం ఇక ఉచితలే గతిగా మిగిలాయి. ఐనా, ప్రభుత్వాలు అమలు చేస్తున్న

Update: 2024-07-02 02:15 GMT

ప్రపంచ దేశాలలో మనది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థట. కానీ దేశ ప్రజలకు మాత్రం ఇక ఉచితలే గతిగా మిగిలాయి. ఐనా, ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సాంఘిక సంక్షేమ పథకాలపై చేసే వ్యయం స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 1.5% మాత్రమే. ఫలితంగా మానవ అభివృద్ధిలో మన దేశం 191 ప్రపంచ దేశాల్లో 132 వ స్థానంలో ఉంది. మరోవైపు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న దేశీయ బిలియనీర్లు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల 18వ లోక్‌సభ ఎన్నికలలో 93 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులు ఉన్నారు. మొత్తం 543 మంది ఎంపీలలో 504 మంది కోటీశ్వరులే గెలవడం జరిగింది.

అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ 1776 లోనే ప్రచురించిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' అనే గ్రంథంలో వ్యాపారస్తులు ప్రభుత్వాలను శాసించకూడదన్నారు. వ్యాపారస్తులను ఆర్థిక వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చూసే బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టాలి. చైనాలో కమ్యూనిస్టులు వ్యాపారస్తులను ముందుగా అధికారం నుంచి దించేశారు. వ్యాపారస్తులు దేశం వదిలి వెళ్లిపోయారు. తిరిగి వచ్చి చైనా స్టేట్ నియంత్రణకు లోబడి ఉత్పత్తులు కొనసాగించారని మరువరాదు. అందుకే చైనా నేడు పెట్టుబడిదారి దేశాలకు దీటుగా తన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకుంది. అందుకే అగ్రగామి దేశంగా కూడా ఉంది. ప్రజా ఉపయోగ పెట్టుబడులు చేసేందుకు ప్రయత్నాలు చేయవలసింది ప్రభుత్వాలే..!

పేదల రాజ్యం కాదు....

ఆర్థిక వృద్ధితో ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. మన దేశ ఆర్థికభివృద్ధిలో ఎవరి ఆదాయాలు పెరుగుతున్నాయి? సంపన్నుల ఆదాయాలా లేదా పేదల ఆదాయాలా? ధనికుల ఆదాయాలు పెరిగే కొలది ఆదాయ అసమానతలు ఎక్కువవుతున్నాయి. అంటే వృద్ధి విధానాలు ధనికులకు ఉపయోగపడే విధంగా రూపకల్పన జరుగుతున్నాయని అర్థం. ఆర్థిక విధానాల రూపకల్పనలో ధనికుల భాగస్వామ్యం మాత్రమే ఉన్నది. ఇది డెమోక్రసీలో ఉండే ఫ్లూటోక్రషి పాలకులు ఫ్లూటోగ్రాట్స్‌గా మారువేషంలో ఉండడం ప్రజలకు తెలియదు. పాలకులు, ప్రభుత్వాలు మన కోసం ఉంటాయని వీరనుకుంటారు. 2023 నీతి ఆయోగ్ ప్రకారం దేశంలో 25 కోట్ల మంది పేదలు ఉన్నారు. మార్చి 2024 వరల్డ్ ఎనీక్వాలిటీ ల్యాబ్ అనే గ్లోబల్ పరిశోధన సంస్థ వారు పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఇందులో 1922-2023 మధ్యకాలం భారతదేశంలోని ఆదాయ సంపదల అసమానతలు గురించి వివరంగా తెలియజేశారు. భారతదేశం బిలినియర్ల రాజ్యం వైపుగా పరుగులు తీస్తున్నారని తెలియజేశారు.

90 శాతం ఎంపీలు కోటీశ్వరులు..

ఈ ప్రపంచస్థాయి పరిశోధనా పత్రం ప్రకారం భారతదేశంలో ఉన్నత ఆదాయ వర్గం వారు ఒకే ఒక శాతం వారు దేశంలోని జాతీయ ఆదాయంలో 22.6% పొందగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే 0.1 శాతం ధనికులు మన దేశ జాతీయ ఆదాయంలో 10% పొందుతున్నారు. ఇది ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ. ఇక సంపద విషయానికొస్తే 2022-23లో ఒక శాతం ధనికుల దగ్గర 40.1 శాతం సంపద ఉన్నది. అల్పాదాయ వర్గాలైన పేదలు 50%, మధ్యతరగతి వర్గాల వారు 40 శాతం వీరి సంపద క్రమంగా తగ్గిపోతున్నది. పేదలు నిరుపేదలుగాను ధనికులు ధనవంతులుగాను మారుతున్నారు. అందుకే 80 కోట్ల పేద కుటుంబాలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇది డెమోక్రసీనా లేక ఫ్లూటోక్రసీనా అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సందేహం వెళ్లబుచ్చింది.

బీజేపీ నుంచి గెలిచిన 240 మందిలో 227 మంది కోటీశ్వరులు. కాంగ్రెస్‌లో 92 మంది టీడీపీలో 16 మంది జేడీయులో 12 మంది కోటీశ్వరులుగా ఎంపీలుగా గెలిచారు. అంతేకాదు ముఖ్యంగా లోక్‌సభ సభ్యులు కోటీశ్వరులవుతున్నారు. వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. 2009లో 315 మంది, 2014లో 443, 2019లో 475, 2024లో 504 మంది కోటీశ్వరులుగా లోక్‌సభలో పెరిగారు. ఇలా పాలకుల ఆదాయాలు, ఆస్తులు గణనీయంగా దేశంలో పెరుగుతున్నాయి. సామాన్యులకు రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యంలో చోటు లేదు.

పెరిగిన బిలియనీర్ల సంఖ్య

దేశంలో డెమోక్రసీని నడిపిస్తున్నది ఫ్లూటోక్రసీ. అందువల్ల ఇక ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు. 1990లో సరళీకృత ఆర్థిక విధానాలు చేపట్టినప్పుడు ఇద్దరే ఇద్దరు మన దేశంలో బిలియనీర్లు ఉండగా, వారి సంపద కేవలం 3.2 బిలియన్ డాలర్లు ఉండేది. 2012 నాటికి 46 మంది బిలియనీర్లు వారి సంపద విలువ 176.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2023 నాటికి బిలియనీర్ల సంఖ్య 169కి పెరిగింది. వీరి సంపద విలువ 675 బిలియన్ డాలర్లు. నేడు 200 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద విలువ 954 బిలియన్ డాలర్లు. అంటే 80 లక్షల కోట్ల రూపాయల సంపద బిలియనీర్ల దగ్గర మాత్రమే ఉంది. మన దేశ జాతీయ ఆదాయం ప్రస్తుతం 272 లక్షల కోట్ల రూపాయలు.

దేశం ప్రజాస్వామ్యానికి తల్లికాదు..

పెట్టుబడులు దేశానికి ఉపయోగపడే విధంగా ఉపాధి ఆదాయాలు కల్పించే విధంగా ఉండాలి. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, పెట్టుబడిదారుడు కాదు. మరి ఆర్థిక విధానాల రూపకల్పన ఎవరు చేస్తారు? వస్తు సేవల ఉత్పత్తి కదా దేశ భవిష్యత్తును నిర్ణయించేది? ప్రజా ఉపయోగ పెట్టుబడులు చేసేందుకు ప్రయత్నాలు చేయవలసింది ప్రభుత్వాలే? పాలకులు మాత్రం బిలియనీర్లను నమ్ముకుని, దేశ సహజ సంపదను వారికి అప్పగించి తద్వారా దేశం అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మేము పాలించే వాళ్లమే కానీ వ్యాపారం చేసే వాళ్లం కాదని బాహాటంగా చెబుతున్నారు. పూర్వకాలంలో రాజుల్లాగా ప్రజలను పాలించేందుకు పూనుకున్నారు. అందుకే మన దేశంలో ఉన్నది డెమోక్రసీ కాదు ప్లూటో క్రసి. అందువలన భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి కాదు... బిడ్డ మాత్రమే.

డా. ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి.

98663 22172

Tags:    

Similar News