ప్రతిపక్షం ఆలోచనా విధానం మారాలి!
దాదాపు ఆరు దశాబ్దాలు తిరుగులేని అధికారంతో ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్
దాదాపు ఆరు దశాబ్దాలు తిరుగులేని అధికారంతో ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉండడం ససేమిరా ఇష్టముండదు. మోడీ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దెప్పి పొడవడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో, స్మారక నిర్మాణం విషయంలో ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు మన్మోహన్ సింగ్ అభిమానులను, జాతి హితైషులను బాధిస్తున్నాయి.
మన్మోహన్ సింగ్ ఈ దేశ ప్రజల మన్ననలను పొందిన రాజనీతిజ్ఞుడు, పైగా అజాతశత్రువు. ఆయన మరణ వార్త అందుకున్న వెంటనే మోడీ ప్రభుత్వం కేబినెట్ సమావేశం జరిపి, సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన నివాసానికి వెళ్లి, శ్రద్ధాంజలి ఘటించింది. స్మశాన వాటిక వద్ద ప్రభుత్వం చేయవలసిన వీధులన్నింటిని సక్రమంగా నిర్వహించింది. దేశ ప్రజలు ఆయన విషయంలో ఎలా ఆలోచించారో వారి ఆలోచనల తీరును ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిబింబించింది.
వీరి అవమానాన్ని మర్చిపోగలమా?
ఈ దేశం ఆర్థికంగా దివాలా తీసిన సందర్భంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల ద్వయం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో చేసిన కృషి నేడు ప్రభుత్వాన్ని నడిపే నాయకులందరికీ తెలిసిన విషయమే. మాజీ ప్రధానమంత్రిని అధికార పార్టీ మెచ్చుకోవడం, ఆయన అంత్యక్రియలు జాతి అనుకున్న రీతిలో జరపడం అసాధారణం. వాస్తవం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ మాజీ ప్రధానమంత్రి దివంగతులైతే పరిస్థితి ఎలా ఉండేదో, సొంత పార్టీ వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం సంభవించినప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకులు ముఖ్యంగా సోనియాగాంధీ ప్రవర్తించిన తీరును ఒకసారి గుర్తు చేసుకుంటే, వారి సంకుచిత రాజకీయాలు మరోసారి బయటపడతాయి. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీకి ధారపోసి, దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించి, దేశ అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించిన పీవీ నరసింహారావు పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోని రానీయకుండా, తలుపులు మూయించి, ఆయనకు చేసిన అవమానాన్ని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు.
సిక్కులపై ఈ ప్రేమ ఇప్పుడెందుకు?
మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో మోడీ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదని, ఆయన సిక్కు మతానికి చెందినవాడు అయినందువలన, ఇలా జరుగుతుందని ఆరోపణలు గుప్పించే కాంగ్రెస్ నాయకులు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ప్రశ్నలకు నిజాయితీతో సమాధానం చెప్పాలి. తన తండ్రి మరణించిన సమయంలో కాంగ్రెస్ కమిటీ సంతాప తీర్మానం కూడా ప్రవేశపెట్టలేదని, ఈ విషయంపై తనకు సరైన సమాధానం చెప్పేంతవరకు వదిలేది లేదని, స్వార్థపూరిత ఆలోచనలను, దుర్బుద్ధిని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా మానుకోవాలని ఆమె చెప్పిన మాటలు కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందనేది కాదనలేని సత్యం. ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గూండాలు జరిపిన మారణహోమంలో 3000 మంది అమాయకపు సిక్కులను ఊచకోత కోసినప్పుడు, ఒక మహా వృక్షం కూలినప్పుడు భూమి కంపిస్తుందని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అన్న మాటలు సిక్కుల మనోఫలకాల నుండి ఎవరూ తొలగించలేరు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు. గొప్ప వ్యక్తులు మరణించిన సమయంలో కూడా రాజకీయాలు చేసి, లబ్ది పొందాలని చూడడం కాంగ్రెస్ నాయకుల నైజం.
ప్రణబ్‌ని అవమానించింది ఎవరు?
జాతీయ విషయాలలో ప్రణబ్ ముఖర్జీది దృడవైఖరి. ఈ విషయంలో కూడా సోనియా గాంధీకి ఆయనకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ప్రతి సంవత్సరం నాగపూర్‌లో జరిగే ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఆయన వెళ్లకుండా ఆపడానికి సోనియాగాంధీ అనేక ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రణబ్ ముఖర్జీ తన మాటనే చెల్లించుకున్నాడు. ఇంత జరిగాక ఆయన మరణించిన సమయంలో సంతాప తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే సోనియాగాంధీ ఊరుకుంటుందా? ఆమెది వెస్ట్రన్ క్రోమోజోముల పరంపర. ఈ పరంపరనే కలిగిన ఆమె కుమారుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బయట దేశాలకు వెళ్లి, భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడడం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై అవాకులు, చవాకులు పేలడం చూస్తూనే ఉన్నాం. మొదలు మోదుగ పూస్తే, కొస సంపెంగ పూస్తుందా? అని పెద్దలు చెప్పిన మాటలు ఉన్నాయి కదా!
- ఉల్లి బాలరంగయ్య
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877