మార్కెటీకరణ వైపుగా.. పోస్టల్ విభాగం!

రచయితలు పుస్తకాలు రాయడం, ప్రచురణకర్తలు ఆ పుస్తకాలను ప్రచురించటం, కొన్నిసార్లు రచయితలే పుస్తకాలు రాసి

Update: 2025-01-02 01:15 GMT

రచయితలు పుస్తకాలు రాయడం, ప్రచురణకర్తలు ఆ పుస్తకాలను ప్రచురించటం, కొన్నిసార్లు రచయితలే పుస్తకాలు రాసి సొంత నిధులతో ప్రచురించుకోవడం.. ఇదంతా ఇంతవరకు కొనసాగుతూ వచ్చిన కథ. ప్రచురించిన పుస్తకాలన్నీ దేశంలోని ఏ మూలకైనా చదివే పాఠకులకు అందించడానికి భారత ప్రభుత్వ పోస్టల్ సర్వీస్ గణనీయమైన పాత్రను ఇంతవరకు పోషించింది. రిజిస్టర్ బుక్ ప్యాకెట్ అనీ లేదా రిజిస్టర్ బుక్ పోస్ట్ అనీ దాదాపు 28 రూపాయలు చెల్లించి పుస్తకాలు దేశంలోని ఏ మూలకైనా పంపించగలిగే అవకాశం ఉండేది. కానీ పోస్టల్ విభాగం ఇప్పుడు ఈ సబ్సిడీని తొలగించింది. ఇది చాలా బాధాకరమైన విషయం. పత్రికల మీద కూడా రాయితీలు తొలగించినట్టు సంపాదకులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేశారు. ఇది మొత్తం పబ్లిషింగ్ రంగానికి, పత్రికలకు చాలా పెద్ద దెబ్బ. అలానే పుస్తకాలు చదువుకోవాలనుకున్న ఒక పెద్ద తరానికీ, రచ యితలకూ కూడా ఇదో పెద్ద వెన్నుపోటు.

స్వాతంత్రం తర్వాత మనం రాసుకున్న మిక్స్‌డ్ ఎకానమీ సూత్రాల ప్రకారం కొన్ని రంగాలను ప్రభుత్వమే నడుపుతూ నష్టాలైనా, లాభాలైనా బాధ్య తతో నడపడం కొనసాగింది. అది విద్యాలయాలు కావచ్చు. వైద్య సేవలు కావచ్చు. బస్సు సర్వీసులు కావచ్చు. ఇండియన్ రైల్వే కావచ్చు. ఇవన్నీ ప్రభు త్వమే నడపాలి. భారత ప్రజలు ఎన్నుకున్న ప్రభు త్వాలు ఇతర సేవలు అందించే విధంగానే, జ్ఞానా న్ని పంచడానికి కూడా సహకరించాలి. ఇది ప్రభు త్వాల కనీస బాధ్యత. సంక్షేమ ప్రభుత్వాలు ఈ పాత్రను కొంతవరకైనా నిర్వర్తించగలగాలి. కానీ ఈ బాధ్యతను కూడా ప్రైవేట్ పరం చేస్తే ఎలా?

పోస్టల్ సర్వీస్ కనుమరుగు..

గతంలో పుస్తకాలను దూరం ప్రకారం కిలోమీటర్ల లెక్కలేకుండా దేశంలోని ఏ మూల నుండి ఏ మూలకైనా ఓ 28 రూపాయలు ఇస్తే అందించగలిగే ఏర్పాటు ఉండేది. ఈ రోజు కిలోమీటర్లు లెక్క చొప్పున పుస్తకాలను అందించినప్పటికీ ఇందుకు దాదాపు 50 రూపాయల నుండి వంద రూపా యలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలే పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు. అందుకే చాలా పుస్తకాలను ప్రచురణకర్తలు కూడా ప్రచురించడం లేదు. అయినా సరే, పుస్తక దాహం ఉన్న రచయితలూ, విజ్ఞానాన్ని పంచాలనుకున్న ఔత్సాహిక రచయితలూ తామే పుస్తకాలు రాసుకొని, తామే ప్రచురించి తమ సంతృప్తి కోసం విజ్ఞానాన్ని పదిమందికి పంచడానికి కోసం కనీసం పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ఇలా ఆధారపడ్డారు. అది కూడా ఈరోజు లేకుండా పోయింది. అలానే ఎన్నో పత్రికలు అత్యంత సరళమైన సబ్సిడీ రేటుతో ఏ మూల ఉన్నవారికైనా అందించగలిగే ఏర్పాటు ఉండేది. ప్రగతిశీల సంస్థలు కూడా ఈ విధంగా ఎన్నో పత్రికలను ఎన్నో నష్టాలను, నష్టాలను ఓర్చుకుంటూ కూడా వెలువరిస్తున్నాయి. ఈరోజు ఆ పత్రికలు పోస్ట్ చేయాలంటే బహుశా 50 పైసలు దగ్గర పది రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే, పోస్టల్ సర్వీసులను పూర్తిగా మార్కెటీకరణ వైపు నెట్టేశారు.

సర్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల మయం..

ప్రపంచీకరణ, మార్కెటీకరణ, ఆర్థిక సరళీకరణ ఫలితాలు ఇలానే చాలా దారుణంగా ఉంటాయి. గ్యాస్ సిలిండర్లలో సబ్సిడీలను మెల్లమెల్లగా తొలగించే ప్రక్రియ ఎప్పుడో ఆరంభమై అంతమైంది. ఇండియన్ రైల్వేలో కూడా ఒక్కొక్క విభాగం వంతుల వారీగా కాంట్రాక్టర్లకు అందించి రైల్వేలను బలహీనం చేసే ప్రక్రియ ఎప్పుడో ఆరంభమై దాని దుష్ఫలితాలను ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్నెన్నో పరిశ్రమలు ప్రభుత్వం చేతుల్లోంచి ప్రైవేట్ చేతుల్లోకి మెల్లమెల్లగా మరలిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా కార్పొరేట్ల కన్ను ఉంది. విపరీతమైన వ్యతిరేకత కారణంగా కొంచెం తగ్గినా సరే అవకాశం దొరికినప్పుడు పంచుకోవడానికి సిద్ధంగా కార్పొరేట్ రంగం ఉంది. వైద్య రంగం కూడా భారత ప్రభుత్వం చేతుల్లో బలహీనమైపోయింది. ఈ రోజు నర్సులు చేయాల్సిన చిన్న చిన్న పనులు హాస్పిటల్‌లోని ఆయాలూ, స్వీపర్లు చేస్తుండడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పోస్టల్ సర్వీసులో కూడా కాంట్రాక్టు ఉద్యోగులు పెరిగారు.

తపాలాను ఆక్రమిస్తున్న కొరియర్..

పోస్టల్ సర్వీస్ వారి సబ్సిడీ సేవల తొలగింపు కూడా ఈ కోణంలోనే చూడాలి. ఈ రకమైన సర్వీస్‌లను అందించే కొరియర్ రంగం ముందుకు రావాల్సిన అవసరం అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గం కోరిక. అందుకు ఈ పోస్టల్ సర్వీస్‌లో ఈ సబ్సిడీలు అన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి. అలానే కిండెల్ ‌లను ప్రతి భారతీయుడి అరచేతిలో పెట్టడానికి మరో పెద్ద వర్గం సిద్ధంగా ఉంది. కిండెల్ పుస్తకాలతో వేల కోట్ల రూపాయల వ్యాపారం కోసం నేల సిద్ధం కాబోతోంది. గతంలో, మొబైల్ ఫోన్లు చేతుల్లోకి అలానే చేరాయి. నోట్ల రద్దు తర్వాత మనం డిజిటల్ పేమెంట్‌ల కంపెనీల అభివృద్ధిలో గణనీయమైన మార్పు చూశాం. గతంలో లేని ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేమెంట్ యాప్‌లు అనూహ్యంగా పెరిగాయి. చిన్న చిన్న ప్రయోజనాలను మనకు అందించాయి. కానీ, అవి అంతకంటే పదిరెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందాయి. ఇప్పుడూ కథ అలానే అంతమవుతుంది.

ప్రగతిశీల పత్రికలపై పెను దెబ్బ

కార్పొరేట్ రంగం గతంలో వ్యవసాయాన్ని హైజా క్ చెయ్యాలనుకుంది. కానీ, రైతులు కానివ్వలేదు. ఇప్పుడు కూడా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి బడా కంపెనీలు కూడా ఈ డెలివరీ సర్వీసులో మోనోపొలీలో ఉంటాయి. కిండెల్ డౌన్లోడ్ అయినా, ఫిజికల్‌ గా పుస్తకాల పంపిణీ అయినా ఇవే శాసిస్తాయి. ఎందుకు గోల అని పబ్లిషర్స్ కూడా వీటిమీదనే ఆధారపడతారు. కార్పొరేట్ వర్గం నడిపే పత్రికలకు ఇబ్బంది ఉండదు. కానీ, మంచి విలువలు అందించే ప్రగతిశీల పత్రికలు నిలదొక్కుకోవడం కష్టం. ఇది మరింత బాధాకరమైన విషయం. కానీ, ప్రజలు కొత్త చైతన్యంతో ముందుకు వెళ్తే నాయకులకు ఇబ్బంది. కాబట్టి, వారికి మాత్రం ఇది చాలా సదుపాయంగా ఉంటుంది.

- కేశవ్

ఆర్థిక, సామాజిక విశ్లేషకులు

98313 14213

Tags:    

Similar News