సంతలను కార్పొరేట్ల చేతికిస్తే..
ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా గ్రామీణ సంతలను
ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా గ్రామీణ సంతలను కూడా ప్రైవేటీకరించి, కార్పొరేట్ల దిగ్గజాల అధీనంలోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఇది ఒక దుర్మార్గ చర్య. సంతలు అనేవి వందల ఏళ్లుగా గ్రామీణ జీవనానికి ప్రాణాధారంగా నిలిచిన ఓ సాంప్రదాయ మార్కెట్ల వ్యవస్థ. గ్రామీణ రైతుల, చిరు వ్యాపారుల బతుకుదెరువు. ఇప్పుడు అలాంటి జీవనాధారం అయిన చిరు సంతలను కూడా ఓర్వలేని మోడీ ప్రభుత్వం ఆధునీకరణ పేరుతో కార్పొరేట్ వ్యవస్థల్లోకి విలీనం చేయడానికి పూనుకొంది. అందుకు అనువుగా అనేక కుట్రపూరిత చర్యలను చేపడుతోంది.
భారతదేశంలోని వేలాది సంతలను ప్రయివేటు రంగంలోకి తీసు కొచ్చి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోడల్ ద్వారా కార్పొరేట్ల వశం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇప్పుడు రాష్ట్రాలకు పంపిన జాతీయ ఏకీకృత మార్కెట్ విధానం ప్రకారం, గ్రామీణ మార్కెట్లను ఆధునిక వ్యవసాయ కేంద్రాలుగా మలచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని లక్ష్యం.. మార్కెట్లకు మౌలిక వసతులు, రైతుల ఆదాయాలను పెంచడమేనని చెప్పబడుతున్నా, ఈ ప్రతిపాదన వెనుక గ్రామీణ ప్రజల జీవన స్వావలంబనను దెబ్బతీసే కుట్రపూరిత పథకం దాగి ఉంది.
కార్పొరేట్లు ప్రవేశిస్తే..
భారతదేశంలో సుమారు 23,000 సంతలు ఉన్నాయి. ఇవి ప్రజల ఆత్మనిర్భరతకు చిహ్నంగా నిలుస్తాయి. రైతులు, చిన్న వ్యాపారులు ఈ మార్కెట్ల ద్వారా తాము ఉత్పత్తి చేసిన పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు గ్రామీణ పిండివంటలు, చిరు తిండ్లు, చేతి వృత్తి ఆధారిత వస్తువులను గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతంలోని వినియోగదారులకు వారంలో రోజుకొక వీధిలో నేరుగా విక్రయిస్తారు. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం ఈ సంతలను ప్రయివేటు రంగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోడల్ ద్వారా కార్పొరేట్ల వశం చేయడానికి పూనుకుంది. ఇందుకు గ్రామీణ మార్కెట్లలో మౌలిక వసతులు లేవని, ధరల నిర్ధారణ వ్యవస్థ ఏకీకృతంగా లేదని పేర్కొంటుంది. కానీ ఇదే జరిగితే గ్రామీణ ప్రజల ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ ఆధీనంలోకి నెట్టివేయడమే తప్ప మరొకటి కాదు. మార్కెట్లలోకి కార్పొరేట్ల రంగ ప్రవేశం వల్ల పెద్ద ఎత్తున స్థానిక చిన్న వ్యాపారులు, రైతులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు సంప్రదాయంగా అడవుల్లో సేకరించిన ఉత్పత్తులను సంతల్లో అమ్మడం ద్వారా గిరిజనులు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ల అధికమూల్య విధానాలు గిరిజనులకు తక్కువ ధరలను అందుబాటులోకి తెస్తాయి. ఇకపై యూజర్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజుల భారంతో ఈ సమూహాలు మరింతగా దెబ్బతింటాయి. ఇప్పటికే వినియోగదారులు కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలలో చిక్కి అధిక ధరలకు బలవుతున్నారు. ఇవి గ్రామీణ స్థాయిలోకి చేరితే కోట్లాది మందికి ఉపాధి పోతుంది.
ఇది ప్రతి రంగంలో కొనసాగితే..
పీపీపీ మోడల్ వల్ల లబ్ధిపొందేది ఎవరో అనేది ఓ పెద్ద ప్రశ్న. ఈ విధానం ద్వారా కేవలం కార్పొరేట్ల లాభాలను పెంచడం కాక, గ్రామీణ వ్యాపారులను మూలాలకు నెట్టివేయడం జరుగుతుంది. తరతరాలుగా ఆస్తులు లేకుండా చిన్న వ్యాపారులు ఈ సంతలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు పెద్ద సంస్థల ఆర్థిక శక్తి ముందు వారు నిలబడలేరు. ఇప్పుడు ఆత్మహత్యలు రైతుల నుండి, రైతు కూలీలకు, అక్కడ నుండి చేతివృత్తులకు పాకాయి. ఇప్పుడు గ్రామీణ మార్కెట్ల వంతు వచ్చింది. ఇది ప్రతిరంగంలో కొనసాగితే పెద్ద ఎత్తున మానవ మారణ హోమం త్వరలో జరగనుంది. ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రజాస్వామ్య హక్కులకు పెద్ద ముప్పు తలెత్తుతుంది. సంతల నిర్వహణలో స్థానిక ప్రజల పాత్రను పూర్తిగా తొలగించి, వారి జీవన విధానాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమే కాదు దుర్మార్గం. ఇందులో కుట్రకోణం దాగివుంది. వామపక్ష విమర్శకులు దీనిని నయా వలసవాద విధానమని అంటున్నారు. ఈ విధానం స్థానిక అభివృద్ధి కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తోంది. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలైన ధరల నియంత్రణ, సాంకేతిక మద్దతు, మధ్యవర్తుల దోపిడీ నివారణ వంటి అంశాలను ప్రభుత్వాల విధానాలు పట్టించుకోవు.
గ్రామీణ జీవితాన్ని కాపాడాలి..
దీనికి ప్రత్యామ్నాయంగా సహకార వ్యవస్థలను ప్రోత్సహించడం మంచిది. సహకార సంఘాలు కార్పొరేట్లలోకి వెళ్లకుండా మౌలిక వసతులను అందించగలవు. స్థానిక పాలనా సంస్థల ఆధ్వర్యంలో సంతలను అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజల హక్కులను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలి. సంతలు కేవలం ఆర్థిక కేంద్రాలు కాదు, అవి గ్రామీణ సంస్కృతి, సామాజిక జీవనానికి చిహ్నాలు. వాటిని కార్పొరేట్ ఆధీనంలోకి తీసుకెళితే ఈ సంప్రదాయాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని పునఃపరిశీలించి, స్థానిక ప్రజల హక్కులను, గ్రామీణ జీవితాన్ని కాపాడే దిశగా పని చేయాలి. ప్రజాస్వామ్యంలో ఆర్థిక విధానాలు కొద్దిమంది బడా కార్పొరేట్ల లాభాల కోసం కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని పరిరక్షించే బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఉంది.
- డాక్టర్. కోలాహలం రామ్ కిషోర్
98493 28496