భూ భారతి రైతులకు భరోసా!
తెలంగాణాలోని ఏ చారిత్రక సంఘటనైనా, సమరమైనా, సమస్యలైనా భూ కేంద్రంగానే అగ్రగామిగా నడిచాయి
తెలంగాణాలోని ఏ చారిత్రక సంఘటనైనా, సమరమైనా, సమస్యలైనా భూ కేంద్రంగానే అగ్రగామిగా నడిచాయి. తెలంగాణ ప్రజలకు భూమి పైన ఉండే మక్కువ ఎక్కువ. తెలంగాణలో రైతుల మధ్యన సమన్వయం కోసం, పాలన సౌలభ్యం కోసం, భూ అవగాహన కోసం, చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానా ప్రకారం షెత్వాల్ పేరుతో 1936వ సంవత్సరంలో చివరిసారి భూ సర్వే నిర్వహించారు. నాటి నుండి నేటి వరకు అంటే దాదాపు 90 సంవత్సరాలుగా అదే సర్వే ఆధారంగానే భూ హద్దులు ఉన్నాయి. స్వతంత్ర భారతంలో 1985వ సంవత్సరంలో ఎన్టీ రామారావు వ్యవసాయ రంగం, భూ రికార్డుల విషయంలో పటేల్, పట్వారి వ్యవస్థ రద్దు చేసి భూ హక్కుల రక్షణ ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేస్తూ ఎమ్మార్వోలను, వీఆర్వోలను, వీఆర్ఏలను నియమించి స్పష్టమైన పహాని నిర్వహణను చేయిం చారు. ప్రతి సంవత్సరం జమాబంధీలో భూ క్రయి విక్రయాలను పొందుపరుస్తూ ఎప్పటికప్పుడు స్పష్టం చేసే విధంగా గ్రామ రికార్డులను నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీలకు కల్పించి భద్రపరిచేవారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూ భారతి పేరుతో సమగ్ర భూ సర్వే చేయించాలని తలచాడు. కానీ అది కుదరలేదు.
ధరణి ప్రజలను గందగోళపరిచి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్, పూర్వాపరాలు ఆలోచించకుండా గ్రామ పంచాయతీ లేదా వీఆర్వో, వీఆర్ఏ, మండల రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించే భూ రికార్డులన్నీ కలెక్టరేట్లకు చేర్పించి తెలంగాణ రాష్ట్రంలోని 10,956 రెవిన్యూ గ్రామాలలో 23,000 మంది రెవెన్యూ ఉద్యోగులను రాత్రికి రాత్రే రద్దు చేశాడు. భూ రికార్డులు మొత్తం ఆన్‌లైన్ చేస్తున్నట్టు ప్రకటించి ఆర్ఓఆర్ 2020 ధరణి చట్టాన్నీ రూపొందించాడు. ఆయన నూతన చట్టాన్నైతే తెచ్చాడు గాని తెలంగాణ రైతాంగాన్ని సమస్యల సుడిగుండంలో మరింత లోతున పడేశాడు. ధరణి అమల్లో కి వచ్చాక, తప్పులు అధికారులు చేసినా రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా కేసులు భూమి విషయంలో కోర్టులో పెండింగులో ఉన్నాయంటే ధరణి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ధరణి వల్ల సదాబైనామా, పహాని, జమాబంధి, కాస్తుకాలం ఊసే లేదు. ఇలా కేసీఆర్ అనాలోచితంగా ఏకపక్షంగా తెచ్చిన ధరణి చట్టం తెలంగాణ ప్రజలను గందరగోళ పరిచింది. తెలంగాణ రైతన్న సమస్యలను అర్థం చేసుకొని, ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ఇందుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
భూభారతి చట్టంలో..
కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానం నెరవేరుస్తూ 18 డిసెంబర్ 2024న అసెంబ్లీలో ధరణిని రద్దుచేస్తూ, దాని స్థానంలో భూ భారతీను తీసుకొస్తూ నూతన ఆర్ఓఆర్ 2024 భూ భారతీ బిల్లును ప్రవేశపెట్టింది. ధరణి కన్నా భూ భారతీ మరింత మెరుగైనదని వివరించిన తర్వాత ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ మొత్తానికి భూ సర్వే చేయించాలనే అంశం చాలా ఆలోచింపజేసింది. ఎంత కష్టమైనా పొజిషన్ ప్రకారం సమగ్ర భూసర్వే చేసి తీరుతాం, అనేక సమస్యలు పరిష్కారిస్తామన్న మంత్రి మాటలు రైతులకు భవిష్యత్తు పైన నమ్మకం కలిగించాయి. ఈ చట్టం ప్రకారం, భూదార్ సంఖ్య కేటాయిస్తారు. భూ క్రయ- విక్రయాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాహసీల్దార్లకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు అప్పిల్స్ చేసుకోవచ్చు. కొత్తగా అనుభవదారు/ కాస్తు కాలాలను చేర్చారు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను పునరుద్ధరించనున్నారు. జమాబందీ, అడంగల్ పహాని నిర్వహణను మళ్లీ గ్రామ పంచాయతీలకు అప్పజెప్పబోతున్నారు. పాస్ పుస్తకం లో సరిహద్దు భూముల వివరాలు స్పష్టమైన లొకేష న్‌తో గీసిన మ్యాప్ ఉంటేనే మ్యూటేషన్, రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిం చారు. రానున్న మూడు నెలల్లో ఇందులో మరిన్ని అంశాలను పొందుపర్చబోతున్నారు. ఇలా తెలంగాణ రైతాంగ సమస్యలను తీర్చేం దుకు, సులువైన మార్గా లను పొందుపరిచేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని ప్రకటించి ప్రజల ఆశలను చిగురింప చేశారు. ఇలా స్పష్టమైన, పటిష్టమైన అవగాహన తోటి పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ గ్రామీణ వ్యవసాయ రంగం స్వర్ణ యుగం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. దీనికి మనందరి చేయూత అనివార్యమవుతుంది.
- సర్దార్ వినోద్ కుమార్,
పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్,
95735 94546