దక్షిణ భారత్‌లో... అస్తిత్వ రాజకీయాలు
In South India... Existential Politics
భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో మహాత్మాఫూలే, డా॥బి.ఆర్.అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు వంటివారి ఆలోచనలు పెద్దఎత్తున ప్రతిఫలిస్తున్నాయి. దక్షిణ భారత చారిత్రక సాంస్కృతిక, భాష, తాత్విక, భౌగోళిక, స్త్రీవాద విద్యా, అస్తిత్వాల నిరూపణకు, ప్రమాణబద్ధత కోసం గొప్ప కృషి జరుగుతోంది. ఈ క్రమంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ నిర్మించిన భారత రాజ్యాంగ లౌకికవాద సౌధం బీటలు వారకుండా దక్షిణ భారతంలోని ముఖ్యమంత్రులు, పాలకులు ఎంతో కొంత ప్రయత్నం కొనసాగించాలి.
సామాజిక సంస్కరణలకు పుట్టినిల్లు
ఇటీవల కాంగ్రెస్ పార్టీ లౌకికవాద నినాదాన్ని, రాజ్యాంగ రక్షణ నినాదాన్ని బి.సి.కులగణన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. దీనివల్ల పాత కాంగ్రెస్‌కు వున్న మతవాద భావనలు ఎంతో కొంత తొలిగాయి అనుకోవచ్చు. ఇటీవల రాహుల్ గాంధీ యాత్రలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నొక్కి వక్కాణిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయి. తమిళనాడులో డీఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ పెరియార్ రామస్వామి నాయకర్ భావజాలాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నారు. సనాతన ధర్మాలను కాకుండా ఆధునాతన ధర్మాల్లో భాగంగా కులాంతర వివాహితులకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు, ఉద్యోగం, ఇంటి వసతి కల్పిస్తున్నారు. దీనివలన అంబేడ్కర్ కుల నిర్మూలన భావం విస్తరిస్తూవుంది. కులనిర్మూలన భారతీయ సమాజాన్ని లౌకికవాదం వైపు నడిపిస్తుంది.
తమిళనాడులో వస్తున్న ఈ పరిణామం అంబేడ్కర్ భావజాలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేదిగా వుంది. ఈ విషయంలో అంబేడ్కర్ కులాన్ని నిర్మూలించాలంటే మనకు హేతువాద భావనా దృష్టి ముఖ్యం అని చెప్తూ ఈ విధంగా అన్నాడు. తమిళనాడులో 2 వాదాలు ముందుకొస్తున్నాయి. 1. దక్షిణ భారతదేశ అస్థిత్వాల పైన పెద్ద దాడి జరుగుతుందనే విషయాన్ని ఆంధ్రులు కూడా గుర్తిస్తున్నారు. నిజానికి దక్షిణాది భాషల ఉన్నతి ఈ మూడు దశాబ్ధాలలో బాగా తగ్గుతూ వచ్చింది. దక్షిణాది భాషా సంస్కృతులలో చారిత్రక, భౌగోళిక, తాత్త్విక అంశాలకు సంబంధించిన అనేక మూలాలు దెబ్బతినే ప్రమాదం కనబడుతుంది. తెలుగు వారు, కన్నడవారు, మళయాలీలు, తమిళులు తమ దేశీయ భౌగోళిక భాషా అస్థిత్వాల కోసం ఈనాడు పోరాటం చేస్తున్నారు.
దక్షిణాది నంబర్ వన్
ఇకపోతే బీజేపీయేతర రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ర్టం కేరళ. కేరళలో విద్యా ప్రమాణాలు భారతదేశంలోనే మొదటి స్థానంలో వున్నాయి. కేరళ ముఖ్యమంత్రి ‘పినరయ్ విజయన్’ పురుషులతో సమానంగా మహిళలకు సమానవేతనం అందేలా చూస్తామని ప్రకటించారు. ఈ మేరకు పని ప్రదేశాలలో ‘జెండర్ ఆడిట్’ అనేది సంస్థాగత సమానత్వాన్ని పెంచేందుకు సవాళ్ళు, అవకాశాలను గుర్తించి సంస్థలకు మార్గనిర్దేశం చేయడానికి లింగ కార్యాచరణ ప్రణాళిక కోసం ఉపయోగించే ఆచరణాత్మక వనరు నిర్వహిస్తామని స్పష్టం చేసారు. గురువారంనాడిక్కడ రాష్ర్టంలోని మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విజయన్ మాట్లాడుతూ ఉద్యోగాలు మహిళలకు మరింత అనుకూలంగా ఉండాలన్నారు. ఇటీవలి వరకు మహిళలను విద్యపై మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడింది. కాని ఇకనుండి వారు అధికారిక వర్క్‌ఫోర్స్‌లో పాల్గొనేలా చూడాలి. ఉద్యోగాలు మహిళలకు మరింత అనుకూలంగా ఉండాలి. దానికోసం, పని కల్పిస్తాం అని విజయన్ చెప్పారు. రాష్ర్ట విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు రుతుక్రమ సెలవులను ప్రవేశపెట్టడం ద్వారా కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచిందని విజయన్ అన్నారు. ఉన్నత విద్యపై జాతీయ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రం ఉన్నత విద్యా రంగంలో అత్యధికంగా మహిళల భాగస్వామ్యాన్ని కలిగి వుందని తెలిపారు.
పరిణామ శక్తిగా దక్షిణాది స్త్రీ
ఈనాడు భారతదేశంలో స్త్రీ ఒక పరిణామ శక్తిగా మారింది. ఆమె మతాతీతంగా, కులాతీతంగా శాస్త్రీయ వైజ్ఞానిక, సాంకేతిక సాంస్కృతిక, విద్య తాత్విక రంగాలలో ముందడుగు వేస్తోంది. ఈ ముందడుగు ఊతంగా కేరళ రాష్ర్టం వుంది. 2017-18 నుండి రాష్ట్ర బడ్జెట్‌తో పాటు వార్షిక జనరల్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ సంవత్సరం కేరళ బడ్జెట్‌లో స్త్రీలకు ఉపయుక్తం చేసిన బడ్జెట్ 21.05%గా వుంది. ఇది అన్ని రాష్ట్రాలకు మేల్కొలుపు. నిజానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో స్త్రీల విద్య పట్ల సానుకూల ప్రయోగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఇంగ్లీషు విద్యతోపాటు కన్నడ, తమిళ, తెలుగు, మలయాళీ భాషల అధ్యయనంలో సమతుల్యంగా వున్నారు. ఇంగ్లీషు భాషతో పాటు మాతృ భాషను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. నిజానికి స్త్రీలలో త్రై వర్ణాల నుండే కాకుండా దళిత, బహుజన ఆదివాసీలలో కూడా విద్యా చైతన్యం పెరుగుతోంది. సనాతన భావాలను అధిగమించి స్త్రీలు ప్రపంచ మానవులుగా ఎదుగుతున్న క్రమాన్ని అన్ని రాష్ట్రాలు ప్రోత్సహించవలసిన చారిత్రక సందర్భంలో మనం వున్నాం.
దక్షిణాది భాషల పరిరక్షణ
అంబేడ్కర్ ఆశయాల్లో ప్రధానమైనది విద్యావ్యాప్తి, మతాతీత జీవన విధానం, మనిషిని ప్రేమించే, ఆదరించే, జీవన వర్తన, ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో స్త్రీలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయటం, తెలంగాణలో స్త్రీలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయటం, ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థినులకు ఇంగ్లీషు విద్యను కలిగించడం వంటి అనేక స్త్రీ ఉద్దరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల కంటే అనేక విషయాల్లో దక్షిణ భారతదేశం ముందుంది అనేది చారిత్రక సత్యం. దక్షిణాది భాషలను, సంస్కృతిని, సామాజిక సమతను రక్షించుకోవడం కోసం లౌకికవాద భావజాల సాంస్కృతిక విప్లవానికి అంబేడ్కర్ మార్గంలో అందరూ సన్నద్ధం అవ్వాల్సిన చారిత్రక కాలం ఇది. మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం. మన హక్కుల్ని మనం సాధించుకుందాం.
డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695