నేతన్నలను.. ఆదుకోరా?

Handloom workers.. is just for votes?

Update: 2023-07-12 00:00 GMT

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవానికి చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం. అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు.

‘చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు’ నానుడి నేటికీ నిజం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పద్మశాలి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ వారి ఎదుగుదల కోసమే తప్ప చేనేత కార్మికుల చేయూత కోసం కాదన్నది, ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి తెలిసిన విషయమే. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకుగా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప, వారికి ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం. వీరు మౌనంగా ఉండటమే వీరికి శాపంగా మారింది.

ఫలితాలు ఇవ్వని పథకాలు

చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ, నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొన్ని నెలల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ వార్తల్లో వచ్చే ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం అంతకు మించిన పొరపాటు లేదు. అసలు ఈ పథకం అమలులో ఉందో లేదో.. కూడా చేనేత కార్మికులకు తెలియదు. ఏపీలో ముద్ర రుణాల పేర చేనేత కార్మికుల అభ్యున్నతికి ముద్ర రుణాలు అందజేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ ఊసే లేదు. పైగా ఏపీలో చేనేత కార్మికులకు ఉచితంగా మగ్గాలు ఇస్తున్నారు మరి మన రాష్ట్రంలో ఉచిత మగ్గాలు ఏవి? వాటి స్థానంలో ఇంకేమైన ఇచ్చారా అంటే అదీ లేదు. అలాగే ఏ కారణం చేతనైనా 18-59 వయస్సు గల నేత కార్మికులు మరణిస్తే 10 రోజుల్లోగా నామినీకి 5 లక్షల బీమా అందేలా ‘నేతన్న బీమా పథకం పథకం’ రూపొందించబడింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకటించి ఆగస్టు 8 నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి అనేక మంది చేనేత కార్మికులు మరణించిన, మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు అందించినట్లు సమాచారం లేదు. అలాగే ఇటీవల బీసీ కులాల అన్నింటికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించి చివరికి కేవలం 15 కులాలకు మాత్రమే వర్తిస్తుంది అని ప్రకటన చేయడం విచారకరం. ఈ ఆర్థిక సహాయం కోసం నేత కార్మికులు ఎంతో ఆశించారు. తమ పనులను వదిలిపెట్టి పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి నేత కార్మికుడికి పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం కొద్ది మందికే ఇవ్వడం విచారకరం. వారికి జీఐ ట్యాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు. ఆ ట్యాగ్ కోసం ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించడం లేదు.

ఐక్యంగా పోరాడాలి..

నేతన్నలకు ప్రభుత్వ పథకాలే కాక, వారు నేచిన బట్టలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అసలే ముడిసరుకు కొనుగోలు కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

అత్యధిక ఓటర్లైన పద్మశాలీలకు నాయకులు ఎన్నికల సమయంలో ఏదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతీ ఎలక్షన్స్ సమయంలో జరిగేదే. నాయకులు ప్రతిసారి వారి ఓట్ల ద్వారా గెలుపొంది ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. అందుకే చేనేత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది. ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని వారికి అండగా నిలవాలి.

కోట దామోదర్

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం

9391480475

Tags:    

Similar News