మరి కొద్ది రోజుల్లో తెలంగాణతో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలోనూ 10వ తరగతి, ఇతర పబ్లిక్ పరీక్షలు విద్యార్థులు రాయబోతున్నారు. ఈ పరీక్షల ఒత్తిడి, మానసిక ఆందోళన, తీవ్ర భావోద్వేగాలు, భావి పౌరులెందరినో పొట్టన పెట్టుకుంటున్నాయి. సంతోషంగా భావించాల్సిన విద్యార్థుల పరీక్షలు యమగండాలుగా మారుతున్నాయి.
పిల్లలు ఆత్మహత్యలకు గురయ్యే ప్రమాదాలను, కారణాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా అమలవుతున్న బట్టీ పట్టే బండ చదువులు, విద్యార్థుల లోపల పరీక్షల భయాన్ని నింపుతున్నాయి. 2024 ఫిబ్రవరి 26న చదువులో వెనుకబడిపోతున్నాననే మనస్తాపంతో పద్మా నగర్ ఫేస్-2 ప్రాంతానికి చెందిన విద్యార్థి (16) ఉరేసుకుని, 2024 ఫిబ్రవరి 10న ఇమాంపేట సాంఘీక సంక్షేమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వివిధ దేశాలలో ఏడాదికి లక్ష మందికి 10 నుంచి 40 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిని నివారించడానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు.
తోటలోని పూల మొక్కలు విద్యార్థులు
పిల్లలు తోటలోని పూల మొక్కల వంటి వారు. వారిని జాగ్రత్తగా సంరక్షించి, వారి అభిమతం మేరకు సరైన చదువుల వైపు ప్రోత్సహించాలి. జీవ నైపుణ్యాలను ఒక వైపు అలరిస్తూనే మరొకవైపు వ్యక్తిత్వ వికాసాన్ని గణనీయంగా పెంచాలి అని నెహ్రూ సూచించారు. కానీ విద్యార్థుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, వారి ఆకాంక్షలను, సమర్థతను పరిగణలోనికి తీసుకోకుండా తల్లిదండ్రుల కోరికలను పిల్లలపైన బలవంతంగా రుద్దుతున్నారు. ఈ దుష్ట సాంప్రదాయాన్ని తల్లిదండ్రులు నివారించుకోవాలి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి, పరీక్షలకు కష్టపడి చదవాలి కానీ పరీక్షలే జీవితం కాదు అని ప్రేమగా ధైర్యం చెప్పాలి. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే ధైర్యాన్ని వారికి కలిగించాలి.
ఆత్మహత్యలకు కారణం.. ఆంక్షలే!
అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం మార్కులు, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ఆరాటపడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలు వారి వైఖరి మార్చుకోవాలి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను వేరే గ్రూపులుగా చేయడం, వారిని అవహేళన చేయడం, మార్కుల కొరకు పిల్లలను ఎక్కువ మానసిక ఒత్తిడి కలుగజేసే విధానాలు మార్చుకోవాలి. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాలను ఉపాధ్యాయులు అభివృద్ధి పరచాలి.
విద్యా సంస్థలు విద్యార్థులకు మానసిక విశ్లేషకులతో కౌన్సిలింగ్ ఇప్పించి, ఉపాధ్యాయులు ప్రతి రోజు ప్రతి విద్యార్థి తన అంతర్గత భావాలను ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో, తల్లిదండ్రులతో పంచుకున్నట్లుగా స్నేహ భావాన్ని తయారు చేసే వాతావరణం కల్పించాలి. ఎమిలిడుర్ఖమ్ అనే మానసిక శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఆంక్షలు. విద్యార్థి ఏమి చదవాలి ఎన్ని మార్కులు రావాలి ఎలా నడవాలి అనే కఠినమైన ఆంక్షలు పెట్టకూడదు.
చదువు.. ప్రాథమిక లక్ష్యం
అలాగే విద్యార్థి సైతం ఎప్పటి పాఠం అప్పుడు చదువుకొని, పరీక్షలంటే భయపడకుండా, అదనపు సమాచారాన్ని జోడించి అందమైన దస్తూరితో రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. విద్యార్థులు సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకొని, ఆరోగ్యంగా, సరియైన నిద్ర పోవడం వంటివి చేసి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి.
1948-49 నాటి యూనివర్సిటీ విద్యా సంఘం నివేదిక ద్వారా 6 నెలల కొకసారి జరిగే సెమిస్టర్ పరీక్షల విధానంతో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించవచ్చని, ఆ నివేదికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సంవత్సరానికి రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ఒత్తిడి నివారించవచ్చు. చదువుల ప్రాథమిక లక్ష్యం విద్యార్థుల మనోవికాసం, సృజనాత్మకంగా పరిష్కార సాధనకు, విషయం అర్థం చేసుకునేటట్లు ప్రయత్నించేలా విద్యార్థిని తీర్చిదిద్దడమే విద్యా లక్ష్యం.
బట్టీ పట్టే చదువులే సమస్య
పిల్లలు ఆత్మహత్యలకు గురయ్యే ప్రమాదాలను, కారణాలను గనుక పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా అమలవుతున్న బట్టీ పట్టే బండ చదువులు, విద్యార్థుల లోపల పరీక్షల భయాన్ని నింపుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో పాఠాలను బోధించాలి. మానవుని మెదడులో 100 బిలియన్ న్యూరాన్ కణాలు ఉంటాయి. ప్రతి కణం ఒక సూపర్ కంప్యూటర్ కంటే శక్తివంతమైనది. విద్యార్థి చదివిన విషయాన్ని అర్థం చేసుకొని, అప్పుడప్పుడు పునశ్చరణ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. భయపడవలసిన అవసరం లేదని విద్యార్థులు గ్రహించాలి.
సి.వి.వి. ప్రసాద్
విశ్రాంత ప్రధానాచార్యులు
80196 08475