ఎమ్మెల్సీ ఎంపికలో కార్యకర్తలకు న్యాయం జరిగినట్లేనా?
పదేళ్లు మొదలు 30 ఏండ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ తగిన అవకాశాలు దక్కని వారికే ఇక నుంచి పోస్టులు ఇవ్వాలన్న
"..పదేళ్లు మొదలు 30 ఏండ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ తగిన అవకాశాలు దక్కని వారికే ఇక నుంచి పోస్టులు ఇవ్వాలన్న నిర్ణయమే తడవుగా అమల్లో అనుభవంలోకి తెచ్చిన ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు" అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీల నియామకం దరిమిలా క్షేత్ర స్థాయిలో సీనియర్ కార్యకర్తగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓరుగంటి తిరుపతి సామాజిక మాధ్యమాల్లో పార్టీ అధిష్టానం పట్ల తన గౌరవ విశ్వాసాలను చాటుకున్నారు.
అందరికీ ఆమోదం మొదటిసారేమో..?
ఇదొక ఓరుగంటి తిరుపతి భావనే కాదు, హస్తంలో నిఖార్సయిన అనేక మంది శ్రేణుల అభీష్టం! ఫీల్డులో కష్టపడే తమ మనోభావాల ప్రకారమే హస్తిన నిర్ణయాలు ఉంటాయనే నమ్మకాన్ని ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యత్వాలకు జరిగిన ఎంపికలో నిలుపుకోవడంపై మెజారిటీ శ్రేణుల్లో ఆమోదం వస్తుండడం బహుశా ఇదే మొదటిసారేమో! అధికార కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, సీపీఐ కూడా ఏ కోణంలో చూసినా ఉన్నంతలో తక్షణ యోగ్యత కలిగిన వారినే మండలి పెద్దలుగా అందలం ఎక్కించాయనే కితాబూ తొలిసారి వినబడుతుంది.
ఓసీల ఊసెత్తకుండా..
బీసీ వాదం, నినాదం ప్రతిధ్వనిస్తున్న క్రమంలో, ఎస్సీ ఎస్టీల జాగృతం తరుణంలో ఆ పార్టీల త్రయం వేర్వేరు సెలెక్షన్ పరంగా ఓసీల ఊసే ఎత్తకుండా జాగ్రత్త పడడం మరో విశేషం. రాష్ట్రంలోనూ మూడు పార్టీలూ ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఈ పదవుల పరంగా జై కొట్టడం కాకతాళీయమే అయినా గమనంలో ఉండాల్సినదే! కాంగ్రెస్ కు చెందిన అద్దంకి దయాకర్(ఎస్సీ-మాల), కేతావత్ శంకర్ నాయక్ (ఎస్టీ-గిరిజన), సీపీఐ నెల్లికంటి సత్యం (బీసీ-యాదవ), బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్ కుమార్ (బీసీ-విశ్వకర్మ)లు నల్గొండ ముద్దు బిడ్డలే. ఇక విజయశాంతి(కాంగ్రెస్-బీసీ) అవిభాజ్య వరంగల్ (ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం) వాస్తవ్యురాలిగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపిం చిన తొలినాళ్లలో పేర్కొన్నారు. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ ఇదే ఒరవడి ప్రతిఫలించింది.
సామాజిక కోణాన్ని స్పృశిస్తూ..
ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఎందరో నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. సామాజిక కోణాన్ని స్పృశిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుర్తింపు, ఆదరణ విధానాన్ని ఈ ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియలో పాటించిన ఏఐసీసీ క్షేత్రంలో పార్టీ యంత్రాంగం మెప్పు సొంతం చేసుకుంటోంది. సీపీఐ, బీఆర్ఎస్ కూడా పార్టీలోనూ, సమాజంలోనూ మన్న నలు అందుకోవడం ఒకింత శుభపరిణామం. దాసోజు శ్రవణ్ కుమార్, అద్దంకి దయాకర్‌లకు తెలంగాణ సమాజంలో నెలకొన్న సానుభూతి, నైతిక మద్దతుకు అనుగుణంగానే వ్యవహరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ప్రజల అంతరంగాన్ని ప్రతిబింబించాయి.
ఎమ్మెల్సీలుగానే ఉంటారా..?
ముఖ్యమంత్రిగా కొలువుదీరిన కొత్తలోనే కంప్లీట్ మంత్రి మండలి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారు. అయితే పార్టీలో అంతర్గత రాజకీయాలు, హైకమాండ్ మీనమేషాలు వంటి స్థితిగతుల వల్ల సుమారు 15 మాసాలుగా "రేపు లడ్డూల భోజనం" చందమైంది. ఇదిలా ఉంటే, కొత్త ఎమ్మెల్సీల త్రయం ఎమ్మెల్సీలుగానే ఉంటారా?మంత్రిమండలిలో చోటు ఉంటుందా? అన్నది ఇంట్రెస్టింగా మారబోతున్నది. విజయశాంతి మినిస్టర్ అవుతారని, ఆమె హోంశాఖ చూస్తారనే ఊహాగానాలు ఈ క్రమంలో ఉత్పన్నం అవుతున్నవే. మంత్రి మండలి విస్తరణ/పునర్వ్యవస్థీకరణ ఓ కొలిక్కి వచ్చేదాకా ఇలాంటివి మిగిలే ఉంటాయి!
ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384