ఓడించింది ప్రజలు.. ఈవీఎంలు కాదు!

ఓటింగ్ మిషన్లను మ్యానిపులేట్ చేసి, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇందుకు ఎలన్ మస్క్ ఓటింగ్ మిషన్లపై వెలిబుచ్చిన అభిప్రాయాలు

Update: 2024-06-28 01:00 GMT

ఓటింగ్ మిషన్లను మ్యానిపులేట్ చేసి, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇందుకు ఎలన్ మస్క్ ఓటింగ్ మిషన్లపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రామాణికమని కాంగ్రెస్ నాయకులు నిర్లజ్జగా ప్రకటనలు గుప్పించడం శోచనీయం. అసలు ఎలన్ మస్క్ ఎవరు? ఈవీఎంల పరిజ్ఞానంపై అతని నైపుణ్యత ఏమిటి? భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేసిన పరికరాలపై అతని వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలా? ‘ఎద్దు ఈనిందంటే గాటిన కట్టేయమన్న’ చందంగా ఉంది అతని వ్యాఖ్యలపై మన నాయకుల సమర్ధనని చూస్తే..

ఈవీఎంలపై ఇంత పెద్దు ఎత్తున రచ్చ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, 2004 ,2009, పార్లమెంట్ ఎన్నికల్లో, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే అధికారంలోకి వచ్చిందా? అని సామాన్య వ్యక్తి ప్రశ్నిస్తే నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? మొన్న ఎన్నికల్లో 232 లోక్‌సభ సీట్లను ఈ మిషన్ల ద్వారానే ఇండియా కూటమి గెలుచుకున్నది కదా 'మేము తప్పుడు పనులు చేసి ఎన్నికల్లో గెలిచాం' అని ముందు ఈ నాయకులు ప్రకటిస్తారా? అలా ప్రకటించిన తర్వాత ఈవీఎంల సాంకేతికతపై కమిటీ వేయమని డిమాండ్ చేయాలి.

ఈవీఎంల పనితీరు రుజువయ్యింది కదా?

వాస్తవంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల చరిత్రను పరిశీలిస్తే-1989లో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 కి సవరణ చేసి, బ్యాలెట్ పేపర్ స్థానంలో ఓటింగ్ మిషన్లను ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ ఆమోదం పొందింది. 1982లో మొదటిసారిగా కేరళ రాష్ట్రంలోని' పారా ఉయ్యూరు' అసెంబ్లీ స్థానంలో కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈ యంత్రాలను ప్రవేశపెట్టి, ఆశించిన ఫలితాలను నిపుణులు రాబట్టుకున్నారు. మే 2001న తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారానే ఎన్నికలు జరిగాయి. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. 2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి ఈవీఎంల పనితీరుతోనే అధికారంలో కొనసాగింది. వీటి తయారీలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బిఇఎల్) నిపుణుల కృషి అనిర్వచనీయం. ఇవి ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్‌లకు సంబంధం లేకుండా బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. సుప్రీంకోర్టు ఆదేశంతో ఎలక్షన్ కమిషన్ వివిధ పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో ట్రైల్ రన్ కూడా చేపట్టింది. ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా మనదేశంలోని ఓటింగ్ మిషన్ల పనితీరును మార్చలేదని రుజువుచేసింది.

బీజేపీ గెలిస్తే.. ఈవీఎంలు తప్పా?

అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలుస్తూ, దేశాన్ని పందికొక్కుల్లా దోచుకుని, తిన్నది ఎవరో ఈ దేశ ప్రజలకు బాగా తెలుసు. పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన రోజుల్లో ఎన్ని కుంభకోణాలు చోటుచేసుకున్నాయో.. దేశ ప్రజలకు తెలియదా? ఆర్థిక వ్యవస్థ కకావికలం చేసి చివరికి బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితిని ఈ దేశం ఎదుర్కొన్నది. 'బీజేపీ ఓడితే ప్రజాస్వామ్యం గెలిచినట్లు, బీజేపీ గెలిస్తే ఓటింగ్ మిషన్లలో తప్పులున్నట్లు' ఇది బీజేపీ వ్యతిరేక పార్టీ నాయకుల ఉవాచ! మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి ఎంతో ఓపికతో, ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు. పార్టీల ఏజెంట్ల ముందు ఇదే ఓటింగ్ మిషన్లతో ఎన్నికలు నిర్వహిస్తారు.' మాక్ పోల్' తర్వాత ఓటింగ్ మిషన్‌లోని ఓట్లను తొలగిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫాం- 17C ఫైల్ చేసి, పోలింగ్ స్టేషన్‌లో వాడిన ఓటింగ్ మిషన్ల నెంబర్లను, పోలైన ఓట్ల వివరాలను పొందుపరిచి, ఒక కాపీని ఏజెంట్లకు కూడా ఎన్నికల అధికారి అందిస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ రాజీపడరు.

ఇలాంటి విషయాల గురించి ఆలోచన చేయకుండా ఈవీఎంల పనితీరుపై మొరగడం ఎందుకు? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవీఎంల పనితీరుపై అవాకులు చవాకులు పేలి, ప్రజల ముందు తలదించుకున్న రీతిలోనే నేడు వైసీపీ నాయకులు ఈవీఎంల పనితీరుపై అక్కసు వెళ్లగక్కి, ప్రజా తీర్పును అవమానిస్తున్నారు. అలా ప్రజాతీర్పును అవమానించిన నాయకులకు కాలమే సమాధానం చెబుతుంది.

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News