పిల్లల పెంపకం ఒక కళ!
పిల్లలను పెంచేప్పుడు అతిగా గదమడం, గారాబం రెండూ సరికాదు. వీటిని బ్యాలెన్స్ చేయాలి. తల్లిదండ్రులు వారి ఆలోచనా విధానంలోని
పిల్లలను పెంచేప్పుడు అతిగా గదమడం, గారాబం రెండూ సరికాదు. వీటిని బ్యాలెన్స్ చేయాలి. తల్లిదండ్రులు వారి ఆలోచనా విధానంలోని లోపాల వల్ల పిల్లలకు ప్రయోజనం కంటే నష్టమే చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నామనీ, మన పిల్లలు అలా ఉండకూడదని, పిల్లలకు మన కష్టం తెలియకూడదని వారిని గారాబం చేస్తాం. మనలా మన పిల్లలు కష్టాలు పడకూడదని అనుకొని వారి చదువు విషయంలో, వారి అభివృద్ధి విషయంలో ప్రణాళిక వేయడం మంచి పనే. అందులో తప్పు లేదు. కానీ మన పేదరికం, మన ఆదాయ వ్యయాలు పిల్లలకు తెలియకుండా దాస్తాం. లేదా, మనం ఒకలా ఉండి, పిల్లలకు మరోలా ఉన్నట్టు చూపిస్తాం. ఇది పిల్లలకు నష్టం చేస్తుంది.
ఉదాహరణకు తమకు ఆ నెల అయిదు వందల రూపాయలు మాత్రమే పిల్లల కోసం ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటుంద నుకుందాం. కానీ, పిల్లలు అయిదు వేల రూపాయల వస్తువు డిమాండ్ చేసేటప్పుడు అది ఎలాగైనా సరే అప్పు చేసైనా ఇచ్చేయడానికి సిద్ధపడతాం. ఒకవేళ తండ్రి వద్దని వారించినా, తల్లి గొడవపడి మరీ కొడుక్కి ఇప్పించేందుకు వెనుకాడదు. ఇది తిరగేసి కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని ఇళ్లలో. మన పిల్లలు సుఖంగా ఉండాలి. కాబట్టి, వారు కోరినది ఇవ్వాలని అనుకుంటాం. కానీ అది సరైంది కాదు. పిల్లలు మారాం చేసి తమ కోరికలు నెరవేర్చుకుంటారు. పిల్లలకు కొత్త కొత్త సరదాలు ఉంటాయి. కొత్త ఆనందాలు వెతుక్కోవాలనుకుంటారు. విలాసాలు చేయాలనుకుంటారు.
కష్టాల్లో ముంచేసే ప్రేమలు..
18 సంవత్సరాలు రాగానే బైకులు కొనాలనుకుంటారు. నాన్న దగ్గరకు వస్తారు. నాకు బైక్ కావాలి అంటారు. ఫలానా దగ్గరికి వెళ్లాలి. కాలేజీకి వెళ్లాలి. బైక్ లేకపోతే చాలా కష్టం అంటారు. తల్లిదండ్రులు ఆలోచించరు. దుకాణానికి వెళ్లి బైకు కొనాలనుకుంటారు. అప్పులు ఇచ్చి అప్పుల్లో ముంచేసే సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అవి అప్పులు ఇచ్చి బైక్ కూడా ఇస్తాయి. ఈ అబ్బాయికి ఈ బైకు ఎంతవరకు అవసరం కాలేజీకి వెళ్లడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లడంలో ఇబ్బంది ఏముంటుంది? ఆటో ఎక్కితే ఎంత ఖర్చు అవుతుంది? బైక్ కొంటే ఎంత ఖర్చు అవుతుంది? దాని ఈఎమ్‌ఐ ఎంత దానిపై వడ్డీ ఎంత ఎందులో ప్రయోజనం ఉంది? ఎంత మిగిలింది? తన జీతం ఎంత? తన జాబ్ ఉంటుందా? ఉండే పరిస్థితి ఉందా? ఊడిపోతే ఈ ఎమ్ ఐ ఎలా ? ఇంకా వేరే అర్జెంట్ ఖర్చులు ఉన్నాయా? ఈ తల్లిదండ్రుల్లో ఇద్దరు ఇవేవీ కూడా పిల్లల ప్రేమ మాయలో పడి ఆలోచించరు. బైక్ కొన్న తర్వాత ఈ అప్పులు కట్టలేక కష్టాల్లో పడతారు. అంతలోగా, మిల్లులో పనులు పోతే, లాకౌట్ అయి ఇంట్లో గొడవలు. అశాంతి. ఇక టెన్షన్ మరింత పెరుగుతుంది. బాగా డబ్బున్న వారికి ఈ జాగ్రత్తలు అవసరం లేదు. అంతంత మాత్రమే ఉన్నవారికి జాగ్రత్తలు తప్పవు. ఇలా పిల్లలను కష్టాల్లో ముంచేసే మాతృ పితృ ప్రేమలు అర్థం లేనివి.
పిల్లలను భ్రమల్లో ముంచెత్తవద్దు
పిల్లల పెంపకం అన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు ఏమిటో కూడా పిల్లలు తెలుసుకోగలిగేలా ప్రయత్నం చేయాలి. మనం బాగా ఉన్నట్లు భ్రమ కలిగించడం సరైనది కాదు. నువ్వు బాగా ఎంజాయ్ చెయ్ నాన్నా అనడం సరైంది కాదు. మాలాగా నువ్వు కష్టపడకు అని పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు అందించకూడదు. వారికి డబ్బు విలువ తెలియజేయాలి. విపరీతంగా ఖర్చు పెట్టకుండా మన ఆర్థిక పరిస్థితిని అర్థం చేయాలి. మారాం చేసి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఖర్చు పెట్టే మార్గాలు వారికి అలవాటు అవుతాయి. డబ్బు సంపాదించే మార్గాల కోసం ఆలోచించరు. కాబట్టి, మనం ఎలా ఉన్నామో అలానే మన పిల్లలకు తప్పనిసరిగా తెలియజేస్తూ ఉండాలి. డబ్బు అవసరాన్ని తెలియజేయాలి. డబ్బు సంపాదించే ప్రయత్నం చేయమనాలి. కానీ డబ్బు యావలో పడి మిగతా జీవితాన్ని గాలికొదిలేసే పరిస్థితి లేకుండా చూసుకోమని చెప్పాలి. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి నువ్వు కష్టపడి బాగా చదువుకొని విజ్ఞానం సంపాదించి మంచి ఉద్యోగంలోకి వెళ్లడానికి ప్రయత్నించు అని చెప్పాలి.
ఇంటి పనుల్లో సమానత్వం నేర్పాలి!
పిల్లలకు ఇంట్లో పనులు కూడా చెబుతూ ఉండాలి. టీ తాగితే టీ కప్పు కడిగే అలవాటు నేర్పాలి. భోజనం చేస్తే భోజనం ప్లేట్ కడిగే అలవాటు లేదా కిచెన్ సింక్‌లో పెట్టే అలవాటు నేర్పాలి. ఇది అమ్మాయిలు మాత్రమే చేసే పని అని, దీనికి అబ్బాయిలు మినహాయింపు కారని ఆ చిన్నప్పటినుండే వారికి తెలియ జేయాలి. పనుల్లో ఈ రకమైన తేడాలు మనసులో రాకుండా చిన్నప్పటినుండే వారి మెదడును ట్యూన్ చేయాలి. అప్పుడే మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా వారు తయారవుతారు. పిల్లలకు డబ్బు విలువని ఎల్లప్పుడూ తెలియజేయాలి. డబ్బులు వృధా చేయకుండా చూడాలి. డబ్బులు ఎంత శ్రమపడితే వస్తున్నాయో తెలిసేలా చేయాలి. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడికి తీసుకెళ్లగలిగే అవకాశం ఉంటే, అనుమతి ఉంటే కనీసం ఒక్కసారైనా తీసుకెళ్లి అక్కడ పరిశీలించే అవకాశం ఇవ్వాలి. మనం, మనలాంటి శ్రామికులు ఎంత శ్రమపడితే డబ్బులు వస్తున్నాయో వారు స్వయంగా చూస్తారు. వారి ఆలోచనా విధానం కూడా మారుతుంది. బాధ్యతగా మారతారు.
మన శ్రమను అర్థం చేయించాలి!
మనం కార్మికులమైనా, వైట్ కలర్ ఉద్యోగులమైనా ఏ స్థాయి వ్యక్తులైనా మన శ్రమ ఎలా ఉంది వారు కూడా కనీసం పరిశీలించేలా ప్రయత్నించాలి. మరీ చిన్నపిల్లలకు కాకపోయినా కనీసం 10, 11 తరగతులు చదివే పిల్లలకైనా అలాంటి అవకాశం ఒక్కసారైనా ఇవ్వాలి. మనం ఎంతగా కష్టపడితే జీవితపు రాళ్లు వస్తున్నాయో వారు కూడా అర్థం చేసుకుంటారు. వాస్తవాలను దాయకూడదు. పిల్లలకు రియాలిటీ చూపించాలి. మనం ఎలా ఉన్నాం అలానే వారికి తెలియాలి. మనం ఒకలా ఉండి, మరోలా పిల్లలకు సంకేతం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చాలా బాగా ఉన్నాం అన్న సంకేతం వారికి ఇవ్వకూడదు. అక్కడే పిల్లలు దెబ్బ తింటారు. ఎన్నో సంఘటనల్లో మనం చూస్తుంటాం. పిల్లలు దారి తప్పుతుంటారని.. కారణం పిల్లలు మాత్రమే కాదు చాలా ఎక్కువ భాగం తల్లిదండ్రులదే అయి ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు ఎలా పెంచాలో కూడా తెలియదు. ఆ కారణంగా పిల్లలు ఏం నేర్చుకోకూడదో అది నేర్చుకుంటారు. ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోరు.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే పుస్తకంలో రచయిత చాలా ఉదాహరణలతో ఇలాంటి ఎన్నో అంశాలపై అర్థం చేశారు.
కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213