ఫర్వాలేదు బ్రో.. కానీ..!

Bro movie is ok but this movie depends more on Pawan Kalyan's fame than the story

Update: 2023-08-05 00:15 GMT

‘సత్యం సత్యం కాదు… అదో ఆత్మభ్రమ’ అనేది శంకర భాష్యం. ‘ముసాఫిర్’ జీవితాలకు వర్తమానం సత్యమనుకోవటం, ‘తాను’ లేకుంటే వ్యవస్థలు ఆగిపోతాయి అనుకోవటం మనిషి కనే ‘కల’లకు పరాకాష్ట. నాటి ‘గీత’ నుంచి నేటి ప్రవచన కర్తల(?) మాటల వరకు జీవితం అశాశ్వతం అనే చెబుతారు. కానీ.. తాను లేకుంటే’ అనే అహంకారానికి లోనవుతారు. ‘తన’కంటే ‘తన’ వారిని ఎవరూ బాగా చూసుకోగలరు ‘అనే’ ‘భ్రమ’లో సత్యాన్ని మరచిన మనిషి చివరి మజిలీలో విషాదానికి లోనై మరొక్క అవకాశం కోసం ఎదురు చూస్తాడు. కానీ.. నిజంగా ‘ఒక అవకాశం’ లభిస్తే అతను అంతర్ముఖుడవుతాడు. కనుకనే శంకరాచార్యుల వారు ‘సత్యం నిజంగా సత్యం కాద’ని చెప్పటం! ఈ చేదు నిజానికి సెల్యూలాయిడ్ దృశ్యరూపం ‘వినోదియ సిత్తం’ ఓ తమిళ చిత్రం. ఓ యాభై ఏళ్లు దాటిన తండ్రి ‘తన’ కుటుంబం ‘తను’ లేకుంటే ఏమైపోతుందనే తపన పడతాడు. కానీ.. అతని మరణానంతరం మరొక్క అవకాశంతో ‘వస్తే’ అతను తెలుసుకున్న ‘జీవిత’ సత్యాలు ఏమిటో ‘సముద్రఖని’ ఈ చిత్రంలో చెబుతాడు. తమిళంలో ఓ మేధాపరమైన వర్గీయుల చిత్రంగా, ప్రవచనాల సినిమాగా ముద్ర పడింది. దీనికి తెలుగు రీమేక్ ‘బ్రో’... ఇంత డ్రై సబ్జెక్టును పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌తోనా అని వ్యాపారాత్మక విలువల చిత్ర ప్రపంచం ఆశ్చర్యపోయింది.

రీమేకుల్లో.. విజయాలు తక్కువే!

‘రీమేక్’ సినిమాలు తెలుగు చిత్ర సీమకు కొత్త కాదు. నాటి ‘దేవాంతకుడు’(ఎన్టీఆర్ ) కూడా ఈ కోవకు చెందినదనే వారున్నారు. ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించిన ‘రక్తసంబంధం’ దగ్గర నుంచి ‘శుభాకాంక్షలు’ మీదుగా ‘బ్రో’ వరకు రీమేకుల ప్రయాణాన్ని చెప్పుకుంటే విజయాలు కన్నా ‘నిరాశపరిచినవే’ ఎక్కువగా కనిపిస్తాయి. కారణం… కథలోని ‘ఆత్మ’ ‘నేటివిటీ’ వంటి అంశాలు.. ముఖ్యంగా ఒక్కొక్క ప్రాంత ప్రేక్షకులు ఒక్కొక్క రకానికి చెందిన చిత్రాలు చూస్తారు. విజయం అందిస్తారు. అంత మాత్రం చేత అది అందరూ అంగీకరిస్తారని చెప్పలేం. ‘లోకో భిన్న రుచి’ అనేది ఓ సామెత. ముఖ్యంగా కథకు వ్యాపారాత్మక హంగులు, హీరోయిజపు మసాలాలు వంటివి జోడిస్తే ఆ చిత్ర విజయాన్ని కాలం నిర్ణయిస్తుంది. ఇందుకోసం కొన్ని ‘సినిమా సమీకరణాలు’, ‘రాజకీయ పార్టీలు వ్యక్తులపై విమర్శలు’ వంటి కారకాలను కేవలం అభిమానుల కోసమే అనే షుగర్ కోట్ తగిలిస్తే అటువంటి చిత్రాలకు ప్రేక్షకాదరణను అంచనా వేయడం కష్టం.

‘బ్రో’ సినిమా కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ‘మార్క్’ అనే మార్కండేయులు కథ. తను లేకపోతే కుటుంబం, కార్యాలయం పనిచేయవని అతను విశ్వసిస్తాడు. ఇంతలో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. కాలదేవుడు( టైం) పరిచయంతో అతడికో ‘అవకాశం’ దొరుకుతుంది. అతను తిరిగి తన జీవితం ప్రారంభించిన తర్వాత ఉల్లిపాయ పొరలు వంటి మానవ సంబంధాలలోని సాంద్రత అర్థమవుతుంది. దేవుడు (పవన్ కళ్యాణ్) అతనికి తోడుగా ఉండి, నాటకీయ శైలిలో ‘మార్క్’ సమస్యలను పరిష్కరిస్తాడు. పవన్ కోసం, పవన్ కొరకు, పవన్ చిత్రంగా దర్శకుడు తనదైన మార్కుతో చిత్రాన్ని ముగించటం మాత్రం బాగుందనిపిస్తుంది. దేవుడంటే సీరియస్ అనుకోకూడదు. పక్కా కమర్షియల్. ముఖ్యంగా తెలుగు సినిమా హీరోయిజపు గొప్పతనాలను రిచ్‌గా ప్రదర్శించి తన భక్తుడిని సమస్యల నుంచి గట్టెక్కించే పాత్ర. సాయిధరమ్ తేజ్ తన పాత్ర వరకు ‘కష్టపడ్డాడు’. పవన్ ‘గోపాల గోపాల’ తర్వాత ఆ తరహా పాత్రలో తనదైన ప్రత్యేకమైన ముద్రతో అవలీలగా చేసేశారు.

త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు..

ఈ చిత్రం ప్రారంభ ముగింపులు ‘పవన్’ పాత్ర ముందు, తర్వాత అనే వర్గీకరణ కిందకు వస్తాయి. సెకండాఫ్ చిత్రం గ్రాఫ్ క్రమేపీ క్రిందకు వచ్చేస్తున్న సమయంలో ముగింపు తిరిగి మీదకు తేవటంలో దర్శకుడి ముద్ర కనిపిస్తుంది. ఈ చిత్రం ప్రధానాకర్షణ స్క్రీన్ ప్లే, సంభాషణలు ఆ బాధ్యత నిర్వహించినది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సంభాషణలో సహజంగా ‘తడి’ ఉంటుంది. అది మనిషి జీవితం యొక్క సహజమైన ఆర్ద్రతకి చెందిన ‘తడి’. ఆయన సినిమాలను గమనించిన వారికి ఇది తెలుస్తుంది. తన సహజత్వానికి దూరంగా తన కలాన్ని ఉంచటం ఆయన సూత్రం కాదు. కానీ ఈ చిత్రంలో ఆయన కలం నుంచి ఆశించిన స్థాయిలో సంభాషణలు రాలేదు. కొన్ని సంభాషణల పైన నెటిజన్లు విపరీతమైన ‘ట్రోల్’ చేయటం గమనించదగ్గ అంశం. 'హాల్లో షర్ట్ విప్పొచ్చు. బెడ్రూంలో ప్యాంటు విప్పొచ్చు. బాత్రూంలో అండర్వేర్ కూడా విప్పొచ్చు. కానీ వీడిని ఎక్కడ విప్పాలో తెలియదు'. ఇటువంటి సంభాషణలు త్రివిక్రమ్ కలం నుంచి ఎలా వస్తాయో, ఎందుకు వచ్చాయో అర్థం కాదు.

అలా అని సినిమా నిండా ఇటువంటివే ఉన్నాయని కావు. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు కూడా ఉన్నాయి. ‘ఆన్సర్లేని చోట ప్రశాంతత ఉండదు’. ‘అందరూ నా ముందు యాక్ట్ చేశారని తెలిసింది. కానీ డైరెక్ట్ చేసింది మా అమ్మ అని ఇప్పుడే తెలిసింది’. ‘నిజం చెప్పడం వల్ల వచ్చే సుఖమే వేరు. నిజం చెప్పు’. ‘పుట్టడం మలుపు.. చావడం గెలుపు.. ఇది తెలిస్తే చావు కూడా సంతోషంగా ఉంటుంది..’ ‘రాజుకైనా, కూలీకైనా నేను ఇచ్చేది ఒకటే సమయం’.. ఇలా మరికొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటన, శరీర భాష బాగా తెలిసిన వ్యక్తి త్రివిక్రమ్, కనుకనే వినోదయ సిత్తం కధకు స్క్రీన్ ప్లే బాధ్యతను ఆయనకు అప్పగించారు అనిపిస్తుంది. మొత్తంగా ‘బ్రో’ సినిమా పరవాలేదు అనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కనులవిందు మాత్రమేనని మెదడులో ఓ భావనను కలిగిస్తుంది. మనిషి జీవితం ప్రయాణం జనన మరణాలు, మరణం తర్వాత ఆగని కాల ప్రయాణం, మారిన వ్యక్తిత్వాలు వంటి సత్యాలను ‘లైటర్ వే’లో చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. ‘బ్రో’ దర్శకుడుగా సముద్రఖని పవన్‌ను ఎలా చూపిస్తే అభిమానులు ఆనందిస్తారో అలానే చూపించారు. చివరగా, ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఒక జర్నలిస్టు ప్రశ్నకు సమాధానమిస్తూ ‘పవన్ కళ్యాణ్ సినిమాలకు కథ అనవసరం. ఆయన సినిమాలలోని సన్నివేశాలను కలిపితే సరిపోతుంది అన్నారు’. దానికి తగ్గట్టుగానే ‘బ్రో’ లో కూడా పవన్ కళ్యాణ్ పాత సినిమాలలో పాటలకు మళ్ళీ ఆయన నటనతో తెరపై చూస్తుంటే ఆయన అభిమానుల ఆనందం థియేటర్ల వద్ద కనిపిస్తుంది.

-భమిడిపాటి గౌరీ శంకర్

94928 58395

Tags:    

Similar News