బీజేపీకి 370 ప్లస్ సాధ్యమేనా..!?

BJP will secure 370 seats, NDA to get 400 plus in 2024 general election

Update: 2024-02-22 01:00 GMT

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ బీజేపీ సొంతంగా 370 స్థానాలకు పైగా, ఎన్‌డీఏకు 400 స్థానాలకుపైగా వస్తాయని ప్రకటించారు. 360 డిగ్రీలు వలే బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాపించి బలపడితే మోదీ చెప్పినట్లు 370 స్థానాలను అధిగమిస్తుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఒంటరిగా కనిపించినా ఎన్నికల అనంతరం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటవడం ఖాయం. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలోని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్న 370+ మిషన్‌ అతివిశ్వాసమే అవుతుంది.

గణిత శాస్త్రంలో 360 డిగ్రీలంటే అన్ని కోణాల్లో సంపూర్ణంగా వ్యాపించడం అని అర్థం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ బీజేపీ సొంతంగా 370 స్థానాలకు పైగా, ఎన్‌డీఏకు 400 స్థానాలకుపైగా వస్తాయని ప్రకటించారు. 360 డిగ్రీలు వలే బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాపించి బలపడితే మోదీ చెప్పినట్లు 370 స్థానాలను అధిగమిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడున్న స్థానాలు నిలుపుకుంటే అదే పెద్ద విజయం అని చెప్పవచ్చు.

ఉత్తరాది రాష్ట్రాల్లోని పరిస్థితి…

2019 ఎన్నికల ఫలితాలతో పరిశీలిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వచ్చే స్థానాలపై ఒక అంచనాకు రావచ్చు. 2019లో బీజేపీ 303 సీట్లు సాధించింది. హిందీ బెల్టులో బలంగా ఉన్న బీజేపీ 141 చోట్ల గెలిచి ఉత్తరాది రాష్ట్రాల్లో 71 శాతం సీట్లను పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 71 ఎన్‌డీఏ చేతిలోనే ఉన్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తం 77 స్థానాలుండగా బీజేపీ వంద శాతం సీట్లను గెలిచింది. మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మొత్తం 96 స్థానాలుండగా 82 బీజేపీవే. అంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే గరిష్టమైన ఫలితాలను సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో 18, ఒడిస్సాలో 8 స్థానాలు గెలిచిన బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ భారీగా ఆశలు పెట్టుకుంది.

2019 ఎన్నికల్లో పొత్తులకు కీలకమైన మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 41, బీహార్‌లోని 40 స్థానాల్లో 39 ఎన్‌డీఏ గెలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో బీజేపీ వెంట ఉన్న శివసేన ఇప్పుడు రెండుగా చీలి ఒక వర్గం కాంగ్రెస్‌తో జతకట్టింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్‌తో ఉన్న ఎన్సీపీలో ఒక వర్గం ఇప్పుడు బీజేపీ వెంట ఉంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎన్‌డీఏకు ఏకపక్షంగా సీట్లు రావడం కష్టమే. బీహార్‌లో గత ఎన్నికల్లో బీజేపీ వెంట ఉన్న జేడీయూ అనంతరం ‘ఇండియా’ కూటమితో కలిసింది. ఇక్కడ ఎన్‌డీఏకు గత ఫలితాలు రావడం కూడా కష్టమే.

దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి…

మోదీ 370 + మిషన్‌ విజయవంతం దక్షిణాదిలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ఆధారపడి ఉంటుంది. 2019లో 28 స్థానాలున్న కర్ణాటకలో అత్యధిక స్థానాలు సాధించి, 17 స్థానాలున్న తెలంగాణలో కూడా మెరుగైన ఫలితాలనే పొందింది. 39 స్థానాలున్న తమిళనాడులో, 25 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో, 20 స్థానాలున్న కేరళలో బీజేపీకి ఒక్క స్థానం కూడా రాలేదు. దీంతో ఈ రాష్ట్రాలపై ఆ పార్టీ దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. తమిళనాడులో గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జతకట్టిన బీజేపీ సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో అన్నామలైను రాష్ట్ర సారథిగా నియమించి అన్నాడీఎంకేని దూరం చేసుకుంది. కేరళలో సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి దీర్ఘకాలికంగా కృషి చేస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీతో సంబంధం లేకుండా ఎదగాలని విఫలయత్నం చేసింది. ఎన్నికల సమయానికి టీడీపీ`జనసేన కూటమితో బీజేపీ జత కట్టవచ్చనే వార్తల నేపథ్యంలో ఇక్కడ కొన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పలు ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తుండడంతో బీజేపీ ఇప్పుడున్న స్థానాలు నిలుపుకోవడమే కష్టం.

కాంగ్రెస్ ఆశలన్నీ ఈ రాష్ట్రాలపైనే..

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలోని అనైక్యతే బీజేపీకి బలంగా మారింది. కాంగ్రెస్‌తో ముఖాముఖి పోటీ ఉన్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లో బలంగా ఉండడం బీజేపీకి కలిసివస్తోంది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తమిళనాడు మినహా మిగతా చోట్ల ‘ఇండియా’ కూటమిలోని లుకలుకలు బీజేపీకి కలిసివచ్చే అంశాలు. నితీశ్‌ ఊసరవెల్లితో బీహార్‌లో, ఉద్దవ్‌ ఠాక్రే పోకడలతో మహారాష్ట్రలో, అఖిలేష్‌ యాదవ్‌ అవకాశవాదంతో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కలిసివస్తుండగా, కేజ్రీవాల్‌ ఆధిపత్యంతో ఢిల్లీ, పంజాబ్‌లలో, వామపక్షాల ధోరణితో కేరళలో కాంగ్రెస్‌ నష్ట పోనుంది.

ఇప్పుడు కాంగ్రెస్‌ ఆశలన్నీ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలపైనే ఉన్నాయి. బీజేపీ జాతీయవాదాన్ని కులగణనతో ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ ఎన్నికల అజెండగా చేసుకుంది. అయోధ్య రామాలయం అంశంతో బీజేపీ బలపడుతుందని భావిస్తున్న సమయంలో రైతుల నిరసనలు ‘ఇండియా’ కూటమికి అందివచ్చిన అవకాశం. హిందీ బెల్టులోని పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌, ఎన్నికల ముందు ఈ రైతు ఉద్యమాలను అనుకూలంగా మల్చుకుంటే బీజేపీకి గతంలో వలే విజయం సులభం కాదు. పంటలకు మద్దతు ధరపై రైతుల్లో ఆ పార్టీ విశ్వాసాన్ని కలిగించాలి. రైతుల బలం ఎరిగిన మోదీ యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు చట్టాలను విరమించుకుంటూ అన్నదాతలకు క్షమాపణలు చెప్పడం ఇక్కడ గమనార్హం.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

peoplespulse.hyd@gmail.com

Tags:    

Similar News