సంస్మరణ:భగత్‌సింగ్ కలలు నెరవేరుతున్నాయా?
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లాంటి వీరులు కుల, మత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంతరాలు లేని సమాజాన్ని కలలు కన్నారు.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లాంటి వీరులు కుల, మత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంతరాలు లేని సమాజాన్ని కలలు కన్నారు. వారు కన్న కలలు ఇంకా సాకారం కాలేదు. నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం జాతీయోద్యమ వీరుల స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్నది. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ప్రజలకు నేటికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అంతగా అందడం లేదు. ప్రైవేటీకరణ, కార్పొరేటికరణ వలన విద్య పేద వర్గాలకు అందని ద్రాక్షగా మారింది.
మోడీ ప్రభుత్వం ఎనిమిది ఏండ్ల కాలంలో కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబించి ప్రజలను వంచిస్తున్నది. కరోనా తర్వాత జాతీయ నూతన విద్యా విధానం-2020 ను తీసుకొచ్చింది. దీనితో దేశంలో ఉన్న ప్రాథమిక, ఉన్నత విద్య అంతా పూర్తిస్థాయిలో ప్రైవేట్‌పరం అవుతుంది. ఆర్థికంగా ఉన్న వర్గాలకే విద్యను అందించే మోసం దీనిలో దాగి ఉంది. ఇది డబ్ల్యూటీఓ, గాడ్స్, ఒప్పందంలో భాగం కాగా, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రభుత్వం ఉచిత విద్యను అందించాల్సింది పోయి అమ్మకానికి పెడుతున్నది. విద్యను కొనే స్థోమత లేక పిల్లలు బాలకార్మికులుగా మారుతున్న పరిస్థితి. ఇలా తన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటే విద్యారంగంలో రిజర్వేషన్లు పనిచేయవు.
అశాస్త్రీయత పెంచుతున్నారు
ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో 6-12 తరగతి విద్యార్థులకు భగవద్గీతను సిలబస్‌గా ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలలో జ్యోతిష్య శాస్త్రం బోధన సాగుతోంది. ఆర్ఎస్ఎస్ సిలబస్ అమలుకు మార్గం సుగమం చేస్తున్నారు. ఏ దేశంలో లేని యువశక్తి మనదేశంలో ఉంది. భారత యువతను, విద్యార్థులను పెద్ద పెద్ద కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాల పేరిట బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నూతన విద్యా విధానం తేవాలని అనుకున్నపుడు కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు చర్చలు జరగాలి.
విద్యావేత్తలతో, ప్రొఫెసర్లతో, ప్రజా సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇదంతా ఆర్ఎస్ఎస్-ఏబీవీపీ అజెండా. ప్రవేశ పరీక్షల దగ్గర నుండి, పాఠ్యాంశాల వరకు సిలబస్ అంతా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే రూపుదిద్దుకుంటున్నాయి. సాహిత్యాన్ని మార్చుతున్నారు. ప్రగతిశీల దళిత రచయితలను తీసేస్తున్నారు. కళాశాలల స్థానంలో గోశాలలు, యజ్ఞశాలలు తెరుచుకుంటున్నాయి. సైన్స్ స్థానంలో అశాస్త్రీయత అమలు జరుగుతున్నది.
రాష్ట్రంలోనూ అంతే
గత ఏడేండ్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రభుత్వ భూముల అమ్మకం. ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతలు, ఎన్నికలలో వేల కోట్ల ఖర్చు, ఆచరణకు వీలుకాని హామీలు ప్రజలకు ఇచ్చి మభ్య పెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను పట్టించుకోకుండా, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించడం లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన దాదాపు నాలుగు వేల కోట్ల పై చిలుకు ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్స్ ఇవ్వడం లేదు. నూతన విద్యాసంస్థల ఊసే లేదు.
కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల ప్రకటన కూడా విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసేదిగా ఉంది. 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 80 వేలు భర్తీ చేస్తామనడం నిరుద్యోగులను మోసగించడమే. తన మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతి ఇచ్చి ఫీజుల దోపిడీకి దిగుతున్నారు. పాఠశాలలను మూసివేస్తున్నారు. నూతన సంక్షేమ హాస్టళ్లను నిర్మించడం లేదు. యూనివర్సిటీలో కోర్సు ఫీజులను, పరీక్ష ఫీజులను పెంచి, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలి. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి.
(నేడు షహీద్ భగత్‌సింగ్ వర్ధంతి)
పి. మహేశ్
ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ, తెలంగాణ
97003 46942