ఏటా రెండుసార్లు ఏఐబీఈ పరీక్ష నిర్వహించాలి!

Update: 2024-05-14 00:45 GMT

న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు ఆరు వేల మంది అభ్యర్థులు కొత్తగా రాష్ట్రంలో ఎల్ఎల్‌బీ డిగ్రీలు తీసుకుంటున్నారు. అయితే, గతంలో మాదిరిగా ఎల్‌ఎల్‌బీ పాసైన వెంటనే అడ్వకేట్‌గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. 2009-2010 విద్యా సంవత్సరం నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అభ్యర్థులు ప్రాక్టీస్ ప్రారంభించాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) పాస్ కావాలి.

ఏఐబీఈ పరీక్ష పాసైన అడ్వకేట్స్‌కి బీసీఐ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) జారీ చేస్తుంది. అయితే, అడ్వకేట్‌గా ఎన్రోల్మెంట్ చేసుకున్న రెండేళ్లలోగా ఏఐబీఈ పాస్ కావాలి. లేనిపక్షంలో, అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసే అర్హత ఉండదు. ఏఐబీఈ పాసైతేనే అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ చాలామంది లాయర్లు వివిధ హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అడ్వకేట్ యాక్ట్-1961 ప్రకారం బీసీఐకి, ఏఐబీఈ పరీక్ష నిర్వహించే అధికారం ఉందని గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఏఐబీఈ నిర్వహణపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి.

ఏఐబీఈ పరీక్ష ప్యాటర్న్

ఏఐబీఈ పరీక్ష ఓపెన్ బుక్ సిస్టంలో ఉంటుంది. పరీక్ష హాలులోకి నోట్స్ పొందుపర్చని బేర్ యాక్ట్ బుక్స్ అనుమతిస్తారు. వంద మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం మూడు గంటలు. ఉత్తీర్ణత సాధించడానికి జనరల్, బీసీ(ఓబీసీ) అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సి అభ్యర్థులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. నెగిటివ్ మార్కులు ఉండవు. తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో తిరుపతి, విశాఖపట్నంలో మాత్రమే ఏఐబీఈ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. కోవిడ్-19 ముందు వరకు ఏటా రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన బీసీఐ, గత మూడేళ్ళ నుంచి ఆ విధంగా నిర్వహించలేకపోతోంది.

మొదట ఎన్రోల్మెంట్!

అయితే, ఏఐబీఈ పరీక్ష రాయాలనుకునేవారు మొదట అడ్వకేట్‌గా స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకువాలి. ప్రతి సోమ, మంగవారం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ కార్యాలయంలో అడ్వకేట్‌గా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. దీనికోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌లో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన రెండు జిరాక్స్ సెట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఎల్ఎల్‌బీ కన్వోకేషన్ లేకపోయినా ఒరిజినల్ ప్రోవిషనల్ సర్టిఫికెట్‌తో ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఎల్ఎల్‌బీ ఒరిజినల్ ప్రోవిషనల్ సర్టిఫికెట్‌ని బార్ కౌన్సిల్ వారు తమ దగ్గరే పెట్టుకుని కన్వోకేషన్ జిరాక్స్ సమర్పించిన తర్వాత తిరిగి ఇస్తారు. అయితే ఫిలప్ చేసిన ఫామ్‌పై ఇద్దరు సీనియర్ అడ్వొకేట్స్ రికమండ్ చేస్తూ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. రిటైర్ కాకముందే ఎల్ఎల్‌బీ అడ్మిషన్ తీసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు సంబంధిత అథారిటీ నుంచి స్టడీ కోసం తీసుకున్న పర్మిషన్ లెటర్ విధిగా జతచేయాలి. నోటరి చేయించాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు జత చేయాలి. 2010 నుంచి ఓపెన్ యూనివర్సిటీ/డిస్టెన్స్ మోడ్ బ్యాచిలర్ డిగ్రీతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అభ్యర్థులను తెలంగాణ బార్ కౌన్సిల్ వారు ఎన్రోల్మెంట్ చేయడం లేదు. ఇలాంటి వారికి ఏపీ బార్ కౌన్సిల్ వారు మాత్రం ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. అమరావతికి వెళ్లి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి.

ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినవారు సైతం

జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.8,000 ఫీజు ఉంటుంది. దీంతో పాటు అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.2,500 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఫీజు, గ్యాప్ ఫీజు ఏడాదికి రూ.700 చొప్పున చెల్లించాలి. గ్యాప్ ఫీజు ఎంత చెల్లించాలనేది బార్ కౌన్సిల్ కార్యాలయం వారే ఒక్కో అభ్యర్థికి లెక్కించి చెప్తారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అదనంగా రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల ఫీజులను హైకోర్టు ఆవరణలోనే ఉన్న ఎస్బీఐలో చలాన్ల ద్వారా మాత్రమే చెల్లించాలి. అభ్యర్థులు ఎల్ఎల్‌బీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్మెంట్ చేయించుకుంటే, ఏఐబీఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా పరీక్షకు అటెండ్ కావొచ్చు. అయితే, అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయడానికి, హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ నియామకాలకు అర్హత పరీక్షగా ఉన్న ఏఐబీఈని గతంలో మాదిరిగా ఏటా రెండుసార్లు నిర్వహించాలని జూనియర్ లాయర్లు బీసీఐని కోరుతున్నారు.

మానేటి ప్రతాపరెడ్డి

అడ్వకేట్

9848481028

Tags:    

Similar News