ఆర్.కృష్ణయ్యతో ఈటల భేటీ.. ఉప ఎన్నికపై కీలక చర్చ

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్యను ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్ వచ్చిన ఈటల రాజేందర్ ప్రత్యేకంగా ఆర్.కృష్ణయ్యతో భేటీ అయ్యి హుజూరాబాద్ అంశంపై చర్చించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక పోరు రెండు జెండాలు లేదా రెండు పార్టీల మధ్య జరుగుతున్నది కాదని అన్నారు. నిర్దిష్టంగా ఇది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారానికి, […]

Update: 2021-09-10 07:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్యను ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్ వచ్చిన ఈటల రాజేందర్ ప్రత్యేకంగా ఆర్.కృష్ణయ్యతో భేటీ అయ్యి హుజూరాబాద్ అంశంపై చర్చించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక పోరు రెండు జెండాలు లేదా రెండు పార్టీల మధ్య జరుగుతున్నది కాదని అన్నారు. నిర్దిష్టంగా ఇది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారానికి, ధర్మం కోసం పాటుపడిన తనకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. కురుక్షేత్ర సంగ్రామం తరహాలో జరుగుతున్న ఈ రాజకీయ పోరులో ఎప్పుడూ పేదలకు అండగా నిలిచే ఆర్. కృష్ణయ్యను ధర్మం కోసం నిలబడిన తనకు అండగా నిలవాలని కోరినట్లు తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆర్.కృష్ణయ్యతో అనుబంధం ఉన్నదని, తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి 18 సంవత్సరాలు పనిచేశామని గుర్తు చేశారు.

ప్రస్తుతం హుజూరాబాద్‌లో పర్యటిస్తున్న హరీశ్‌రావు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, ఉద్యమకాలంలో తనకు సహచరుడే అయినా ప్రగతి భవన్‌ నుంచి కేసీఆర్ ఇస్తున్న ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని అన్నారు. కానీ ఆయన ప్రయత్నాలు వృథా కాక తప్పదని, ఆయన ఉద్యమ చరిత్ర కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఈటల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ పోరు కులాల పోరాటమో లేక రాజకీయ పోరాటమో లేక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నదో కాదన్నారు. అహంకారానికి, ధర్మానికి మధ్య జరుగుతున్న సమరమని అన్నారు. కేసీఆర్ అహంకారానికి, ఈటల రాజేందర్ ధర్మానికి మధ్య జరుగుతున్న పోరు అని అభివర్ణించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, పద్ధతులను తుంగలో తొక్కి చక్రవర్తి తరహాలో పరిపాలన సాగిస్తున్నారని, వ్యతిరేకంగా మాట్లాడినా, సమస్యలను ప్రస్తావించినా, ప్రజాస్వామ్య సూత్రాలను గుర్తుచేసినా, నియంతృత్వ పోకడలను ప్రశ్నించినా అణిచివేస్తున్నారని కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఎన్నికల కోసం వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. హుజరాబాద్‌లో తాను రాజీనామా చేసిన తర్వాత వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అధికార యంత్రాంగాన్ని మోహరించారని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన ప్రగతి భవన్‌లో దానికి బదులుగా హుజురాబాద్‌లో దొడ్డిదారిన గెలవడంపైనే చర్చలు చేస్తున్నారని, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని కొత్త పథకాలు తెచ్చినా, ఎంత మంది అధికారులను వినియోగించినా హుజురాబాద్ ప్రజలు ధర్మానికి కట్టుబడి న్యాయాన్నే కాపాడతారని అన్నారు.

బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, అనేక ఏండ్ల పాటు తెలంగాణ కోసం త్యాగాలు చేశారని అన్నారు. మర్యాద పూర్వకంగానే కలిసి మాట్లాడటానికి వచ్చారని తెలిపారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనేక పోరాటాల్లో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తుచేశారు. బీసీల హక్కుల కోసం, హాస్టల్ విద్యార్థుల కోసం, ఎస్సీ, ఎస్టీల పక్షాన రాజేందర్ పోరాడారని గుర్తుచేశారు.

Tags:    

Similar News