డాక్టర్లకు కరోనా సోకితే వారే బాధ్యులు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్యులకు, సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ సోకి పాజిటివ్ నిర్ధారణ అయితే దానికి వారే బాధ్యులని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ సోకకుండా వారికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులను ఇస్తున్నామని, వాటి ద్వారా వైరస్ సోకే అవకాశమే లేదని, అయినా ఇన్‌ఫెక్షన్ బారిన పడితే దానికి బాధ్యత వహించాల్సింది డాక్టర్లు, వైద్య సిబ్బందేనని వ్యాఖ్యానించింది. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు వాడితే వైరస్ సోకే అవకాశమే […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్యులకు, సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ సోకి పాజిటివ్ నిర్ధారణ అయితే దానికి వారే బాధ్యులని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ సోకకుండా వారికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులను ఇస్తున్నామని, వాటి ద్వారా వైరస్ సోకే అవకాశమే లేదని, అయినా ఇన్‌ఫెక్షన్ బారిన పడితే దానికి బాధ్యత వహించాల్సింది డాక్టర్లు, వైద్య సిబ్బందేనని వ్యాఖ్యానించింది. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు వాడితే వైరస్ సోకే అవకాశమే లేదని, అందుకే వారి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ సోకుకుండా ఉండేందుకు వీటిని అందిస్తున్నామని వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఒక మహిళా డాక్టరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ ఎమ్ఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విధంగా వ్యాఖ్యానించారు. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత డాక్టర్లు, వైద్య సిబ్బందిదేనని ఆయన స్పష్టం చేశారు.
పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు వాడుతున్నా వైరస్ బారిన పడుతున్నారంటే తప్పు ఆ ఉపకరణాలది కాదని, లోపం ఎక్కడుందో వారే ఆలోచించుకోవాలని ధర్మాసనానికి సూచించారు. వాటిని వాడుతున్నా పాజిటివ్ వస్తోందంటే అది అతిశయమే అవుతుందని వ్యాఖ్యానించారు. మహిళా డాక్టర్ తరఫున న్యాయవాది మిథు జైన్ వాదిస్తూ, వైద్య సిబ్బందికి పద్నాలుగు రోజుల క్వారంటైన్‌పై కేంద్ర వైద్యారోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాల గురించి ప్రశ్నించారు. ఆసుపత్రి ఆవరణలోనే వైద్యులకు నివాస వసతి కల్పించాలన్న అంశాన్ని ప్రస్తావించారు. పేషెంట్లకు చికిత్స చేసే వైద్య సిబ్బంది ఎక్కువ రిస్కులో ఉంటున్నందునే వారికి పీపీఈ కిట్లు లాంటివి సమకూర్చడంతో పాటు విధులు ముగించుకున్న తర్వాత పద్నాలుగు రోజుల క్వారంటైన్‌లో ఉండేలా రూల్ బుక్‌లోనే స్పష్టత ఇచ్చినట్లు సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.
వైద్యులు రిస్కు తీసుకుని కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్నందునే వారికి వైరస్ సోకకుండా కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలను సూచించిందని, ఉపకరణాలను కూడా సమకూరుస్తోందని, వైరస్ ఇన్‌ఫెక్షన్ రాకుండా తగిన శిక్షణ కూడా కల్పించిందని, ఇందుకోసం ప్రతీ కొవిడ్ ఆసుపత్రిలో ఒక కమిటీ కూడా ఉందని సొలిసిటర్ జనరల్ విచారణ సందర్భంగా ధర్మాసనానికి వివరించారు. అయినా డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వైరస్ వస్తూ ఉందంటే ఆయా ఆసుపత్రుల్లోని ‘హాస్పిటల్ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కమిటీ’ సమీక్షించి బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర వైద్యారోగ్య శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని స్వయంగా వైద్యులు పాటించడంతో పాటు అవగాహన కల్పించి బాధ్యత వహించేందుకు ఈ కమిటీ చొరవ తీసుకోవాల్సి ఉందని అన్నారు. పైగా పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు ధరిస్తున్నా డాక్టర్లకు కరోనా ఇన్‌ఫెక్షన్ ఎందుకు వస్తుందో పిటిషనర్ స్పష్టంగా చెప్పలేకపోయారని, ఉపకరణాలను తప్పుపట్టడం కాకుండా స్వీయ జాగ్రత్తలను పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉందో పిటిషనర్ వివరించలేకపోయారని సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యానించారు.