కంచుకోటలో జగన్‌కు భారీ షాక్.. వైఎస్ సన్నిహితుడు ఔట్?

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సొంత జిల్లాలో షాక్ తగలనుందా..? వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేస్తారా..?గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మాజీమంత్రి ఇక గుడ్‌బై చెప్పేసేందుకు రెడీ అవుతున్నారా..?ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలు అందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దివంగత సీఎం వైఎస్ఆర్‌ అత్యంత సన్నిహితుడు అయిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై […]

Update: 2021-10-15 06:07 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సొంత జిల్లాలో షాక్ తగలనుందా..? వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేస్తారా..?గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మాజీమంత్రి ఇక గుడ్‌బై చెప్పేసేందుకు రెడీ అవుతున్నారా..?ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలు అందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దివంగత సీఎం వైఎస్ఆర్‌ అత్యంత సన్నిహితుడు అయిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయదశమినాడు సొంత పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని వెల్లడించారు. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలదాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తోడవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రఘురామను ఎదుర్కొనేందుకే వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నా ఫలించలేని పరిస్థితుల్లో ఫైర్ బ్రాండ్ డీఎల్ విల్లు ఎక్కుపెట్టడం ఒకవిధంగా పార్టీకి పెద్ద దెబ్బేనని తెలుస్తోంది.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా

వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడప లోక్‌సభకు జగన్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో జగన్ పై కాంగ్రెస్ తరఫున డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసి ఘోరంగా పరాజయం పొందారు. ఆ ఎన్నికలో జగన్ 5.45 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. రాజకీయాల్లో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ అనుచరులు ఒత్తిడి చేయడంతో టీడీపీలో చేరాలని ఊగిసలాడారు. కానీ మనస్సాక్షి అంగీకరించలేదో ఏమో తెలియదు కానీ వెనక్కి తగ్గారు.

వైసీపీలో చేరిన డీఎల్

2019 ఎన్నికల సమయంలో డీఎల్ రవీంద్రారెడ్డి బంధువర్గమంతా వైసీపీలో చేరారు. డీఎల్ వియ్యంకుడు మాజీమంత్రి గాదె వెంకట్ రెడ్డి, డీఎల్ అల్లుడు మధుసూదన్ రెడ్డి కూడా జగన్ పార్టీలో చేరిపోయారు. డీఎల్ మాత్రం సైలెంట్ అయిపోయారు. అయితే వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డిలు బలవంతం చేయడంతో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ గూటికి చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీని భూస్థాపితం చేస్తానంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని విమర్శించారు. జగన్ నాయకత్వంలో రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తామని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ కు అన్నిరకాలుగా అండగా ఉంటామన్నారు. 2019 ఎన్నికల్లో మైదుకూరు వైసీపీ అభ్యర్థి రాఘురామిరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. వైసీపీ గెలిచినా కూడా ఎక్కడా చప్పుడుకాకుండా మిన్నకుండిపోయారు.

జగన్‌పాలనపై తీవ్ర విమర్శలు

మైదుకూరులో డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి. తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతాడు. ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు. సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండి. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలి…ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుంది. భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పని. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు. సబ్సిడీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు’ అని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చిందంటూ ఘాటు విమర్శలు చేశారు. సొంత జిల్లాలో ఎదురవుతున్న పరిస్ధితులు, వైసీపీ నేతల తీరుతో మనస్తాపం చెందిన డీఎల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

సజ్జలపైనా డీఎల్ విసుర్లు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ సర్కార్‌లో నంబర్ 2గా చెలామణి అవుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా డీఎల్ పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని, దారినపోయే వారంతా మీడియా సమావేశాలు పెడుతున్నారంటూ బాంబు పేల్చారు. ఇప్పటికే సజ్జల దూకుడుపై సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్న నేపథ్యంలో డీఎల్ కూడా అదే అంశాన్ని టార్గెట్ చేస్తూ సజ్జలపై ఈ విమర్శలు చేయడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

2024లో పోటీ చేసి తీరుతా

2024 సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుందంటూ కుండబద్దలుకొట్టారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న డీఎల్ పోటీ చేసేందుకు నియోజకవర్గం కూడా ఖాళీ లేదు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన టీడీపీ లేదా మరో పార్టీ తరఫున బరిలోకి దిగుతారా అన్న సందేహం నెలకొంది. 2019లో కడప జిల్లాలో వైసీపీ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చిన డీఎల్ రవీంద్రారెడ్డి జగన్‌తో కలిసి ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో మారిన పరిస్ధితుల్లో ఆయన వైసీపీలో ఇమడలేకపోతున్నట్లు ఆయన కామెంట్స్ బట్టి తెలుస్తోంది.

రఘురామకు తోడు దొరికిందా?

ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విపక్షాలు కంటే దారుణంగా విమర్శలదాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్‌కు, వైసీపీకి ఏకు మేకై కూర్చున్నారు. ప్రభుత్వ లోపాలను టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎత్తి చూపడంలో ఒక అడుగు ఆలస్యం అవుతారేమో కానీ రఘురామ మాత్రం అందరికంటే ముందే ఉంటారు. అన్ని అంశాలపై పట్టుసాధించడంతో దేన్నీ వదలకుండా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై గురిపెడుతున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సీబీఐ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురు అవ్వడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లో వారి బెయిల్ రద్దు చేయాలనే లక్ష్యంతో రఘురామకృష్ణంరాజు పని చేస్తున్నారు. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖమంత్రినా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామ చేష్టలు ఒకరకంగా చెప్పాలంటే అటు సీఎం వైఎస్ జగన్‌కు, వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారనేది వాస్తవం. తాజాగా రఘురామకు డీఎల్ రవీంద్రారెడ్డి తోడైనట్లు కనిపిస్తోంది. డీఎల్ రవాంద్రారెడ్డి గనుక ఎంపీ రఘురామకు తోడైతే వైసీపీకి చుక్కలే. ఎందుకంటే డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. అవతలివారు ఎలాంటి వారైనా సరే పట్టించుకోరు. విమర్శలు చేశారంటే ఓ రేంజ్‌లో చేస్తారు. అందుకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ కాంగ్రెస్‌ను వీడి వైసీపీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం.

Tags:    

Similar News