భవన నిర్మాణ అనుమతులు ఇక సులభతరం.. సింగిల్ విండో విధానం అమలు

భ‌వ‌నాలు, లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-26 01:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: భ‌వ‌నాలు, లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కర‌ణ‌ల‌పై వేసిన క‌మిటీ రిపోర్ట్‌కు సీఎం ఆమోద ముద్ర వేశారు.15 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ భ‌వ‌నాల నిర్మాణాల ప్లాన్‌ల‌కు మున్సిప‌ల్ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేదు. రాష్ట్రంలో వచ్చే నెల 31 నుంచి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లైసెన్స్ ఉన్న సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆన్‌లైన్ దరఖాస్తు చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

దీనికి సంబంధించి ఎవరైనా లైసెన్స్ ఉన్న సర్వేయర్లు అవకతలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా 500 చ.మీ కంటే ఎక్కువ విస్తీర్ణలో నిర్మించే వాణిజ్య భవనాలు, నివాస భవనాలకు సంబంధించి సెల్లార్ల ఏర్పాటుకు అనుమతులిస్తామని తెలిపారు. మెప్మాకు సంబంధించి ప్రస్తుతం సుమారు 28 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వారి అభ్యున్నతికి పీ-4 విధానంలో రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో అమృత్ 2.0‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని ఆ ప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయని, దశల వారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.


Similar News