వారి పట్ల దయ, సానుభూతిని చూపించండి.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దివ్యాంగులలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి సహకారంతో ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమౌతుందన్నారు. నెల్లూరులోని దివ్యాంగుల నైపుణ్యం, సాధికారత, పునరావాస సమ్మిళిత ప్రాంతీయ కేంద్రాన్ని (కాంపోజిట్ రీజనల్ సెంటర్) ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం అక్కడి దివ్యాంగులతోనూ, సిబ్బందితోనూ ఉపరాష్ట్రపతి ముచ్చటించారు. ఇటివల టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశ […]
దిశ, ఏపీ బ్యూరో: దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దివ్యాంగులలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి సహకారంతో ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమౌతుందన్నారు. నెల్లూరులోని దివ్యాంగుల నైపుణ్యం, సాధికారత, పునరావాస సమ్మిళిత ప్రాంతీయ కేంద్రాన్ని (కాంపోజిట్ రీజనల్ సెంటర్) ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం అక్కడి దివ్యాంగులతోనూ, సిబ్బందితోనూ ఉపరాష్ట్రపతి ముచ్చటించారు. ఇటివల టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశ క్రీడాకారుల ప్రతిభను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, దివ్యాంగులైన క్రీడాకారులు చూపించిన ప్రతిభ భారతీయులందరికీ ప్రేరణగా నిలించిందని తెలిపారు.
ఎలాంటి వైకల్యాన్నైనా ఆత్మవిశ్వాసంతో అధిగమించవచ్చనే విషయాన్ని వారు రుజువు చేశారని వెంకయ్యనాయుడు కొనియాడారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన మౌలిక సదుపాయాల సృష్టి కోసం పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, వారి నైపుణ్యాన్ని సరిగా వినియోగించుకోగలిగితే అద్భుతాలు సాధించవచ్చని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగం వీరి నైపుణ్యాన్ని వినియోగించుకుని, వారికి సాధికారత కల్పించే దిశగా ముందుకు రావాలని సూచించారు. బ్యాంకులు సైతం సానుకూల దృక్పథంతో వారికి రుణాలు అందించేందుకు ముందుకు రావాలని సూచించారు. సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటిలెక్టువల్ డిజెబిలిటీస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని సీఆర్సీ పనిచేస్తోంది. ప్రస్తుతం దివ్యాంగుల కోసం డాటా ఎంట్రీ ఆపరేషన్, కుట్టు మిషన్ ఆరేషన్, ఆపీస్ అసిస్టెంట్ ట్రైనింగ్, ఎల్.ఈ.డీ. బోర్డు తయారీ లాంటి వృత్తినైపుణ్య శిక్షణను ఈ సంస్థ అందిస్తోంది.
ఈ సందర్భంగా సామాజిక న్యాయం మరియు సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ అండ్ కార్పొరేషన్స్ పంపిణీ చేసిన ఉపకరణాలను ఉపరాష్ట్రపతి దివ్యాంగులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాలకు చెందిన దివ్యాంగులకు అందించిన సహాయం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల్లో అదనపు రిజర్వేషన్లు సహా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వెంకయ్య నాయుడు ప్రశంసించారు.