దిశ ఎఫెక్ట్: కదిలిన అధికార యంత్రాంగం
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మహమ్మారి కరోనా, బ్లాక్ ఫంగస్ మా తండ్రిని మింగేశాయి. మా తల్లికీ కరోనా సోకింది, వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు దయచేసి మా తల్లి ప్రాణాలు కాపాడండి అంటూ ఇద్దరు చిన్నారులు ప్రభుత్వాన్ని వేడుకున్న సంఘటనను మానవీయ కోణంలో ‘దిశ’ తెలుగు దినపత్రికలో ‘‘నాన్నను మింగేసింది.. అమ్మనైనా రక్షించండి, సాయం కోసం చిన్నారుల ఎదురు చూపులు’’ శీర్షికను ప్రచురించింది. ఈ కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మోత్కూరు […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మహమ్మారి కరోనా, బ్లాక్ ఫంగస్ మా తండ్రిని మింగేశాయి. మా తల్లికీ కరోనా సోకింది, వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు దయచేసి మా తల్లి ప్రాణాలు కాపాడండి అంటూ ఇద్దరు చిన్నారులు ప్రభుత్వాన్ని వేడుకున్న సంఘటనను మానవీయ కోణంలో ‘దిశ’ తెలుగు దినపత్రికలో ‘‘నాన్నను మింగేసింది.. అమ్మనైనా రక్షించండి, సాయం కోసం చిన్నారుల ఎదురు చూపులు’’ శీర్షికను ప్రచురించింది. ఈ కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మోత్కూరు సుందరయ్య కాలనీకి చెందిన రావుల వెంకన్న కొన్ని రోజుల క్రితం కొవిడ్, బ్లాక్ ఫంగస్ కారణంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఐదు రోజుల క్రితం మరణించాడు. ఈ నేపథ్యం అతని భార్యకూ కరోనా వైరస్ సోకింది. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారులు తల్లికి వైద్యం చేయించుకోలేక, వైద్యం ఖర్చులకు ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని అడగాలో అర్థం కాక ఇబ్బందుల పాలవుతున్నారు. తల్లి కరోనాతో ఇంట్లోనే ఉండగా దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ తల్లిని ఎలాగైనా కాపాడండి అంటూ కనిపించిన వారినందరినీ వేడుకుంటున్నారు.
ఇలా వారు పడుతున్న ఇబ్బందులను ‘‘దిశ’’ దిన పత్రికలో ప్రచురించడంతో హెచ్ఆర్సీ నాన్ జ్యుడీషియరీ సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్ మొయినొద్దీన్ స్పందించారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మోత్కూర్ తహశీల్దార్ లకు కు ఫోన్ చేసి విచారించారు. తక్షణమే బాధిత మహిళకు వైద్యం అందించాలని, ప్రభుత్వ పరంగా మందులు, నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. వెంటనే మోత్కూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ‘‘మన మోత్కూర్ చారిటీ గ్రూప్’’లో పత్రిక కథనాన్ని వేశారు. దీంతో ఛారిటీ ద్వారా వచ్చిన మొత్తం రూ 28 వేలతో పాటు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను రావుల వెంకన్న సంతానానికి అందించారు. అంతేకాకుండా మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ కూడా ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.