కరోనా ఎఫెక్ట్.. కూడుపెట్టని రజ‘కుల’ వృత్తి
దిశ, తెలంగాణ బ్యూరో : తరతరాల నుంచి రజకవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ముందు తరాల నుంచి వారసత్వంగా తీసుకొని బట్టలు ఊతుకుతూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే బట్టలు ఉతికేందుకు వాషింగ్ కంపెనీలు, డ్రై క్లీనింగ్, సారీ రోలింగ్ సెంటర్లకు తోడు గతేడాదికి పైగా కరోనాతో రజకులు(చాకలి) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరాకీలు లేక, మరోవైపు చేసేందుకు పనులు లేక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటంతో పస్తులుండాల్సిన […]
దిశ, తెలంగాణ బ్యూరో : తరతరాల నుంచి రజకవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ముందు తరాల నుంచి వారసత్వంగా తీసుకొని బట్టలు ఊతుకుతూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే బట్టలు ఉతికేందుకు వాషింగ్ కంపెనీలు, డ్రై క్లీనింగ్, సారీ రోలింగ్ సెంటర్లకు తోడు గతేడాదికి పైగా కరోనాతో రజకులు(చాకలి) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరాకీలు లేక, మరోవైపు చేసేందుకు పనులు లేక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటంతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది.
వారు ఇంటింటికి తిరిగి విడిచిన బట్టలను సేకరిస్తారు.. వాటిని ఉతికి తిరిగి వారికి అప్పగిస్తారు.. దాంతో వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు రజకులు. శుభకార్యమైన, అశుభకార్యమైన ముందుండేది వారే. కానీ కాలక్రమేణ వారి ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతోంది. టెక్నాలజీ పేరుతో వాషింగ్ కంపెనీలు, డ్రైక్లీనింగ్, శారి రోలింగ్ సెంటర్లు వెలుస్తుండటంతో పాటు ఇతర కులాలకు చెందిన వారు రంగం ప్రవేశం చేసి ఆధునిక టెక్నాలజీతో బట్టలను ఉతుకుతున్నారు. తక్కువ సమయంలో ఐరన్, డ్రైక్లీనింగ్ చేసి ఇస్తుండటంతో వారసత్వంగా కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారికి ఉపాధి కోల్పోతున్నారు. వారికి ఆధునిక యంత్రాలను కొనుగోలు శక్తి లేకపోవడం… వారు శ్రమశక్తిని నమ్ముకోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొంత మంది విధిలేని పరిస్థితుల్లో కుల వృత్తిని వీడి కూలీనాలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 16లక్షల మందికిపైగా రజకులు ఉన్నారు. కానీ ప్రభుత్వం గుర్తించింది మాత్రం 8లక్షల 60వేలు. దీని ప్రకారం లక్షకుపైగా దోబీఘాట్లు ఉండాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది మాత్రం కేవలం 450 మాత్రమే. అందులోనూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. 200 నుంచి 250 వరకు నిర్మించారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ విస్తరించడంతో 100పైగా ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించింది. గ్రామాల్లోనూ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దోభీఘాట్లతో పాటు సామాజిక భవన నిర్మాణాల కోసం గ్రామపంచాయతీల తీర్మాణంతో భూములను కేటాయించారు. కానీ ప్రభుత్వం పొజిషన్లు ఇవ్వలేదు. వాటర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతో జనగాం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లోనూ నిరూపయోగంగా మారాయి. అంతేకాదు కొన్నింటిలో రైతువేదికలు నిర్మించారు. ఉదహారణకు జనగాం జిల్లాలో రైతు వేదిక, హైదరాబాద్ లోని తుకారం గేటు దగ్గర పార్కు ఏర్పాటు చేశారు.
లక్షలోపు సొసైటీలు..
రజకులు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కోక్క సొసైటీకి రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు ఖర్చు చేశారు. గతంలో రజకులు బీసీ కార్పొరేషన్ కింద కొనసాగే సమయంలో రుణాలు ఇచ్చేవారు. అయితే రజక ఫెడరేషన్ ఏర్పడటంతో 2014లో ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. కానీ రూ.30 కోట్లు కూడా విడుదల చేయకపోవడంతో ఎవరికి రుణసాయం అందలేదని రజక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం నిధుల కేటాయింపు చెప్పుకోవడానికే తప్పా ఇవ్వడానికి కాదనే అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రభుత్వ సాయం అందక, పనులు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదిలేక కులవృత్తిని వీడుతున్నారు.
దోబీఘాట్లపై పర్యవేక్షణేది?
ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి దోబీఘాట్లు నిర్వహిస్తున్నామని పేర్కొంటుంది. గత ఎన్టీఆర్ పాలనలో సనత్ నగర్, జవహర్నగర్, మూసాపేట్, షేక్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ, పటాన్ చెరువు, ఫిలింనగర్తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 200 నుంచి 250 వరకు నిర్మించారు. వేలాది మంది రజకులు వీటిపై ఆధారపడి జీవనం సాగించారు. కానీ దోబీఘాట్లపై పర్యవేక్షణ కొరవడంతో మౌలిక సదుపాయల లేమితో కొన్ని నిరూపయోగంగా మారగా, కొన్ని ఆక్రమకు గురయ్యాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను అందజేస్తామని ప్రకటన చేయడం, దరఖాస్తులు స్వీకరిస్తుండటం దీంతో ఎంత మంది లబ్దిపొందుతారో అధికారులకే తెలియలి. రజకసంఘం నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఓటు బ్యాంకు, మభ్యపెట్టడానికి, కాలయాపన చేయడానికే తప్ప రజకులకు ఒరిగేదేమీలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆధునిక యంత్రాల ఎఫెక్ట్
ప్రభుత్వం మోడ్రన్ దోబీఘాట్లు నిర్మిస్తాం.. రజలకు వృత్తి శిక్షణ ఇప్పిస్తాం.. అని ప్రకటనలు చేయడంతో పాటు జీవోలను సైతం జారీ చేసింది. కానీ ఆజీవోలు కార్యరూపం దాల్చలేదు. కేవలం ఒకటిరెండు జిల్లాల్లో మాత్రమే మోడ్రన్ దోబీఘాట్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు పాలకులు. సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాలు వచ్చాయి. ఇతర కులస్తులు కూడా రంగ ప్రవేశంతో వృత్తినే నమ్ముకున్నవారికి జీవనోపాధి కరువైంది. కేవలం హైదరాబాద్ లోనే 158 వాషింగ్ కంపెనీలు వెలిశాయి. ఇందులో రజకులకు రెండుమూడు కంపెనీలు మాత్రమే. ఈ కంపెనీలపై కార్పొరేట్ విద్యాసంస్థలు, రైల్వే, దవాఖానలతో పాటు అపార్టుమెంట్ వాసులు కూడా బట్టలను అప్పగిస్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే తిరిగి వారికి ఐరన్, డ్రైక్లీనింగ్తో సహా అందజేస్తున్నారు. దీనికి తోడు ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చిన మహిళలు కొంత మంది ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఓవైపు యంత్రాలు, మరో వైపు ఉపాధికోసం వచ్చిన వారు. ఇంకోవైపు కరోనాతో రజకులు ఉపాధి కోల్పోతున్నారు.
డిమాండ్లు..
రజక ఫెడరేషన్ కు పూర్తిస్థాయి కమిటీని నియమించాలి. ఏటా బడ్జెట్ లో 10వేల కోట్లు కేటాయించాలి. అన్ని గ్రామాల్లో మోడ్రన్ దోబీఘాట్లు నిర్మించాలి. ప్రతి వ్యక్తి వడ్డిలేకుండా షరతులు విధించకుండా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు రుణం ఇవ్వాలి. ఆధునిక శిక్షతో పాటు యంత్రాలను రజకఫెడరేషన్ కింద ఇవ్వాలి. స్కూల్ ఫీజులో రాయితీ ఇప్పించాలి. ఉన్నత విద్యకు రుణసదుపాయం కల్పించాలి. కరోనా లాంటి ఆపత్కాలంలో నెలకు రూ.10వేలు ఇవ్వాలి.
వడ్డీలేని రుణం ఇవ్వాలి
రజకులు డ్రైక్లీనింగ్, శారి రోలింగ్ సెంటర్లు నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం వడ్డీలేకుండా రూ.10లక్షల వరకు రుణం ఇవ్వాలి. ఉచిత శిక్షణ ఇస్తే వృత్తిలో రాణిస్తారు. కుటుంబాలను పోషించుకుంటారు. ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవాలి. -కొండూరు సత్యనారాయణ, రజకసంఘాల రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్
నెలకు రూ.10వేలు ఇవ్వాలి
వృత్తిలోకి కార్పొరేట్ సంస్థలు రావడం, మరోవైపు కరోనాతో రజకులు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని కూడ పోషించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నెలకు రూ.10వేలు అందజేయడంతో పాటు ఉచితంగా రేషన్ ఇవ్వాలి. స్కూల్ ఫీజుల్లో కూడా రాయితీ ఇప్పిస్తే వారికి చేయూత నిచ్చినట్లవుతుంది. ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవాలి. -ముప్పు భిక్షపతి, అధ్యక్షుడు, రజక సంక్షేమ సంఘం
ఆదుకోవాలి
మాతాత, తండ్రుల నుంచి బట్టలు ఉతుకుతున్నారు. అదే వృత్తిని వారసత్వంగా కొనసాగిస్తున్న.కానీ ఇప్పడు బట్టలు ఇచ్చేవారు తక్కువయ్యారు. గతంలో అంతో ఇంతో వచ్చేది. ఇప్పడు కరోనాతో ఉపాధి లేకుండా పోయింది. కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆర్థికసాయం అందజేయాలి. -ఎస్. మౌలి, యూసుఫ్‌గూడ
ఉతికితేనే బట్టలు బాగుంటయ్..
మిషన్ లో వేసిన బట్టలు తొందరగా పాడవుతయ్.. ఉతికే బట్టలు తెల్లగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం ఉంటాయి. ఆ విషయం తెలియక చాలా మంది కంపెనీలకు ఇస్తున్నారు. దీంతో మాకు కూడా ఉపాధి లేకుండాపోతుంది. కంపెనీ వారు 15రూపాయలు తీసుకుంటే మేము 6 రూపాయలకే డ్రస్ ఉతికి ఇస్తున్నాం. మా లాంటి వారికి ఇస్తే కుటుంబాలను ఆదుకున్నవారవుతారు. -నర్సింహ, శ్రీనగర్ కాలనీ
షరతులు లేకుండా రుణాలివ్వాలి
కరోనాతో ఆర్థికంగా చితికి పోతున్నాం.. ఇంటి అద్దెలు, కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి బ్యాంకులు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. మా కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలి. -శ్రీనివాస్, కృష్ణనగర్, యూసుఫ్‌గూడ