యాప్ లోన్లు చట్ట విరుద్ధం : డీజీపీ

దిశ, క్రైమ్ బ్యూరో: ఆన్ లైన్ యాప్ రుణాలు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. చట్ట విరుద్ధంగా నడిచే ఈ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ రుణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో మీడియాకు డీజీపీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఏ విధమైన రుణాలు పొందాలన్నా.. కచ్చితంగా రిజర్వ్ బ్యాంకు […]

Update: 2020-12-18 11:25 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: ఆన్ లైన్ యాప్ రుణాలు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. చట్ట విరుద్ధంగా నడిచే ఈ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ రుణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో మీడియాకు డీజీపీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఏ విధమైన రుణాలు పొందాలన్నా.. కచ్చితంగా రిజర్వ్ బ్యాంకు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అనేకమంది యాప్‌ల ద్వారా రుణాలు పొంది, తిరిగి చెల్లించే క్రమంలో నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆర్‌బీఐ చట్టం 1934 లోని సెక్షన్ 45-1A ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందన్నారు. ఆర్‌‌బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదన్నారు.

ఈ యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటోందని అన్నారు. సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్‌‌బీఎఫ్‌సీ రిజిస్టర్ అయిన సంస్థలు అందించే వడ్డీలకన్నా ఈ వడ్డీ అత్యధికమని తెలిపారు. రుణ బాధితులు సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అవుతోందని వివరించారు. దీంతో రుణాలు చెల్లించలేని వారిని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్ లైన్ వేదింపులకు ఈ యాప్‌లు పాల్పడుతుంటాయని హెచ్చరించారు. రుణాలను చెల్లించకుంటే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని బెదిరించే యాప్ నిర్వాకులపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలియజేశారు. అంతే కాకుండా, ఈ యాప్‌లు అత్యధికంగా చైనాకు సంబంధించినవే ఉన్నాయన్నారు. లిఖిత పూర్వకంగా లేకపోవడంతో మన ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం అంతా యాప్ నిర్వాకులకు చేరుతోందని సూచించారు. దీంతో మన సమాచారం దుర్వినియోగం అవుతోందన్నారు. ఇంటర్నెట్‌లో లభించే రుణాల యాప్‌లన్నీ మోసపూరితమైనవేనని గ్రహించాలని సూచించారు.

Tags:    

Similar News